కరువు రైతుకు చేయూత ఏదీ! | Input subsidy release Government dont understand | Sakshi
Sakshi News home page

కరువు రైతుకు చేయూత ఏదీ!

Published Wed, Apr 20 2016 4:40 AM | Last Updated on Sun, Sep 3 2017 10:16 PM

కరువు రైతుకు   చేయూత ఏదీ!

కరువు రైతుకు చేయూత ఏదీ!

ఇన్‌పుట్ సబ్సిడీ విడుదలను పట్టించుకోని ప్రభుత్వం
రెండేళ్ల కరువు పరిహారం
►  రూ.383.24 కోట్లు విడుదల ఎప్పుడో

 
 కర్నూలు(అగ్రికల్చర్) : కరువు రైతు నోటిలో ప్రభుత్వం మట్టికొడుతోంది. అప్పులు తెచ్చి పంటలు సాగు చేసినప్పటికీ వర్షాలు పడక పెట్టిన పెట్టుబడులు దక్కక రైతులు నష్టాల ఊబిలో కూరుకుపోయారు. అయినా రైతులపై ప్రభుత్వానికి జాలి లేదు. 2014, 2015 సంవత్సరాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడి పంటలు పూర్తిగా దెబ్బతిన్నా ఇన్‌పుట్ సబ్సిడీ (పెట్టుబడి రాయితీ) అతీగతీ లేకుండా పోయింది. రెండేళ్ల ఇన్‌పుట్ సబ్సిడీ పెండింగ్‌లో ఉన్నా అధికార తెలుగు దేశం ప్రజాప్రతినిధులు నోరుమెదపడం లేదు. 2014 కరువుకు సంబంధించి ఎనిమిదినెలల క్రితం ప్రభుత్వం ఇన్‌పుట్ సబ్సిడీని రైతుల ఖాతాలకు జమ చేసింది. కాని జిల్లా కరువు రైతులను పట్టించుకోకపోవ డంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. 2014 కరువుకు పరిహారంగా రూ.73.24 కోట్లు, 2015 కరువుకు సంబంధించి రూ.310 కోట్లు ఇన్‌పుట్ సబ్సిడీ విడుదల కావాల్సిఉంది. మొత్తంగా జిల్లాకు రెండేళ్ల కరువుకు పరిహారంగా రూ.383 కోట్లు ఇన్‌పుట్ సబ్సిడీ విడుదల కావాల్సిఉంది.
 
ఇన్‌పుట్ సబ్సిడీ విడుదలలో నిర్లక్ష్యం
 కరువుబారిన పడి అల్లాడుతున్న రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ విడుదలలో ప్రభుత్వం అంతులేని నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. వెంటనే ఇన్‌పుట్ సబ్సిడీ విడుదల చేయాలని రైతు సంఘాల నేతలు ప్రభుత్వాన్ని కోరుతున్నా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇప్పటికైన ప్రభుత్వం చొరువ తీసుకోని 2014, 2015 కరువుకు సంబంధించి ఇన్‌పుట్ సబ్సిడీని వెంటనే విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు.
 
 82058 మంది రైతుల ఎదురుచూపు
 2014లో కర్నూలు, ఆదోని డివిజన్‌లో తీవ్ర కరువు ఏర్పడింది. కాని ప్రభుత్వం కేవలం 20 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించింది. జిల్లా అధికారులు 15 మండలాల్లో కరువు లేదని తేల్చారు. కేవలం ఆలూరు, దేవనకొండ, పత్తికొండ, తుగ్గలి, చిప్పగిరి మండలాల్లో మాత్రమే కరువు ఉన్నట్లు నిర్ధారించారు. ఈ మండలాల్లో 82058 మంది రైతులు 75515.26 హెక్టార్లలో నష్టపోయారు. ఐదు మండలాలకు ఇన్‌పుట్ సబ్సిడీ కింద రూ.73.24 కోట్లు విడుదల కావాల్సిఉంది. 2014కరువుకు సంబంధించి కొన్ని నెలల క్రితమే అనంతపురం జిల్లా రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ విడుదల చేసింది. కర్నూలు జిల్లాకు మాత్రం ప్రభుత్వం మొండి చెయ్యి చూపుతోంది. జిల్లా అధికారులు 2014 డిసెంబరులోనే రైతుల బ్యాంకు ఖాతాలు, ఆధార్ నంబ ర్లతో సహా  అన్ని వివరాలు ప్రభుత్వానికి పంపినా ఇంతవరకు అతీగతీలేకుండా పోయింది.
 
 
 రూ.310 కోట్లు పరిహారం విడుదల ఎప్పుడో

 2014తో పోలిస్తే 2015లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. జిల్లాలోని 54 మండలాలు కరువుబారిన పడ్డాయి. పెట్టిన పెట్టుబడుల్లో 30శాతం కూడ దక్కలేదు. కాని ప్రభుత్వం 40 మండలాలను మాత్రమే కరువు ప్రాంతాలుగా ప్రకటించింది. జిల్లా మొత్తాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలని జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి నివేదిక పంపినా పట్టించుకోలేదు. కరువు ప్రాంతాలు ప్రకటించిన 40 మండలాల్లో 3,48,118 మంది రైతులు 2,55,960.71 హెక్టార్లలో పంటలు పూర్తిగా కోల్పోయారు. ఇందుకు ఇన్‌పుట్ సబ్సిడీ కింద రూ.310 కోట్లు విడుదల చేయాల్సిఉంది. గత ఏడాది నవంబర్‌లోనే ఇన్‌పుట్ సబ్సిడీ కోసం జిల్లా అధికారులు నివేదిక పంపినా ప్రభుత్వం నుంచి స్పందన కరువైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement