సాక్షి, చిత్తూరు:
గృహనిర్మాణ శాఖ పరిధిలో చోటుచేసుకున్న అక్రమాలు, అవకతవకలపై ఆ శాఖ ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. గృహనిర్మాణాల్లో చోటుచేసుకున్న అవతవకలు, వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపేందుకు జిల్లా ప్రత్యేక అధికారి ప్రసాద్ దృష్టిసారించారు. ప్రస్తుతం రచ్చబండలో వచ్చిన ఇంటి నిర్మాణ అర్జీలు 20వేల వరకు పెండింగ్‌లో ఉన్నాయి. అలాగే ఇందిరమ్మ ఫేజ్-3 ఇళ్ల నిర్మాణం సాగుతోంది. ఈ క్రమంలో మండల స్థాయిల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి, ఇల్లు కట్టకనే బిల్లు శాంక్షన్ చేసుకుని స్వాహా చేసినట్లు ఫిర్యాదులు వచ్చాయి. వీటన్నింటిపైనా విచారణ జరగనుంది. ప్రధానంగా తిరుపతి కార్పొరేషన్‌లో దామినేడు గృహనిర్మాణశాఖ కాలనీ నిర్మాణం, కేటాయింపుల్లో జరిగిన అవినీతిపై దృష్టిపెట్టారు. ఈ వ్యవహారంలో లోతుగా విచారణ జరపాలని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ ఎండీ ఆదేశాలు జారీచేయటంతో ఈ వ్యవహారంలో మరోసారి విచారణ ప్రారంభం కానుంది.
దామినేడు అక్రమాలపై ..
తిరుపతి రూరల్‌మండలం దామినేడులో మున్సిపల్ కార్పొరేషన్‌లోని ప్రజల కోసం 288కి పైగా ఇళ్లను తొమ్మిది బ్లాక్‌లుగా నిర్మించారు. ఇందుకోసం కోట్ల రూపాయలు వెచ్చిం చారు. ఈ గృహనిర్మాణాలలో అనర్హులకు ఇళ్ల కేటాయింపు,ఇళ్లు అనధికారికంగా అమ్మేసినవి, రెండవ ఫేజ్‌లో గృహ కేటాయింపుల్లో కింది స్థాయి సిబ్బంది చేతి వాటం చూపారనే ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించి ఇది వరకే ఒక కార్పొరేషన్ క్లర్కును సస్పెండ్ చేశారు. దీనిపై కమిషనర్ ఉత్తర్వుల మేరకు అప్పట్లో అదనపు కమిషనర్ ఈశ్వరయ్య విచారణ జరిపి నివేదిక తయారు చేశారు. అప్పట్లో వీటికి సంబంధించిన రికార్డులను విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెం ట్ అధికారులు పరిశీలించారు. ఈ క్రమంలో దీనిపై మరోసారి విచారణ జరపాలంటూ గృహనిర్మాణ శాఖ ఎండీ నుంచి జిల్లా ప్రత్యేక అధికారి ప్రసాద్‌కు ఆదేశాలు అందాయి. ఇప్పటికే దీనిపై విచారణ జరిపి కార్పొరేషన్ కమిషనర్ నివేదిక సమర్పించి ఉన్నం దున, ఆ విచారణలో తేలిన అంశాలు ఏమిటి, ఏఏ వివరాలు అధికారులు అప్పట్లో సేకరించారనేది అధ్యయనం చేసి దాన్ని గృహానిర్మాణ శాఖ ఎండీకి పంపనున్నారు.
1985 నాటి ఇళ్ల నిర్మాణంపైలోకాయుక్త ఆదేశం
పీలేరు నియోజకవర్గంలోని కలికిరి మండలం పల్లవోలు గ్రామంలో 1985లో ఎన్టీఆర్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన గృహనిర్మాణ కాలనీ నిర్మాణంలో అవతవకలు జరిగాయనే దానిపై వేసిన పిటి షన్‌పై విచారణ జరిపి వివరాలు సమర్పించాలని రాష్ట్ర లోకాయుక్త ఆదేశించింది. దీనికి సంబంధించిన వివరాలు కూడా ఇవ్వాలని ప్రత్యేక అధికారి సంబంధిత డీఈ, ఏఈలను ఆదేశించారు. 1985 నాటి ఇళ్ల నిర్మాణాల అవకతవకలపై ఇప్పుడు లోకాయుక్త వి చారణకు ఆదేశించడం ఒక రకంగా చర్చనీ యాంశంగా మారింది.
ఇల్లు కట్టకనే బిల్లులు
కుప్పం నియోజకవర్గం రామకుప్పంలో ఇల్లు కట్టకనే బిల్లులు శాంక్షన్ చేయించుకుని స్వాహా చేసినట్లు అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీనిపై రెండు, మూడు రోజుల్లో విచారణ జరపనున్నారు. సంబంధిత ఏఈ, వర్క్ ఇన్‌స్పెక్టర్లతో పాటు, ఫిర్యాదు చేసిన వారు, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని పిలి పించాల్సిందిగా డీఈకి ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చారు.
ఇందిరమ్మ స్థలాల గొడవ
పుత్తూరు మండలంలో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపునకు సంబంధించి లబ్ధిదారుల మధ్య వివాదం తలెత్తింది. ఇక్కడ ఫేజ్-2 ఇందిర్మ ఇళ్ల నిర్మాణం కోసం కేటాయించిన స్థలాన్నే తిరిగి ఫేజ్-3 ఇందిరమ్మ ఇళ్ల లబ్ధ్దిదారులకు కూడా కేటాయించినట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందింది. దీనిపైన పూర్తి వివరాలు సమర్పించాల్సిందిగా సంబంధిత ఏఈ, డీఈలను ప్రత్యేక అధికారి ఆదేశించారు.
‘గృహ’ అక్రమాలపై విచారణ
Published Wed, Oct 23 2013 3:36 AM | Last Updated on Fri, Sep 1 2017 11:52 PM
Advertisement