
విశాఖ సిటీ: రోహింగ్యా శరణార్థుల కోసం వివిధ పదార్థాలను తీసుకెళ్లిన ఐఎన్‌ఎస్ ఘరియాల్ చిట్టగాంగ్ చేరుకుంది. ఈ నెల 24న కాకినాడ డీప్ వాటర్ పోర్టులో ఐఎన్‌ఎస్ ఘరియాల్ నౌక ద్వారా సుమారు 900 టన్నుల మెటీరియల్‌ను కేంద్ర ప్రభుత్వం తరలించింది. సుమారు 70 వేల మందికి సరిపడా రేషన్ సరుకులు, వస్త్రాలు, దోమ తెరల్ని ఐఎన్‌ఎస్ ఘరియాల్‌లో లోడ్ చేశారు.
ఈ నౌక గురువారం చిట్టగాంగ్ చేరుకుంది. అక్కడ హార్బర్‌లో ఘరియాల్‌కు అధికారులు స్వాగతం పలికారు. అనంతరం నౌక ద్వారా తీసుకొచ్చిన సామగ్రిని చిట్టగాంగ్ డిప్యూటీ కమిషనర్, జిల్లా మేజిస్ట్రేట్ ఎండీ జిల్లూర్ రహ్మాన్ చౌధురికి భారత హైకమిషనర్ హర్షవర్ధన్ శ్రింగ్లా అందజేశారు.