ఇకపై వాట్స్ అప్‌లో రైతులకు సూచనలు
పలమనేరు: ఇన్నాళ్లు పంటలకు సోకే తెగుళ్ల నివారణకు ఏ మందులు వాడాలో తెలుసుకోవాలంటే రైతులు అధికారులు లేదా శాస్త్రవేత్తల వద్దకు పరుగులు తీయాల్సి వచ్చేది. ఇప్పుడు అలా కాకుండా సులభంగా సమస్యకు పరిష్కారం అందేలా వాట్స్ అప్‌తో నూతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రానుంది. ఇందుకోసం ప్రభుత్వం 20 మంది రైతులతో వాట్స్‌అప్ గ్రూపులను ఏర్పాటు చేయనుంది.
కుప్పం నుంచే శ్రీకారం..
తొలుత కుప్పం నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఇప్పటికే సన్నాహాలు చేస్తున్నారు. నాలుగు రోజుల్లో స్మార్ట్‌ఫోన్లున్న రైతుల వివరాలను అందజేయాల్సిందిగా మదనపల్లె సబ్ కలెక్టర్ కర్ణన్ సంబంధిత ఏడీ, ఏవోలను ఆదేశించారు. ప్రస్తుతం ఆ పనుల్లో ఏవోలు, ఏఈవోలు బిజీగా ఉన్నారు. 20 మంది నుంచి వందమంది వరకు ఉన్న ఒకే గ్రూపుతో దీన్ని రూపొం దించనున్నారు. సైంటిస్ట్‌ల గ్రూపును కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ గ్రూపుల్లో రైతు పేరు, గ్రామం, మొబైల్ నెంబర్ తదితర వివరాలు ఉంటాయి.
పంటలకు సోకే తెగుళ్లకు తక్ష ణ పరిష్కారం..
స్మార్ట్ ఫోన్ ద్వారా రైతుల పొలాల్లో సోకిన తెగుళ్లను ఫొటో తీసి వాట్స్‌అప్‌లో పెట్టాలి. దీన్ని పరిశీలించిన అధికారులు లేదా సైంటిస్ట్‌లు ఇది ఎందువల్ల సోకింది, ఏ మందులు వాడాలి, ఎంత మోతాదులో పిచికారీ చేయాలి అనే వివరాలను తిరిగి ఆ రైతు గ్రూపునకు పోస్ట్ చేస్తారు. వాట్స్‌అప్‌కు వచ్చిన మెసేజ్ ఆధారంగా సంబంధిత రైతు ఆ మందులను కొనుగోలు చేసి, అప్పటికప్పుడే పంటకు పిచికారీ చేసుకోవచ్చు.
కుప్పంలో స్మార్ట్‌ఫోన్లున్న రైతుల కోసం మొదలైన సర్వే..
రెండ్రోజులుగా కుప్పం నియోజకవర్గంలో స్మార్ట్‌ఫోన్లు కలిగి ఉన్న రైతుల వివరాలు సేకరించే పనిలో అక్కడి వ్యవసాయశాఖాధికారులు నిమగ్నమయ్యారు. ఇందుకోసం ఆ శాఖకు చెందిన కొందరు ఏవోలను కో-ఆర్డినేటర్లుగా నియమిం చారు. ప్రస్తుతం రామకుప్పం మండలంలోని చెల్దిగానిపల్లెలో ఈ సర్వే సాగుతోంది. ఇక్కడి నాలుగు మండలాల్లో కలిపి దాదాపు 22 వేల మంది రైతులు ఉన్నారు. వీరిలో స్మార్ట్‌ఫోన్ కలిగి ఉన్న రైతు లేదా అతని కుటుంబ సభ్యులు 600 మంది వరకు ఉండవచ్చునని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతానికి మండలానికి వందమందితోనైనా ఈ గ్రూపుల ఏర్పాటుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
ఆపై రాష్ట్ర వ్యాప్తంగా అమలుకు శ్రీకారం..
ఇది విజయవంతమైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ వాట్స్‌అప్ గ్రూపులను ప్రభుత్వం ఏర్పాటుచేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇది విజయవంతమైతే ఇప్పటికే సాంకేతికంగా అందుబాటులో ఉన్న హార్టికల్చర్ వెబ్‌సైట్, అగ్రి నెట్ తదితరాలను రైతులకందుబాటులో ఉంచుతారు. వ్యవసాయ శాఖకు సంబంధించి 18001801551 అనే టోల్‌ఫ్రీ నెంబర్‌ను సైతం ఈ రైతులకు అనుసంధానం చేయనున్నారు.