కురిచేడు: సాగర్ కాలువ ఆధునికీకరణకు ప్రభుత్వం కోట్లు ఖర్చు చేస్తున్నా..మేజర్ల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. మేజర్ల నిండా చెట్లు, మట్టి కుప్పలు నిండి నీరు పారే దారి లేకుండాపోయింది. మండలంలోని నాగార్జున సాగర్ ప్రధాన కాలువ పరిధిలో 7 మేజర్లున్నాయి. వాటి పరిధిలో 13,285.93 ఎకరాల ఆయకట్టు ఉంది. అలాగే దర్శి బ్రాంచ్ కెనాల్ పరిధిలో 9 మేజర్లున్నాయి. వాటి కింద 8077.21 ఎకరాల ఆయకట్టు ఉంది. పమిడిపాడు బ్రాంచ్ కాలువ పరిధిలో పది మేజర్లుండగా..వాటి కింద 36,730 ఎకరాల ఆయకట్టు ఉంది.
దర్శి బ్రాంచ్ కాలువ పరిధిలోని చింతలచెరువు మేజరు పరిస్థితి అధ్వానంగా ఉంది. దీనికింద 1542 ఎకరాల ఆయకట్టు ఉంది. మేజరు నిండా చెట్లు పెరిగి, మట్టికుప్పలు అడ్డుగా ఉన్నాయి. కట్టకు గండ్లు పడినా అధికారులు పట్టించుకోకపోవడంతో ఆ పక్క పొలంలోని రాళ్లను తెచ్చి తాత్కాలికంగా గండిపూడ్చి రాకపోకలు సాగిస్తున్నారు. మేజరుకు 11.71 క్యూసెక్కుల నీరు విడుదల చేయాల్సి ఉంది. ఆ నీరు గండ్లలో నుంచి చెరువులకు చేరుతున్నాయే తప్ప చివరి భూములకు అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ముక్కెల్లపాడు మేజర్ల పరిధిలో 516 ఎకరాల ఆయకట్టు ఉంది. వాటికి 8 క్యూసెక్కుల నీరు విడుదల కావాల్సి ఉంది. మేజరు ఆరంభంలోనే కాంక్రీటు పగిలిపోవడంతో నీళ్లు వదిలినప్పుడు వృథాగా పోతాయి.
దర్శి బ్రాంచ్ కాలువపై పమిడిపాడు బ్రాంచ్ కాలువ పక్కన ఉన్న ఎస్కేప్ చానల్‌కు గోడకూలి నీరు వృథాగా వాగులపాలవుతోంది.
మొక్కుబడిగా సీఈ పరిశీలన
జిల్లాకు తాగునీరు విడుదల చేసిన సందర్భంగా ఆధునికీకరణ పనులు ఎంత మేర జరిగాయి..పనుల్లో నాణ్యత ఎలా ఉందనే అంశాలపై ఎన్‌ఎస్‌పీ సీఈ వీరరాజు శనివారం పరిశీలించారు. అయితే మొక్కుబడి పరిశీలనే తప్ప మేజర్లు, మైనర్ల గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. ఎస్కేప్ ఛానల్‌గుండా నీరు వృథాగా వాగుకు వెళ్లి..అటునుంచి చేపల చెరువుకు చేరుతోంది.
ఎన్‌ఎస్‌పీ అధికారులు చేపల చెరువుల కాంట్రాక్టర్లతో కుమ్మక్కై ఎస్కేప్ ఛానల్‌కు పడిన రంధ్రాన్ని పూడ్చడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. పమిడిపాడు బ్రాంచ్ కాలువ ఆరంభంలో లైనింగ్‌కు రంధ్రాలు పడి నా దాని గురించి అధికారులను సీఈ ప్రశ్నించలేదు.
జిల్లాకు తాగునీటి అవసరాల కోసం విడుద ల చేసిన జలాలు సక్రమంగా తాగునీటి చెరువులకు చేరతాయా? లేక చేపల చెరువులను నింపుతా యా ? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం చేప ల చెరువుల్లో నీరంతా వెళ్లగొట్టి చేపలను పట్టారు. ఇప్పుడు ఆ చెరువులకు నీటి అవసరం చాలా ఎక్కు వ. ఈ తరుణంలో తాగునీరు వృథా కాకుండా, చేపల చెరువులకు వెళ్లకుండా ఎన్‌ఎస్‌పీ అధికారులు ఎలాంటి చర్యలు చేపడతారో వేచిచూడాలి.
సీఈ ఆదేశాలు బేఖాతరు
కాలువ ఆధునికీకరణ పనులను పరిశీలించిన ఎన్‌ఎస్‌పీ సీఈ వీరరాజు కాలువలో అడ్డుగా ఉన్న మట్టికట్టలను, మట్టికుప్పలను తొలగించాలని అధికారులను ఆదేశించారు. లైనింగ్ పనుల సందర్భంగా వదిలేసిన రాళ్లు, మట్టి కుప్పలు వెంటనే తీసేయాలని ఆదేశించారు. కానీ అధికారులు ఆ ఆదేశాలను అమలు చేయలేదు.
మేజర్లిలా..నీరు పారేదెలా..?
Published Mon, Aug 11 2014 2:15 AM | Last Updated on Thu, Jul 11 2019 7:49 PM
Advertisement
Advertisement