కురిచేడు ఘటన.. దర్యాప్తు ముమ్మరం | Police Have Arrested Man In Prakasam District Sanitizer Case | Sakshi
Sakshi News home page

కురిచేడు ఘటన.. దర్యాప్తు ముమ్మరం

Published Sat, Aug 8 2020 5:19 PM | Last Updated on Sat, Aug 8 2020 5:35 PM

Police Have Arrested Man In Prakasam District Sanitizer Case - Sakshi

సాక్షి, ప్రకాశం జిల్లా: కురిచేడులో శానిటైజర్‌ తాగి 16 మంది మృతి చెందిన కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆ ప్రాంతంలో శానిటైజర్లు విక్రయించిన పర్‌ఫెక్ట్‌ శానిటైజర్‌ కంపెనీ నిర్వహకుడు శ్రీనివాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శానిటైజర్లలో మిథైల్‌ ఆల్కహాల్‌కు బదులు మిథైల్‌ క్లోరైడ్‌ వాడినట్లు పోలీసులు గుర్తించారు. శ్రీనివాస్‌ హైదరాబాద్‌ కేంద్రంగా ఈ దందా నిర్వహిస్తున్నాడని.. ఏజెంట్ల ద్వారా కురిచేడు, దర్శిలలో శానిటైజర్లు విక్రయించినట్టు విచారణలో తేలింది. (చదివింది మూడు.. నకిలీ కంపెనీని సృష్టించి)

కురిచేడు మండల కేంద్రంలో జూలై 30వ తేదీ గురువారం రాత్రి శానిటైజర్‌ తాగి ఇద్దరు మరణించారనే వార్త బయటికొచ్చింది. అంతా అప్రమత్తమయ్యే లోపే శుక్రవారం 11 మంది, శనివారం ఇద్దరు, ఆదివారం మరొకరు చొప్పున ఏకంగా 16 మంది మృత్యువాత పడ్డారు. చనిపోయిన వారి ఇళ్ల వద్ద పర్‌ఫెక్ట్‌ కంపెనీ శానిటైజర్‌ బాటిళ్లు గుర్తించిన పోలీసులు అవి ఎవరు అమ్మారనే దానిపై విచారణ జరిపినప్పటికీ కురిచేడులో వాటిని అమ్మిన మెడికల్‌ షాపులు నిర్వాహకులు అప్పటికే వాటిని దాచేసి తమ తప్పును కప్పి పుచ్చుకునేందుకు ప్రయత్నించారు.

అయితే ఘటనను సీరియస్‌గా తీసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో జిల్లా ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌ దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌) ఏర్పాటు చేశారు. బృందం ఐదు రోజుల పాటు గుంటూరు, కృష్ణా జిల్లాలతో పాటు కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు శానిటైజర్‌ ఫ్యాక్టరీలకెళ్లి తనిఖీలు నిర్వహించింది. అయితే పర్‌ఫెక్ట్‌ కంపెనీ ఆనవాళ్లు ఎక్కడా కనిపించకపోవడంతో దర్యాప్తును వేగవంతం చేశారు. హైదరాబాద్‌ నగరంలో శానిటైజర్లు అమ్మే మెడికల్‌ షాపులను క్షుణ్ణంగా తనిఖీలు చేసే క్రమంలో పర్‌ఫెక్ట్‌ కంపెనీ శానిటైజర్లను అమ్ముతున్న డిస్ట్రిబ్యూటర్‌ పాయింట్‌ను కనిపెట్టారు. వీరిని విచారించడంతో పాటు టెక్నాలజీని ఉపయోగించి హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో ఓ గోడౌన్‌లో అక్రమంగా తయారవుతున్న పర్‌ఫెక్ట్‌ కంపెనీ కేంద్రాన్ని గుర్తించిన సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement