సాక్షి, కడప : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని జిల్లా ప్రజలు నిరసన గళం విప్పుతున్నారు. 46 రోజులుగా రెట్టించిన ఉత్సాహంతో అలుపెరగని పోరాటం చేస్తున్నారు. కడప, ప్రొద్దుటూరు, పులివెందుల, జమ్మలమడుగు, పోరుమామిళ్ల, బద్వేలు, రైల్వేకోడూరు తదితర ప్రాంతాలలో శనివారం మహిళా లోకం సమైక్య శంఖం పూరించింది. రాజంపేటలో రణభేరి సభద్వారా సమైక్య నినాదాన్ని మార్మోగించారు.
జిల్లా వ్యాప్తంగా 600 గ్రామాల్లో ఉదయం 4.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కడప నగరం శంకరాపురంలోని 220 కేవీ లైన్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. మరమ్మత్తులు చేసేందుకు వచ్చిన సిబ్బందిని విద్యుత్ కార్మికులు అడ్డుకున్నారు. అయితే ప్రజల ఇబ్బందులు, ఆస్పత్రులలో రోగుల అవస్థలను దృష్టిలో ఉంచుకుని మానవతాదృక్పథంలో సరఫరాను పునరుద్ధరించేందుకు సహకరించారు.
కడప నగరంలో సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో స్టేట్ గెస్ట్‌హౌస్ నుంచి కలెక్టరేట్ వరకు మహిళా ఉద్యోగులు ర్యాలీతో కదం తొక్కారు. కోటిరెడ్డి సర్కిల్, ఏడురోడ్ల కూడలిలో మానవహారంగా ఏర్పడి సమైక్య నినాదాలు చేశారు. విచిత్ర వేషధారణలతో ఆకట్టుకున్నారు. జిల్లాలోని అన్ని గురుకుల పాఠశాలల ఉపాధ్యాయులు, సిబ్బంది త్రివర్ణ పతాకంతో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రైవేటు వృత్తి విద్య కళాశాలల ఆధ్వర్యంలో ఉద్యోగులు ర్యాలీ చేపట్టి దీక్షలు చేస్తున్న వారికి సంఘీభావం తెలిపారు. పశుసంవర్ధకశాఖ ఉద్యోగులు పోస్టుకార్డు ఉద్యమాన్ని చేపట్టి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని రాష్ట్రపతికి కార్డులను పంపారు.
ప్రొద్దుటూరులో మహిళా ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. పుట్టపర్తి సర్కిల్‌లో మానవహారంగా ఏర్పడ్డారు. తహశీల్దార్ శ్రీనివాసులు, కమిషనర్ వెంకట్రావు సంఘీభావం తెలిపారు.
బద్వేలులో 12, 13 వార్డులకు చెందిన యువకులు అగ్ని విన్యాసాలతో భారీ ర్యాలీ చేపట్టారు. మహిళా ఉపాధ్యాయులు ర్యాలీ చేపట్టి రోడ్డుపై రింగ్ బాల్ ఆడారు. మెడికల్, ఆర్టీసీ, రెవెన్యూ శాఖలకు చెందిన మహిళా ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. పోరుమామిళ్ల పట్టణంలో వైఎస్సార్ సీపీ నేతృత్వంలో ఆర్టీసీ బస్టాండు సమీపంలో ఖాళీ బిందెలతో మానవహారాన్ని నిర్మించి నిరసన తెలియజేశారు.
పులివెందుల పట్టణంలో మహిళలు భారీ ర్యాలీ నిర్వహించి పూల అంగళ్ల కూడలిలో మానవహారంగా ఏర్పడ్డారు. నలంద పాఠశాల విద్యార్థులు సాంసృ్కతిక కార్యక్రమాలు నిర్వహించారు. పశుసంవర్ధకశాఖ ఉద్యోగులు పోస్టుకార్డు ఉద్యమాన్ని చేపట్టారు. వేంపల్లెలో ట్రాన్స్‌కో ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. ట్రిపుల్ ఐటీ విద్యార్థులు తరగతులు బహిష్కరించి నిరసన తెలిపారు.
రాయచోటి పట్టణంలో న్యాయవాదులు, జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగాయి. 71 మంది ఆర్టీసీ కార్మికులకు కడపకు చెందిన న్యాయవాది శ్రీకాంత్‌రెడ్డి ఒక్కొక్కరికి 25 కేజీల బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేశారు. చిన్నమండెంకు చెందిన సమైక్యవాదులు మాండవ్య నదిలో జలదీక్షను చేపట్టారు.
రైల్వేకోడూరులో మహిళా ఉపాధ్యాయులు ఖాళీ బిందెలతో నిరసన తెలిపి ర్యాలీ చేపట్టారు. వైఎస్సార్ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు. రాకేష్ (35) అనే సమైక్యవాది గుండెపోటుతో మృతి చెందాడు.
రాజంపేటలో జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రణభేరి కార్యక్రమం సమైక్య నినాదాలతో మార్మోగింది. చిట్వేలి మైలపల్లె ఫీడర్‌లో లైన్‌మెన్‌గా పనిచేస్తున్న వెంకట్రావు రణభేరి సభలో సమైక్య నినాదాలు చేస్తూ కుప్పకూలాడు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందాడు. సభకు ఎమ్మెల్యే ఆకేపాటి, మాజీ మంత్రి బ్రహ్మయ్య, మేడా మల్లికార్జునరెడ్డి హాజరయ్యారు. వంగపండు ఉష ఆటపాటలతో ఆకట్టుకున్నారు.
మైదుకూరులో విశ్వబ్రాహ్మణులు, కార్పెంటర్లు యాగం చేసి మానవహారంగా ఏర్పడ్డారు. రుద్రకాళి, కాళీమాత రూపంలో వేషాలు వేసి విన్యాసాలు చేశారు. జమ్మలమడుగులో వేలాది మంది మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు.
నారీ భేరి
Published Sun, Sep 15 2013 3:33 AM | Last Updated on Fri, Sep 1 2017 10:43 PM
Advertisement
Advertisement