శ్రీకాకుళం:అరకొర సౌకర్యాలు.. హాల్‌టిక్కెట్లు ఇవ్వలేదన్న విద్యార్థుల ఆందోళనల మధ్య ఇంటర్ పరీక్షలకు రంగం సిద్ధమైంది. బుధవారం నుంచి ప్రారంభమయ్యే ఈ పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పరీక్షలకు పకడ్బందీగా నిర్వహించేందుకు తొలిసారిగా సీసీ కెమెరాలు వినియోగిస్తుండగా.. బందోబస్తు తదితర ఏర్పాట్లు పక్కాగా చేశారు. కాగా మరికొన్ని గంటల్లో పరీక్షలు ప్రారంభం కానున్నప్పటికీ తమకు హాల్‌టిక్కెట్లు అందలేదని చాలామంది విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఫీజు కట్టలేదంటూ కొన్ని కార్పొరేట్ కళాశాలలు హాల్‌టిక్కెట్లు ఇవ్వకుండా విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతుండగా, ఆధార్ అనుసంధానం చేయని వారికి హాల్‌టిక్కెట్లు ఇవ్వొద్దని ఇంటర్ బోర్డు అధికారులు జారీ చేసిన ఆదేశాలను కళాశాలల ప్రిన్సిపాళ్లు ఖచ్చితంగా అమలు చేస్తుండడంతో పరీక్ష రాయగలమో లేదోనని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.
పలువురు విద్యార్థులకు నేటికీ ఆధార్ కార్డులు అందలేదు. అటువంటి వారు ఆందోళనతో అధికారులను ఆశ్రయిస్తున్నారు. పరీక్షల నిర్వహణకు జిల్లాలో 91 కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ చాలా కేంద్రాల్లో కనీస సౌకర్యాలు లేవు. ప్రైవేట్ కళాశాలల్లో పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నప్పటికీ ప్రభుత్వ జూనియర్ కళాశాల ల్లో పరిస్థితి దయనీయంగా ఉంది. చాలాచోట్ల విద్యార్థులు నేలపై కూర్చొని పరీక్షలు రాయాల్సిన పరిస్థితి ఉంది. నరసన్నపేట వంటి పట్టణ కేంద్రాల్లోనూ అరకొరగా బెంచీలు మాత్రమే ఏర్పాటు చేశారు. కొన్ని చోట్ల గదులు సరిపోక వరండాల్లో రాయించేందుకు ఏర్పాట్లు చేశారు. జిల్లాలో ఈ పరీక్షలకు 30,470 మంది ప్రథమ, 28,914 మంది ద్వితీయ సంవత్సర విద్యార్థులతో పాటు 3,117 మంది ఒకేషనల్ విద్యార్థులు హాజరుకానున్నారు. ఉదయం తొమ్మిది నుంచి 12 గంటల వరకు పరీక్షలు జరగనుండగా, అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.
అలాగే ఆమదాలవలస, పొందూరు, ఇచ్ఛాపురాల్లో మూడు సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి ఆయా కేంద్రాల్లో తొలిసారిగా సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. కాగా ఎంసెట్‌లో ఇంటర్ మార్కులకు వెయిటేజీ ఇస్తున్నప్పటి నుంచి 90 శాతం పరీక్ష కేంద్రాల్లో మాస్ కాపీయింగ్ జరుగుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. దాంతో మాస్ కాపీయింగ్‌తో సహా ఇతరత్రా అక్రమాలను అడ్డుకొనేందుకు నాలుగు ఫ్లయింగ్, ఐదు సిటింగ్ స్వ్కాడ్‌లను ఏర్పాటు చేశారు. ప్రశ్న పత్రాలను ఇప్పటికే సమీప పోలీస్‌స్టేషన్లలో భద్రపరిచారు. పరీక్షలు జరిగే రోజుల్లో ఉదయం ఎనిమిది గంటలకే చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంటల్ ఆఫీసర్లు, కస్టోడియన్లు ఆయా పోలీసుస్టేషన్ల వద్ద సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఏ రోజు ఏ సెట్ ప్రశ్నాపత్రాలు వాడాలనేది ఆ సమయానికి హైదరాబాద్ నుంచి సమాచారం అందిస్తారు. పరీక్షల నిర్వహణలో సిబ్బందికి శిక్షణ కూడా ఇచ్చి అన్ని ఏర్పాట్లతో అధికారులు సిద్ధంగా ఉన్నారు.
ఇదోరకం పరీక్ష!
Published Wed, Mar 11 2015 2:10 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
Advertisement
Advertisement