కర్నూలు/శ్రీశైలం ప్రాజెక్టు, న్యూస్‌లైన్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ నేపథ్యంలో కర్నూలు జిల్లాలోని సరిహద్దు ప్రాంతంలో రెండు అంతర్ రాష్ట్ర చెక్‌పోస్టులు బుధవారం ప్రారంభమయ్యాయి. కర్నూలు శివారులోని పంచలింగాల క్రాస్‌రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టును రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ శివరాం ప్రసాద్ ప్రారంభించారు. కార్యక్రమంలో మోటారు వాహనాల తనిఖీ అధికారులు రమణ, చంద్రబాబు, శ్రీనివాసరావు, అసిస్టెంట్ మోటారు వాహనాల తనిఖీ అధికారులు శివలింగయ్య, నారాయణ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
శ్రీశైలం నుంచి హైదరాబాద్‌కు వెళ్లే రహదారిలోని జిల్లా సరిహద్దు సున్నిపెంట దగ్గర ఏర్పాటు చేసిన చెక్‌పోస్టును నంద్యాల మోటారు వాహనాల తనిఖీ అధికారి వెంకటేశ్వరరావు ప్రారంభించారు. ఏఎంవీఐలు రవిశంకర్ నాయక్, రాజేశ్వరరావు, శివకుమార్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒక్కో చెక్‌పోస్టు వద్ద ఎంవీఐ ఒకరు, ఏఎంవీఐలు ముగ్గురు నిరంతరం విధుల్లో ఉంటారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు వెళ్లే వాహనాలకు సంబంధించి టెంపరరీ పర్మిట్లు ఇక్కడనే జారీ చేసే ఏర్పాట్లు చేశారు.
మూడు రోజుల నుంచి 30 రోజుల వరకు కూడా తాత్కాలిక పర్మిట్లు ఆయా చెక్‌పోస్టుల వద్ద పొందే వెసులుబాటు కల్పించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణకు వెళ్లాలన్నా.. అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి రావాలన్నా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా రవాణా శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. 2015 మార్చి 31 వరకు ఎలాంటి ట్యాక్సులు చెల్లించకుండానే రెండు రాష్ట్రాల్లో వాహనాలు తిరగవచ్చునని డిప్యూటీ కమిషనర్ శివరాం ప్రసాద్ తెలిపారు.
అంతర్ రాష్ట్ర చెక్‌పోస్టులు ప్రారంభం.
Published Thu, Jun 5 2014 2:13 AM | Last Updated on Sat, Sep 2 2017 8:19 AM
Advertisement
Advertisement