సాక్షి, కర్నూలు: సమైక్యాంధ్ర ఉద్యమం ఉద్ధృతమవుతోంది. ప్రజల స్వచ్ఛందంగా పాల్పంచుకుంటున్నారు. కర్నూలు నగరం ఆందోళనలతో హోరెత్తింది. ఇక గ్రామాల్లో సైతం ప్రజలు రోడ్డుపైకొచ్చి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటనను ముక్తకంఠంతో వ్యతిరేకిస్తుండటం విశేషం.
ప్రధాన రహదారులను దిగ్బంధించి.. అక్కడే వంటావార్పులు నిర్వహిస్తున్నారు. ఆదివారం కర్నూలులో జర్నలిస్టుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వ ఉద్యోగుల అసోసియేషన్‌తో పాటు వికలాంగులు, అంధులు, బధిరులు ఉద్యమ బాట పట్టారు. ఇక న్యాయవాదులు తమ దీక్షలను కొనసాగిస్తున్నారు. కుల.. కార్మిక సంఘాలతో పాటు కాంట్రాక్టు ఉద్యోగులు తమ సంఘీభావం ప్రకటిస్తున్నారు.
ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు సైతం నిరసన కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నాయి. స్థానిక మ్యూజియం వద్ద న్యాయవాదులు చేపట్టిన రిలే నిరాహారదీక్ష శిబిరం, కేవీ సుబ్బారెడ్డి విద్యా సంస్థల అధినేత కె.వి.సుబ్బారెడ్డి, సురక్ష హాస్పిటల్ ఆధినేత డాక్టర్ బి.ప్రసాద్ నిర్వహిస్తున్న ఆమరణ దీక్షా శిబిరాలకు వద్దకు వెళ్లి మాజీ ఎమ్మెల్సీ, వైఎస్‌ఆర్‌సీపీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త ఎస్వీ మోహన్‌రెడ్డి, ఎమ్మెల్సీ సుధాకర్‌బాబు, ప్రత్యేక రాయలసీమ ఉద్యమ నేత కుంచెం వెంకటసుబ్బారెడ్డి, బార్ కౌన్సిల్ రాష్ట్ర సభ్యుడు కృష్ణమోహన్‌లు మద్దతు ప్రకటించారు. ఐదో రోజూ వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ పాటించారు.
టీడీపీ నేత రాంభూపాల్ చౌదరి నేతృత్వంలో రాజ్‌విహార్ సెంటర్ నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. వైద్య ఉద్యోగులు భారీగా తరలి వచ్చి ఎన్టీఆర్ సర్కిల్‌లో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ నిన దించారు. ఇకపోతే రాష్ట్రం విడిపోతే యువత నష్టపోతుందని.. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉద్యమకారులు వినూత్న నిరసన చేపట్టారు. ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్, కేంద్ర మంత్రి చిరంజీవి, రాష్ట్ర మంత్రులు ఏరాసు, టీజీ వెంకటేష్ పేర్లతో కూడిన ప్లకార్డులను గాడిదల మెడల్లో వేసి రాజ్‌విహార్ సెంటర్ నుంచి మ్యూజియం వరకు ప్రదర్శన చేపట్టారు. అయితే మంత్రి టీజీ మౌఖిక ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు వీరి నిరసనను అడ్డుకోవడం గమనార్హం.
నగరంలో వంటావార్పు
జిల్లా అంతటా వంటావార్పు కార్యక్రమం రెండో రోజూ కొనసాగింది. నంద్యాల చెక్‌పోస్టు వద్ద వైఎస్‌ఆర్‌సీపీ కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి, కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త ఎస్.వి.మోహన్‌రెడ్డి నేతృత్వంలో రాస్తారోకో నిర్వహించి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. రోడ్డుపైనే వంటావార్పు నిర్వహించి నిరసన తెలిపారు. అలాగే స్థానిక చెన్నమ్మ సర్కిల్‌లోనూ కల్లూరు రైతు సంఘం, అఖిలపక్ష కమిటీ నేతృత్వంలో వంటావార్పు చేపట్టి, విభజనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎమ్మెల్యే కేఈ ప్రభాకర్ వీరికి మద్దతు తెలిపారు.
ఆలూరులో రాస్తారోకో
సమక్యాంధ్రను కోరుతూ ఆలూరులో జేఏసీ అధ్యక్షుడు సత్యనారాయణ ఆధ్వర్యంలో విద్యుత్ కార్మిక సంఘం నేతలు రాస్తారోకో నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీసీ సంఘం నాయకులు మాదన్న ఆధ్వర్యంలో రిలేనిరహార దీక్షలు ప్రారంభమయ్యాయి. హొళగుందలో జర్నలిస్టులు మోటార్ బైక్‌లతో ర్యాలీ చేపట్టారు.
పత్తికొండ వంటావార్పు..
పట్టణంలో జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయులు, యువకులు ఆర్‌అర్‌బీ అతిథిగృహం నుంచి ప్రదర్శనగా నాలుగు స్తంభాల మంటపం వద్దకు చేరుకుని సోనియా దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం వంటావార్పు నిర్వహించి సహపంక్తి భోజనాలు చేశారు.
పోరు బావుటా
Published Mon, Aug 5 2013 2:54 AM | Last Updated on Fri, Sep 1 2017 9:38 PM
Advertisement
Advertisement