విజయవాడ (గుణదల) : సహవిద్యార్థుల వేధింపులు తట్టుకోలేక ఓ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యకు ఒడిగట్టాడు. 'నువ్వు వాడే సెల్‌ఫోన్ నాదే.. నీకు అంత ఖరీదైన ఫోన్ ఎక్కడిది.. నువ్వే నా ఫోన్‌ని దొంగిలించావు' అంటూ అతడిని ఓ విద్యార్థి.. స్నేహితులతో కలిసి వేధింపులకు గురిచేయడంతో తట్టుకోలేక శుక్రవారం హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని తనువు చాలించాడు. రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్‌కు చెందిన ఓం ప్రకాష్ జైన్, అనిత జైన్ దంపతుల కుమారుడు కరమ్‌జైన్ విజయవాడ ఆంధ్ర లయోల కళాశాలలో ఇంటర్మీడియెట్ చదువుతూ అదే ప్రాంగణంలోని గోగినేని హాస్టల్‌లో ఉంటున్నాడు. ఎంపీసీ ఫస్టియర్‌లో ఉత్తీర్ణుడైనప్పటికీ మార్కులు తక్కువగా రావడంతో బెటర్‌మెంట్ రాయడానికి ఇటీవల వచ్చి హాస్టల్ గదిలో ఉంటున్నాడు.
ఈ క్రమంలో అక్కడే ఉంటున్న విద్యార్థి ఒకరు.. జైన్ వాడుతున్న సెల్‌ఫోన్ తనదేనని, నాలుగు నెలల క్రితం తన వద్ద నుంచి దొంగిలించాడంటూ మరికొందరు విద్యార్థులతో కలిసి వేధించడం ప్రారంభించాడు. తనను దొంగగా చిత్రీకరించిన విషయాన్ని కరమ్‌జైన్ జైపూర్‌లోని తల్లిదండ్రులకు బుధవారం రాత్రి ఫోన్ చేసి చెప్పి బాధపడ్డాడు. కళాశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేయాలని వారు సూచించగా.. ఇంతలోనే అఘాయిత్యానికి పాల్పడి ప్రాణం తీసుకున్నాడు. కుమారుడి ఆత్మహత్య వార్తను తెలుసుకున్న అతడి తల్లిదండ్రులు హుటాహుటిన కళాశాల వద్దకు చేరుకున్నారు. కుమారుడి మృతదేహన్ని చూసి వారు కన్నీరు మున్నీరయ్యారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
సహవిద్యార్థుల వేధింపులకు నిండు ప్రాణం బలి
Published Fri, May 27 2016 7:27 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
Advertisement
Advertisement