సాక్షి, పెందుర్తి: విశాఖపట్నం జిల్లాలోని పెందుర్తిలో అదో ప్రైవేటు జూనియర్ కళాశాల.. కళాశాల యాజమాన్యానికి, భవన యజమానికి ఆర్థిక వివాదాలు తలెత్తాయి. దీంతో విద్యార్థులు తాము చదువుకున్న తరగతి గదిలోనే బందీలుగా ఉండాల్సి వచ్చింది. బాధిత విద్యార్థులు, కళాశాల యాజమాన్యం కథనం ప్రకారం.. స్థానికంగా ఉన్న ఎల్‌ఐసీ భవనం సమీపంలో ఓ భవంతిలో రెండు అంతస్తుల్లో జూనియర్ కళాశాలను నిర్వహిస్తున్నారు. కొద్దిరోజులుగా కళాశాల యాజమాన్యం, భవన యజమాని కె.శ్రీనివాసరావు మధ్య వివాదం నడుస్తోంది. బుధవారం ఉదయం ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది.
ఈ క్రమంలో భవన యజమాని అనుచరులు విద్యార్థులను తరగతి గదుల నుంచి బయటకు పంపేశారు. కొంతమంది విద్యార్థులను గదుల్లో ఉంచి తాళాలు వేసి వెళ్లిపోయారు. దీంతో విద్యార్థులు ఏమి జరిగిందో తెలియక భయాందోళనకు గురయ్యారు. కొన్ని గంటలపాటు విద్యార్థులు బందీలుగా ఉండిపోయారు. చివరకు తోటి విద్యార్థులు తాళాలు పగలకొట్టి వారిని రక్షించారు. ఈ ఘటనపై కళాశాల యాజమాన్యం, విద్యార్థులు పెందుర్తి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మరోవైపు తాము విద్యార్థులను బంధించలేదని, కళాశాల యాజమాన్యమే తాము తాళాలు వేసిన తర్వాత అడ్డదారిలో గదుల్లోకి పంపిందని భవన యజమాని చెబుతున్నారు.
తీవ్ర ఆందోళనకు గురయ్యాం
ఉదయం యధావిధిగా కళాశాలకు వచ్చాం. తరగతి గదిలో పాఠాలు వింటున్న సమయంలో కొందరు వ్యక్తులు ప్రాంగణంలోకి వచ్చారు. మా పక్క గదిలో ఉన్నవారిని బయటకు పంపారు. మమ్మల్ని మాత్రం లోపల ఉంచి గదికి తాళం వేశారు. ఏం జరిగిందో తెలియక తీవ్ర ఆందోళనకు గురయ్యాం.
–సిహెచ్ జయకిషోర్, బాధిత విద్యార్థి
అద్దె సక్రమంగా చెల్లిస్తున్నాం
మేం భవనం అద్దెకు తీసుకున్నప్పుడే అగ్రిమెంట్ రాసుకున్నాం. అద్దె కూడా గత నెల వరకు పూర్తిగా చెల్లించాం. భవన యజమాని దురుద్దేశంతో మమ్మల్ని ఖాళీ చేయమంటున్నారు. దానికి మేం నిరాకరించడంతో విద్యార్థులను బంధించారు. వారికి ఏదైనా ఆపద తలెత్తితే బాధ్యత ఎవరిది?
– పి.సురేశ్, కళాశాల ప్రిన్సిపాల్
Comments
Please login to add a commentAdd a comment