ఇంటర్ విద్యార్థుల ‘ఉపకార’ యాతన
► ఈ–పాస్ వెబ్‌సైట్‌లో కనిపించని జూనియర్ కాలేజీల వివరాలు
► ప్రవేశాల ప్రక్రియ ముగిశాకే లింకు ఇస్తామంటున్న అధికారులు
సాక్షి, హైదరాబాద్: పోస్టుమెట్రిక్ విద్యార్థుల ఉపకార వేతనాల దరఖాస్తుకు చిక్కులు తప్పడం లేదు. ఈ ఏడాది ముందస్తుగా దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభించినప్పటికీ సాంకేతిక సమస్యలు విద్యార్థులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. 2017–18 విద్యాసంవత్సరానికి దరఖాస్తుల స్వీకరణ జూన్ 20న ప్రారంభం కాగా.. ఈ నెల 30తో గడువు ముగియనుంది. అయితే ఇప్పటివరకు ఇంటర్మీడియెట్ విద్యార్థులు ఒక్కరు కూడా ఆన్‌లైన్‌లో దరఖాస్తు సమర్పించలేదు. వెబ్‌సైట్‌లో సమాచార లోపంతో ఈ పరిస్థితి తలెత్తింది. దీంతో దరఖాస్తులకు తుది గడువు సమీపిస్తుండటంతో విద్యార్థుల్లో ఆందోళన తీవ్రమవుతోంది.
ఈ–పాస్‌తో అనుసంధానం చేయకపోవడంతో..
ఈ–పాస్ వెబ్‌సైట్‌లో కాలేజీల సమాచారాన్ని సంబంధిత బోర్డులు/యూనివర్సిటీలు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా జూనియర్ కాలేజీల సమాచారాన్ని ఈ–పాస్ వెబ్‌సైట్‌లో ఇంటర్మీడియెట్ బోర్డు నమోదు చేయాలి. ఇందుకు బోర్డు వెబ్‌సైట్‌ను ఈ– పాస్‌తో అనుసంధానం చేయాలి.
ప్రస్తుతం కోర్సుల్లో ప్రవేశాలు కొనసాగుతుండటంతో ఈ– పాస్ వెబ్‌సైట్‌తో ఇంటర్మీడియెట్ వెబ్‌సైట్‌ను అధికారులు అనుసంధానం చేయలేదు. దీంతో ఉపకారవేతనాల దరఖాస్తులో బీఐఈ(బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్) ఆప్షన్ కనిపించడం లేదు. కాలేజీల సమాచారం లేకపోవడంతో ఆయా విద్యార్థులు దరఖాస్తును సమర్పించలేక పోతున్నారు. ఈ క్రమంలో పలువురు విద్యా ర్థులు సంక్షేమ శాఖలకు ఫిర్యాదు చేశారు. ప్రవే శాల ప్రక్రియ ముగియగానే, వచ్చే వారంలో బోర్డు లింకును అనుసంధానం చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు.