ఇంటర్ విద్యార్థి అదృశ్యంపై కేసు
Published Thu, Oct 17 2013 3:14 AM | Last Updated on Fri, Sep 1 2017 11:41 PM
ఖమ్మం అర్బన్,న్యూస్‌లైన్ :ఖమ్మం నగరంలోని గొల్లగూడెం రోడ్డులో ఉన్న ఒక ప్రైవేటు కళాశాలలో ఇంటర్ చదువుతున్న సీతల కళ్యాణ్ ఈనెల 3 తేదీన హస్టల్ నుంచి అదృశ్యమైనట్లు బుధవారం కేసు నమోదైంది. అర్బన్ పోలీసుల కథనం మేరకు.. నేలకొండపల్లి మండలం రాయిగూడేనికి చెందిన కళ్యాణ్ హస్టల్‌లో ఉండి చదువుకుంటున్నాడు. హస్టల్‌లో ఉండటం ఇష్టం లేక ఈ నెల 3న ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయాడు. ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. విద్యార్థి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బాలాజీనగర్‌లో చోరీ...
ఖమ్మం బాలాజీనగర్‌లో తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... చంద్ అనే కారు డ్రైవర్ కుటుంబంతో సహ మూడు రోజుల క్రితం తిరుపతి వెళ్లాడు. మంగళవారం రాత్రి తిరిగి వచ్చి చూసే సరికి ఇంట్లో ఉన్న రూ. 30 వేలు, కొంత బంగారం చోరీ జరిగింది. బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
బంగారం చోరీ...
ఖమ్మం యూపీహెచ్‌కాలనీలో బుధవారం రాత్రి ఏడు గంటల సమయంలో నడుచుకుంటూ వెళ్తున్న కె.రేణుక అనే మహిళ మెడలో బంగారపు గొలుసు తెంచుకెళ్లారు. ద్విచక్ర వాహనంపై వచ్చిన యువకులు ఒక్కసారిగా దాడి చేసి గొలుసు తెంచుకుని వెళ్లినట్లు బాధితురాలు తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement