ఆందోళన చేస్తున్న యశోద బంధువులు, (ఇన్‌సెట్) యశోద మృతదేహం
ఖమ్మంరూరల్: మండలంలోని గుదిమళ్లకు చెందిన చల్లా యశోద(17) అనే ఇంటర్ విద్యార్థిని ఇంట్లో ఉరి వేసుకొని అనుమానాస్పద స్థితిలో సోమవారం సాయంత్రం మృతి చెందింది. పోలీసులు, స్థానికులు తెలిపిన కథనం ప్రకారం చల్లా వెంకటేశ్వర్లు రంగమ్మల కూతురు యశోద ఖమ్మంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. సోమవారం ఉదయం తల్లిదండ్రులు పనికి వెళ్లగా యశోద ఇంటి వద్దే ఉంది. సాయంత్రం యశోద ఇంట్లో దూలానికి చీరతో ఉరి వేసుకొని అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉంది. పనికి వెళ్లి వచ్చిన తల్లిదండ్రులు తలుపు తీసి చూడగా దూలానికి వేలాడుతూ కనిపించింది. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించగా సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మంగళవారం శవ పరీక్ష పూర్తి చేసి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.
మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చిన వారు తమ కూతురిని ఇంటికి ఎదురుగా ఉన్న నరేష్ అనే యువకుడు వేధించి ఇంట్లోనే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని, మృతదేహంపై గాయాలు కూడా ఉన్నాయని వారు తెలిపారు. తమ కూతుర్ని హత్య చేసిన నరేష్‌పై చర్య తీసుకొని న్యాయం చేయాలంటూ మృతదేహాన్ని నరేష్ ఇంటి ఎదుట ఉంచి ఆందోళనకు పూనుకున్నారు. విషయం తెలుసుకున్న రూరల్ సీఐ తిరుపతిరెడ్డి, కూసుమంచి సీఐ వసంత్‌కుమార్, ఎస్సైలు ఎం.చిరంజీవి, సంజీవరెడ్డి, సర్వయ్య వచ్చి ఆందోళనకారులతో చర్చలు జరిపారు. తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేది లేదని భీష్మించుకుని బైఠాయించారు. దీంతో సీఐ తిరుపతిరెడ్డి విషయాన్ని రూరల్ ఏసీపీ నరేష్‌రెడ్డికి తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఏసీపీ నరేష్‌రెడ్డి ఆందోళనకారులతో చర్చలు జరిపారు. ఈ కేసులో ఎంతటివారినైనా వదిలేది లేదని, నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకొని న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ మేరకు అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ నరేష్‌రెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment