బాయ్ ... అమ్మా, నాన్నా...
ఒంగోలు క్రైం: ఒక్కగానొక్క కుమారుడిని మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో కబళించడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తీరు పలువురిని కంట తడి పెట్టించింది. ఒంగోలు నగరంలోని భీమరాజువారివీధిలో నివాసం ఉంటున్న గోనుగుంట శ్రీనివాసులు, భవానీ దంపతులకు ఇద్దరు పిల్లలు. వారిలో ఒకరు కుమార్తె, మరొకరు కుమారుడు. కుమారుడిని కుటుంబ సభ్యులు అల్లారుముద్దుగా పెంచుకుంటూ వచ్చారు. కుమారుడు వంశీకృష్ణ (18) ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.
శుక్రవారం కర్నూలు రోడ్డులోని ఫ్లయిఓవర్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం అతడి ప్రాణాలు బలి తీసుకుంది. ఇంటర్మీడియెట్ పరీక్షలు ప్రారంభం కావటంతో పేర్నమిట్టలోని ఓ ప్రైవేట్ కాలేజీలో మొదటి సంవత్సరం ఇంగ్లిష్ పరీక్ష రాసి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఆరు నెలల క్రితం ఇంటిల్లిపాదీ వినియోగించుకునేందుకు కొత్త ద్విచక్ర వాహనాన్ని కొన్నారు. ఒక పక్క పరీక్షలు కావటం.. దీనికి తోడు పరీక్ష కేంద్రం పేర్నమిట్టలో ఉండటంతో బస్సుల్లో పోవటం, రావటం సమయం వృథా అవుతుందని భావించి ఇంట్లో ఉన్న ద్విచక్ర వాహనాన్ని పరీక్ష కేంద్రానికి వేసుకొని వెళ్లాడు. తిరిగి వస్తున్న సమయంలో ప్రమాదవశాత్తూ ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన బస్సు కిందపడి మృతి చెందాడు.
తండ్రి శ్రీనివాసులు గంటాపాలెంలో శ్రీసాయి కృష్ణ ఎలక్ట్రికల్ షాప్ నిర్వహించుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందాడని సమాచారం తెలియటంతో ఆ కుటుంబ రోదనలు మిన్నంటాయి. హుటాహుటిన ప్రమాదం జరిగిన స్థలానికి తండ్రి శ్రీనివాసులు, తల్లి భవానీతో పాటు కుటుంబ సభ్యులందరూ వెళ్లారు. ప్రమాదం జరిగిన తీరు చూసి చలించిపోయారు. తల్లి భవానీ ప్రమాద దృశాన్ని చూసి భీతిల్లి అక్కడే కుప్పకూలిపోయింది. ఆమెను సమీపంలోని ఓ హోటల్‌లోకి తీసుకెళ్లి సపర్యలు చేశారు. కోలుకున్న తర్వాత అక్కడి నుంచి ఇంటికి తీసుకెళ్లారు. కుమారుడు విగతజీవుడై రిమ్స్‌లో ఉండటాన్ని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోయారు. తాతా అమ్మమ్మలు వెంకటేశ్వర్లు, శ్రీదేవిలు కూడా రిమ్స్ వద్దకు వచ్చారు. ఆ వృద్ధ దంపతులను ఓదార్చటం ఎవరి తరం కాలేదు.