ప్రతీకాత్మక చిత్రం
సాక్షి,అమరావతి: కెనడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ప్రవాసాంధ్రుడు మృతిచెందగా, మరొకరు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు. స్థానిక కాలమానం ప్రకారం ఈ నెల 16 తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. ఏపీ ఎన్‌ఆర్‌టీఎస్ రీజినల్ కోఆర్డినేటర్ పిరకల రామకృష్ణ, ప్రొ రీజినల్ కోఆర్డినేటర్ కాయం పురుషోత్తంరెడ్డిలు కెనడాలో చాలా కాలంగా నివాసముంటున్నారు.
పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రవాసాంధ్రులకు అండగా ఉండేవారు. ఈ నెల 16 తెల్లవారు జామున మిత్రుడిని కలిసేందుకు వీరు కారులో బయలుదేరారు. కెనడాలోని అంటారియో స్టేట్ మిసెస్ ఆగా గ్రామం హైవేపై వెనుక నుంచి వచ్చిన మరో కారు వీరి కారును ఢీకొట్టింది. దీంతో వీరి కారు స్వల్పంగా దెబ్బతింది. కారును రోడ్డు పక్కన నిలిపి ప్రమాదానికి కారకులైన వారితో మాట్లాడుతుండగా.. మరోకారు వేగంగా వచ్చి వెనుక వైపు నుంచి వీరిద్దరినీ ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఒంగోలుకు చెందిన రామకృష్ణ(42) అక్కడికక్కడే మృతి చెందగా, చిత్తూరు జిల్లా భాకరాపేటకు చెందిన పురుషోత్తంరెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక పోలీసులు వారిని ఆస్పత్రికి తరలించారు. పురుషోత్తమరెడ్డి మృత్యువుతో పోరాడుతున్నారు. విషయం తెలిసిన వెంటనే ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కెనడాలోని బాధితుల కుటుంబసభ్యులను ఫోన్ ద్వారా పరామర్శించారు.
రామకృష్ణ మృతదేహాన్ని ఇండియాకు తీసుకొచ్చేందుకు ఏపీ ఎన్‌ఆర్‌టీఎస్ అక్కడి కోఆర్డినేటర్ చుక్కలూరి వేణుగోపాల్‌రెడ్డి కెనడా ఎంబసీతోనూ, ఏపీ ఎన్‌ఆర్‌టీఎస్ చైర్మన్ వెంకట్ మేడపాటి ఇండియన్ ఎంబసీతో సంప్రదింపులు జరుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment