
అన్ని దారులూ సాగరతీరం వైపే...
విశాఖపట్నం : యుద్ధ నౌకల విన్యాసాలు తిలకించేందుకు విశాఖ వాసులు సాగరతీరం బాట పట్టారు. తీరం వెంట ప్రజలు ఆశక్తిగా రెండో రోజు యుద్ధ నౌకల విన్యాసాల్ని వీక్షించారు. గగనతలంలోంచి అతి సమీపానికి వస్తున్న యుద్ధ విమాన విన్యాసాల్ని ఆసక్తిగా తిలకించారు. గురువారం జరిగిన రిహార్సల్స్‌లో భాగంగా దాడి నుంచి తప్పించుకునేందుకు యుద్ధ విమానాలు ఒక్కసారిగా తలక్రిందులౌతున్న సన్నివేశాలు గగుర్పాటును కలిగించాయి. దేశీయ యుద్ధ నౌకలతో పాటు అంతర్జాతీయ యుద్ధనౌకలు సయితం సాగరంలో కొలువుతీరాయి. యుద్ధ విమానాలు బాంబులు జారవిడుస్తున్న సన్నివేశాలు, యుద్ధ నౌకల నుంచి గగనతలంలోకి నిర్ధేశిత లక్ష్యాల నుద్ధేశించి ప్రయోగించిన మిస్సైల్స్ సాగరతీరం నుంచే వీక్షిస్తున్న ప్రజలను అబ్బురపరిచాయి.
ఇతర ప్రాంతాల నుంచి లగ్జరీ కార్లు
మర్రిపాలెం: ఇంటర్నేషల్ ఫ్లీట్ రివ్యూలో పాల్గొనే దేశీయ, విదేశీ ప్రముఖులకు లగ్జరీ కార్లను ఇతర ప్రాంతాల నుంచి సమకూర్చుతున్నారు. మెర్స్‌డెజ్ బెంజ్, ఆడి, బిఎమ్‌డబ్ల్యూ, రేంజ్ రోవర్, తదితర లగ్జరీ కార్లను రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. విశాఖనగరంలో ఖరీదైన కార్లు అందుబాటులో లేకపోవడంతో ఇతర ప్రాంతాల నుంచి తీసుకురావడానికి నిమగ్నమయ్యారు. లగ్జరీ కార్లను సమకూర్చే బాధ్యతలు డిఫెన్స్ అధికారులు చూస్తున్నారు. ఢిల్లీ, ముంబాయి, చెన్నై, కోల్‌కతా, తదితర ప్రాంతాలలోని ప్రముఖ ట్రావెల్స్‌కు చెందిన కార్లను రప్పిస్తున్నట్టు తెలిసింది. దేశం నలుమూలల నుంచి కార్లను తీసుకురానున్నారు. దాదాపు వంద కార్లు అవసరంగా అధికారులు గుర్తించినట్టు సమాచారం. విమానాశ్రయం నుంచి ప్రముఖుల రాకపోకలు, విడిది, పాల్గొనే ప్రాంతాలకు తగ్గట్టుగా వాహనాల ఏర్పాటుకు సిద్ధపడుతున్నారు.
కమిషనరేట్‌లో టాక్సీలు
అల్లిపురం : ఐఎఫ్‌ఆర్ 16కు నగరానికి విచ్చేసే అతిథులకు టాక్సీలు సిద్ధంగా ఉన్నాయి. ఫ్లీట్ రివ్యూలో సుమారు 3వేల వరకు టాక్సీలను ప్రభుత్వం వినియోగిస్తుంది. విశాఖ జిల్లా, నగరంలో 15 వందల వరకు టాక్సీలు ఫిట్ అయినవి ఉన్నట్లు గుర్తించారు. మిగిలిన టాక్సీలు విజయవాడ, కాకినాడ, ముంబయి ప్రాంతాల నుండి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేశారు. ఫ్లీట్ రివ్యూ దగ్గర పడుతుండడంతో నగరానికి వివిధ ప్రాంతాల నుండి టాక్సీలు వచ్చి నగర పోలీస్ కమిషనరేట్‌లో పార్క్ చేశారు.