
‘షిర్డీ’ వోల్వో ప్రమాదం విచారణకు తెర!
సాక్షి, హైదరాబాద్: ఏడాదిన్నర క్రితం 32 మంది ప్రాణాలను బలిగొన్న శ్రీకాళేశ్వరి ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సు ప్రమాదంపై విచారణకు తెరపడింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇక ఈ కేసు తెరమరుగైనట్టే కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ కేసు విచారణ బాధ్యతను పర్యవేక్షిస్తున్న ఐఏఎస్ అధికారి అరవిందరెడ్డికి రాష్ట్ర పునర్విభజనకు సంబంధించి కీలకమైన నీటిపారుదల అంశాన్ని అప్పగించారు. దీంతో ఆయన సదరు విధుల్లో తలమునకలయ్యారు.
గడువు లేదు: 2012 జూన్‌లో 45 మంది ప్రయాణికులతో శ్రీకాళేశ్వరి ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సు హైదరాబాద్ నుంచి షిర్డీ వెళ్తూ మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లా జాకోట్ గ్రామంలోని ఇరుకు వంతెన పైనుంచి కిందకు పడిపోయింది. అతివేగంగా వెళ్తూ ఎదురుగా వచ్చిన వ్యాన్‌ను తప్పించే ప్రయత్నంలో డ్రైవర్ బస్సును అదుపుచేయలేక పోవడంతోనే ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదానికి అతివేగం, డ్రైవర్ మద్యం మత్తులో ఉండడం, వంతెన ఇరుగ్గా రక్షణ లేకుండా ఉండటం కారణమంటూ రాష్ట్ర రవాణా శాఖ అధికారులు ప్రాథమిక నివేదిక ఇచ్చారు. పూర్తిస్థాయి దర్యాప్తు కోసం ఐఏఎస్ అధికారి ప్రేమ్‌చంద్రారెడ్డితో ఏక సభ్య కమిషన్‌ను ప్రభుత్వం నియమించింది. కొద్దిరోజుల తర్వాత ఆయన స్థానంలో అరవిందరెడ్డిని నియమించింది. కానీ నివేదిక ఎప్పటిలోగా ఇవ్వాలో గడువు మాత్రం విధించలేదు. మరోవైపు ప్రమాదానికి గురైన బస్సు కర్ణాటక రవాణాశాఖ పరిధిలో రిజిస్టరై ఉండటం, ప్రమా దం అక్కడే జరగటంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా అంతగా పట్టించుకోలేదు. ఈ ప్రమాదం తమ రాష్ట్రంలో జరగన ప్ప టికీ కర్ణాటక ప్రభుత్వం దీనిపై దర్యాప్తు జరుపుతోంది. కానీ 32 మంది రాష్ట్రవాసులను బలితీసుకున్న ప్రమాదం విషయాన్ని మన ప్రభుత్వం ఏమాత్రమూ పట్టించుకోలేదు.