మద్దిలపాలెం ఆటోమోటివ్ జంక్షన్‌లో ఢీకొన్న ఆర్టీసీ బస్సు, వ్యాన్
పెదవాల్తేరు(విశాఖ తూర్పు): ఆర్టీసీ వోల్వో బస్సు బీభత్సం సృష్టించింది. పారిశుద్ధ్య కార్మికులను తప్పించే క్రమంలో మద్దిలపాలెం ఆటోమోటివ్ నాలుగు రోడ్ల జంక్షన్‌లో కుడివైపు ఉన్న డివైడర్‌పైకి దూసుకొచ్చింది. ఈ సమయంలో ఎదురుగా వచ్చిన వ్యాన్‌ను ఢీకొట్టింది. వివరాలిలా ఉన్నాయి. మద్దిలపాలెం డిపోకు చెందిన వోల్వో బస్సు విశాఖ నుంచి శ్రీకాకుళం వెళుతోంది. ఈ బస్సు గురువారం ఉదయం 8 గంటల సమయంలో మద్దిలపాలెం ఆటోమోటివ్ జంక్షన్ వద్దకు వచ్చేసరికి కొందరు పారిశుద్ధ్య కార్మికులు రోడ్డు దాటుతుండగా.. వారిని తప్పించే క్రమంలో డ్రైవర్ ఎం.బి.ఎం.రాజు బస్సును కుడివైపు మలుపు తిప్పడంతో అదుపు తప్పి డివైడర్‌పైకి దూసుకుపోయింది.
ఇదే సమయంలో ఇసుకతోట నుంచి మద్దిలపాలెం వైపు వస్తున్న వ్యాన్‌ను బస్సు బలంగా ఢీకొట్టింది. వ్యాను డ్రైవర్ జయరామ్ క్యాబిన్‌లో చిక్కుకుపోవడంతో పోలీసులు, స్థానికులు అతన్ని బలవంతంగా బయటకు తీశారు. ఆయన కాలు విరిగిపోయింది. ఈ ప్రమాదంలో బస్సు అద్దాలు పగిలిపోయాయి. వ్యాను ముందు భాగం నుజ్జయింది. బస్సులో ఉన్న 16 మంది ప్రయాణికులకు ఎటువంటి గాయాలు కాలేదు. వ్యాను డ్రైవర్‌ను జగదాంబ జంక్షన్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు, మద్దిలపాలెం డిపో మేనేజర్ కవిత సంఘట స్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. క్రేన్ల సాయంతో బస్సును రోడ్డు పక్కకు తీశాక మద్దిలపాలెం డిపోకు తరలించారు. దాదాపు గంట సేపు ట్రాఫిక్‌కి తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో చాలా మంది వాహనచోదకులు శివాజీపాలెం, పిఠాపురం కాలనీ మీదుగా రాకపోకలు సాగించారు. బస్సు డ్రైవర్‌ను ఎంవీపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎంవీపీ స్టేషన్ సీఐ సన్యాసినాయుడు పర్యవేక్షణలో ఎస్‌ఐ రవికుమార్ కేసును దర్యాప్తు చేస్తున్నారు.
అమ్మో.. ఆటోమోటివ్ జంక్షన్
మద్దిలపాలెం ఆటోమోటివ్ నాలుగు రోడ్ల కూడలి నిత్యం ట్రాఫిక్‌జామ్‌తో వాహనచోదకులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రోజూ అధిక సంఖ్యలో అంతర్ జిల్లా బస్సులు, సిటీ బస్సులు, ఇతర వాహనాలు ఈ మార్గం ద్వారా రాకపోకలు సాగిస్తుంటాయి. దీంతో పాదచారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రోడ్లు దాటాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ కూడలిలో గతంలో జరిగిన ప్రమాదాల్లో పలువురు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఉన్నాయి. అయినా వాహనచోదకుల్లో మార్పు రావడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. కృష్ణా డిగ్రీ, జూనియర్, ఒకేషనల్ కళాశాలలకు చెందిన విద్యార్థులు వేలాది మంది ఈ రోడ్డులో రాకపోకలు సాగిస్తుంటారు. అధిక సంఖ్యలో వాహనాలు, బస్సులు ఒక్కసారిగా దూసుకురావడంతో పాదచారులు హడలిపోతున్నారు. ఈ కూడలిలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment