దర్యాప్తు ముమ్మరం | Investigation intensifies | Sakshi
Sakshi News home page

దర్యాప్తు ముమ్మరం

Published Mon, Jul 21 2014 1:30 AM | Last Updated on Sat, Sep 29 2018 5:55 PM

దర్యాప్తు ముమ్మరం - Sakshi

దర్యాప్తు ముమ్మరం

  • కిడ్నీ రాకెట్‌పై కదలిక
  •  దుర్గాప్రసాద్ కూలర్ మెకానిక్‌గా గుర్తింపు
  •  నేడు అదుపులోకి తీసుకునే అవకాశం?
  • సాక్షి ప్రతినిధి, విజయవాడ :  కిడ్నీ రాకెట్ ముఠాపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఆదివారం విజయవాడలోని పలు ప్రాంతాల్లో పోలీసులు విచారణ జరిపారు. మిరియాల క్రాంతిదుర్గాప్రసాద్ ఎవరు.. ఎక్కడున్నాడు.. ఎందుకు తహశీల్దార్, సబ్ కలెక్టర్ సంతకాలు ఫోర్జరీ చేసి కిడ్నీని అమ్ముకునేందుకు ప్రయత్నించాడు.. అనే కోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు. ‘ఫోర్జరీ మాటున కిడ్నీ రాకెట్’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనాన్ని పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. ఈ కేసు దర్యాప్తునకు ఉన్నతాధికారులు సత్యనారాయణపురం పోలీస్‌స్టేషన్ ఎస్‌ఐ నరేష్‌ను రంగంలోకి దించారు. ‘సాక్షి’లో వార్తను చదివిన దుర్గాప్రసాద్ బంధువులు పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది.
     
    దర్యాప్తులో పురోగతి
     
    సత్యనారాయణపురంలోని టి.రామారావు అనే వ్యక్తి ఇంట్లో నాలుగేళ్ల కిందట క్రాంతిదుర్గాప్రసాద్, ఆయన తండ్రి అద్దెకు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. క్రాంతిదుర్గాప్రసాద్ తండ్రి కృష్ణప్రసాద్ రైల్వేలో నాలుగో తరగతి ఉద్యోగిగా తేలింది. ప్రస్తుతం విజయవాడలోని సత్యనారాయణపురం రైల్వే కాలనీలో నివాసం ఉంటున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. క్రాంతిదుర్గాప్రసాద్ కూడా తండ్రితో పాటు ఉంటున్నట్లు నిర్ధారించారు. అయితే పోలీసులు వెళ్లిన సమయంలో ఇద్దరూ ఇంట్లో లేరు. సోమ, మంగళవారాల్లో అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
     
    సర్టిఫికెట్లలో ఒకటి, అర్జీలో మరోపేరు...
     
    ఫోర్జరీ సంతకాలతో పొందిన రెసిడెన్స్, ఫ్యామిలీ స్ట్రక్చర్ సర్టిఫికెట్ ఆఫ్ డోనర్‌లో మిరియాల క్రాంతి దుర్గాప్రసాద్ అని ఉంది. అయితే తహశీల్దార్‌కు పెట్టుకున్న అర్జీలో మాత్రం తాను ప్రైవేట్ ఉద్యోగినని, తన భార్య, తాను తప్ప తమకు ఎవరూ లేరని, తన పేరు మిరియాల క్రాంతికుమార్ అని పేర్కొని ఉంది. సర్టిఫికెట్స్‌లో ఒకపేరు, అర్జీలో మరోపేరు రాయడం కూడా చర్చకు దారితీసింది. దీనిపై కూడా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. అసలు పేరు ఏమిటనేది పోలీసుల దర్యాప్తులో వెల్లడి కావాల్సి ఉంది. ఫోర్జరీ సంతకాలతో పొందిన సర్టిఫికెట్లపై 2014, ఏప్రిల్ 24వ తేదీ ఉంది.
     
    ప్రస్తుతం మా వద్దకు క్రాంతి దుర్గాప్రసాద్ రాలేదు...
     
    మిరియాల క్రాంతి దుర్గాప్రసాద్ అనే వ్యక్తి కిడ్నీ ఇవ్వడానికి వచ్చాడా.. అని హైదరాబాద్‌ని సత్య కిడ్నీ సెంటర్‌కు ఫోన్‌చేసి ‘సాక్షి ప్రతినిధి’ ప్రశ్నించగా.. ప్రస్తుతం అటువంటి వారు ఎవరూ లేరని బదులిచ్చారు. గతంలో వచ్చి ఉంటే రికార్డులు పరిశీలించాల్సి ఉందన్నారు. ఇందుకు సంబంధించిన ప్రత్యేక వైద్యుడు సోమవారం డ్యూటీకి వస్తాడని ఆయన్ను సంప్రదిస్తే పూర్తి వివరాలు తెలుస్తాయని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
     
    విజయవాడలో రెండు ఆస్పత్రులకే లెసైన్స్...
     
    విజయవాడలో కిడ్నీ ఆపరేషన్ చేసేందుకు రెండు ఆస్పత్రులకు మాత్రమే ప్రభుత్వ లెసైన్స్ ఉంది. ఒకటి ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రి కాగా రెండోది అరుణ్ కిడ్నీ సెంటర్. గుంటూరులో గుంటూరు సిటీ హాస్పిటల్‌కు లెసైన్స్ ఉంది. ఈ ఆస్పత్రులకు వెళ్తే వెంటనే గుర్తించి అరెస్ట్ చేయించే అవకాశం ఉన్నట్లు తెలుసుకున్న దుర్గాప్రసాద్ హైదరాబాద్‌లోని సత్య కిడ్నీ సెంటర్‌ను ఆశ్రయించినట్లు సమాచారం. హైదరాబాద్‌లో కిడ్నీ ఇస్తే ఎటువంటి ఇబ్బందులు ఉండవని, తనను ఎవరూ ప్రశ్నించే అవకాశం లేదని దుర్గాప్రసాద్ భావించి ఉండవచ్చని తెలుస్తోంది.
     
    ఆరేళ్ల కిందట జోరుగా కిడ్నీల వ్యాపారం
     
    విజయవాడలో ఆరు సంవత్సరాల కిందట కిడ్నీల వ్యాపారం జోరుగా సాగింది. ఆటోవాలాలు ఎక్కువ మంది కిడ్నీలు అమ్ముకున్నారు. దీంతో అప్పట్లో పోలీసులు రంగంలోకి దిగి పలువురిని అరెస్ట్ చేశారు. పేదరికాన్ని ఆసరాగా చేసుకుని మాయమాటలు చెప్పి కిడ్నీలు తీసి అమ్ముకున్నారు. దీనివెనుక పలువురు వైద్యుల హస్తం అప్పట్లో ఉన్నట్లు స్పష్టమైంది.

    అవయవ దానం చట్టం ప్రకారం..
     
    ప్రధానంగా కిడ్నీ దానం చేయాలంటే తన రక్తసంబంధీకులై ఉండాలి.
     
    భార్యాభర్తలు కిడ్నీలు దానం చేసుకోవాలంటే వారి వివాహానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు చూపించాలి.
     
    రక్త సంబంధీకులైతే డీఎన్‌ఏ పరీక్షలు చేస్తారు.
     
    అవయవ మార్పిడి చట్టం-1994 ప్రకారం రెవెన్యూ అధికారుల నుంచి ధ్రువీకరణ పత్రాలు పొందాల్సి ఉంది.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement