జిల్లాకు చెందిన ఇద్దరికి సివిల్స్‌లో మంచి ర్యాంకులు లభించాయి. ఎల్.కోటకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయుకుడు కూరాకుల సూర్యారావు
విజయనగరం అర్బన్, ఎల్.కోట: జిల్లాకు చెందిన ఇద్దరికి సివిల్స్‌లో మంచి ర్యాంకులు లభించాయి. ఎల్.కోటకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయుకుడు కూరాకుల సూర్యారావు కుమార్తె శ్రావణి 544 ర్యాంక్, బొండపల్లి మండలం కొవ్వడిపేట గ్రామానికి చెందిన లండ సాయి శంకర్ 937వ ర్యాంక్ సాధించారు. శ్రావణి ప్రస్తుతం రాజమండ్రిలో డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు. ఆమె రాజస్థాన్ బిట్స్‌ఫిలానిలో ఇంజినీయరింగ్ పూర్తి చేసి, గ్రూఫ్ -1లో ఉత్తమ ప్రతిభ కనబర్చి డీఎస్పీగా సెలక్టయ్యరు. డీఎస్పీగా ట్రైనింగ్ సమయంలో రాష్ట్ర గవర్నర్ నర్సింహన్ చేతులు మీదగా నాలుగు మెడల్స్‌ను పొందారు.
937వ ర్యాంకర్ లండ సాయి శంకర్ ఇంటర్మీడియెట్ వరకు తెలుగుమీడియంలోనే చదివారు. ఈయన ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో పట్టభద్రుడు. ప్రస్తుతం జిల్లా కేంద్రంలోని విద్యుత్‌శాఖ విజిలెన్స్ విభాగంలో అసిస్టెంట్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. పదేళ్లుగా ఈ ఉద్యోగం చేస్తూ నాలుగుసార్లు సివిల్స్ పరీక్షలకు వెళ్లి రెండుసార్లు ఇంటర్వ్యూలో ఫెయిలయ్యారు. తాజా ఫలితాల్లో వచ్చిన ర్యాంక్‌కు ఇండియన్ రెవెన్యూ సర్వీసు (ఐఆర్‌ఎస్) కేటగిరిలో పోస్టు లభించే అవకాశం ఉంది. ఈ సందర్భంగా సాయి శంకర్ మాట్లాడుతూ ఒకసారి ఫెయిల్ అయ్యామని యువత నిరాశపడరాదన్నారు. సివిల్స్ రాయడానికి ఇచ్చిన అన్ని అవకాశాలను వినియోగించుకొనేలా సానుకూల ధోరణలో ప్రిపేరైతే విజయం సాధించవచ్చన్నారు.