నిజామాబాద్‌అర్బన్, న్యూస్‌లైన్ : జిల్లాలోని పలు ఆస్పత్రులలో పని చేయడానికి రెండు రోజుల క్రితం ఎనిమిది మంది వైద్యులను వైద్య విధాన పరిషత్‌లో కాంట్రాక్టు పద్ధతిలో తీసుకున్నారు. ఏ నిబంధనలనూ పరిగణనలోకి తీసుకోకుండానే వీరిని నియమించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇదీ ప్రక్రియ
ఆస్పత్రులలో వైద్యుల నియామకం చేపట్టాలంటే పలు నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ముందుగా కలెక్టర్, వైద్య విధాన పరిషత్ కమిషనర్ అనుమతి తీసుకోవాలి. వీరికి వేతనాలకు సంబంధించిన నిధులు మంజూరైన తర్వాత నోటిఫికేషన్ విడుదల చేయాలి. దరఖాస్తుల స్వీకరణ అనంతరం రోస్టర్ పాయింట్లు, సీనియారిటీలను పరిగణనలోకి తీసుకొని సెలక్షన్ కమిటీ నియామకాల ప్రక్రియ పూర్తి చేస్తుంది. సెలక్షన్ కమిటీలో జిల్లా వైద్యాధికారి, జాయింట్ కలెక్టర్, జిల్లా ఆస్పత్రుల సమన్వయకర్త ఉంటారు.
కలెక్టర్ చెప్పినా
ముందుగా నియామకాల కోసం కలెక్టర్‌కు ఫైల్ పంపారు. ఇందుకోసం వైద్య విధాన పరిషత్ కమిషనర్ అనుమతి తీసుకోవాలని ఆయన సూచించారు. కానీ డీసీహెచ్‌ఎస్ (డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్) దీనిని పరిగణనలోకి తీసుకోకుండా నే నియామకాల ప్రక్రియ చేపట్టారు. కాంట్రాక్టు పద్ధతిలో వైద్యులను నియమించి సంబంధిత సెక్షన్ ఉద్యోగులకు సంబంధం లేకుండానే నియామక పత్రాలను సైతం ఇచ్చేశారు. ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో ఒకరిని, బాన్సువాడ ఆస్పత్రిలో నలుగురిని, జిల్లా ఆస్పత్రిలో ముగ్గురిని నియమించారు. ఉన్నతాధికారుల అనుమతి తీసుకోకుండా నియామకాలు చేపట్టినందున సదరు వైద్యులకు వేతనాలు ఎలా ఇస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది.
గతంలోనూ
గత నెలలో ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి ఆదేశాలు లేకుండానే వైద్యవిధాన పరిషత్‌లో ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లకు సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి ఇచ్చిన వ్యవహారం వివాదాస్పదమైంది. అయినా సదరు అధికారి తీరు మార్చుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఉన్నతాధికారుల అనుమతితోనే
ఆస్పత్రులలో వైద్యుల అవసరం ఉంది. అందుకే ఉన్నతాధికారులు, కలెక్టర్ అనుమతి తీసుకునే నియామకాలు చేపట్టాం. ఇంతకు ముందు పీహెచ్‌సీ లలో చేసినవారినే తీసుకున్నాం. - బాలకృష్ణ, జిల్లా ఆస్పత్రుల సమన్వయకర్త
వైద్య‘విధానం’ లేదు
Published Thu, Feb 27 2014 5:18 AM | Last Updated on Sat, Sep 2 2017 4:07 AM
Advertisement
Advertisement