కేంద్రాస్పత్రి అంబులెన్స్
ద్విచక్రవాహనం వాడాలంటే నెలకు కనీసం పదివేల వరకూ ఖర్చవుతున్న రోజులివి. ఇక నాలుగు చక్రాల వాహనం వాడాలంటే ఎంత మొత్తంలో ఖర్చవుతుందో వేరే చెప్పాలా? కానీ సర్కారు ఆస్పత్రుల్లోని అంబులెన్సులకు మాత్రం ప్రభుత్వం అందించే మొత్తాలెంతో తెలుసా...? కేవలం రూ. 6వేలే. ఈ మొత్తంతో ఏం చేయాలనుకుంటున్నారు. రోజూ విశాఖ కేజీహెచ్‌కు రోగులను తరలించాలి. అదెలా సాధ్యమని అనుకుంటున్నారా... దానికి ప్రభుత్వమే సమాధానం చెప్పాలి.
విజయనగరం ఫోర్ట్: సర్కారు ఆస్పత్రుల్లోని అంబులెన్సులపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. నిరుపేదల రోగులను పెద్దాస్పత్రులకు తరలించా లంటే ఈ వాహనాలే దిక్కు. అలాంటి వాహనాలకు ఇచ్చే నిర్వహణ మొత్తాలు నామమాత్రంగా ఉండటం ఇప్పు డు చర్చనీయాంశమవుతోంది. జిల్లాలో వైద్య విధాన్ పరిషత్ ఆధ్వర్యంలో జిల్లాకేంద్రాస్పత్రి, ఘోషాస్పత్రి, పా ర్వతీపురం ఏరియా ఆస్పత్రి, బాడంగి, భోగాపురం, ఎస్.కోట, గజపతినగరం ఆస్పత్రులు నడుస్తున్నాయి. వీటిల్లో బాడంగికి అంబులెన్సు సౌకర్యం లేదు. భోగా పురం, గజపతినగరం అంబులెన్సులు మూలకు చేరా యి. ఘోషాస్పత్రి, కేంద్రాస్పత్రి, ఎస్.కోట, పార్వతీపు రం ఏరియా ఆస్పత్రులకు అంబులెన్సులున్నా... వాటికి డీజిల్ వేయించలేక అరకొర సేవలందిస్తున్నాయి.
నెలకు డీజిల్ బడ్జెట్ రూ.6 వేలే
ఒక్కో అంబులెన్సుకు నెలకు కేవలం రూ. ఆరువేలే సర్కారు కేటాయిస్తోంది. వాస్తవంగా అయ్యే ఖర్చులో ఇది పదోవంతు కూడా కాదు. ఒక్కో అంబులెన్సుకు నెలకు రూ. 50 వేల నుంచి రూ. 60 వేల వరకు ఖర్చవుతుండగా ప్రభుత్వం ఇచ్చే రూ. ఆరువేలతో ఎలా నెట్టుకురావాలన్నది అంతుచిక్కడంలేదు. జిల్లా కేంద్రాస్పత్రి, ఘోషాస్పత్రి, పార్వతీపురం ఏరియా ఆస్పత్రి, ఎస్.కోట ఆస్పత్రుల నుంచి రోజూ కేజీహెచ్‌కు రోగులను రిఫర్ చేస్తుంటారు. రోజుకు కనీసం ఒక్కో ఆస్పత్రి నుంచి రెండు, మూడు రిఫరల్స్ అయినా ఉంటాయి. కేజీహెచ్‌కు వెళ్లి రావాలంటే డీజిల్‌కు రూ. 700 నుంచి రూ. 800 వరకు ఖర్చవుతుంది. పార్వతీపురం నుంచైతే రూ. 1500ల వరకు ఖర్చవుతుంది. దీంతో ప్రభుత్వం ఇచ్చే డీజిల్ బడ్జెట్ రూ. 6 వేలు ఏమూలకూ చాలట్లేదు.
డీజిల్ బడ్జెట్ పెంచని ప్రభుత్వం
ఎన్నో ఏళ్ల నుంచి ప్రభుత్వం అంబులెన్సులకు ఇచ్చే డీజిల్ బడ్జెట్ ఇదే. ఏడాదికేడాదికీ డీజిల్ ధరలు బాగా పెరిగాయి. ఈ నేపథ్యంలో డీజిల్ బడ్జెట్‌ను కూడా పెంచాల్సి ఉంది. ప్రస్తుతం కనీసం నెలకు రూ. 40 వేల నుంచి రూ. 50 వేల వరకు ఇవ్వాలి. అలా ఇస్తేనే రోగులందరిని ఉచితంగా కేజీహెచ్‌కు తీసుకుని వెళ్లడానికి అవకాశం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment