ఆపదలో 108 అంబులెన్స్ సేవలు
విశ్లేషణ:
ఆపద వేళలో ఆపద్భాంధవునిగా సేవలు అందిస్తున్న 108 అంబులెన్స్‌లు ప్రభుత్వ నిర్లక్ష్యంతో కుంటుపడుతు న్నాయి. ఆగస్టు 15, 2005న అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రతిష్టాత్మకంగా ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. 752 వాహ నాలతో 108 అంబులెన్స్ సర్వీసులు ఆనాడు ప్రారంభమైనాయి. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో సత్యం రామ లింగరాజుకు వాటి బాధ్యతలను అప్పజెప్పారు. ఒక్కో వాహ నానికి నెలకు రూ.95,000 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం చెల్లించేది. ఇందులో 95 శాతం ప్రభుత్వ నిధులు, 5 శాతం సత్యం రామ లింగరాజు నిధులు. 2011లో పూర్తి ప్రభుత్వ నిధులతో ఈ బాధ్య తలను నిర్వహించే షరతు మీద జీవీకే సంస్థకు అప్పగించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఈ సేవలు మెరుగవుతాయని భావించారు. కానీ మరింత నిర్లక్ష్యానికి గురవుతున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో 337 అంబులెన్స్‌లున్నాయి. వీటిలో 21 వాహనాలు రిజర్వులో ఉంటాయి. మిగిలిన 316 వాహనాలు తిరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఒక్కో వాహనానికి నెలకు రూ.1,30,000 చొప్పున మొత్తం 316 వాహనాలకు, నెలకు రూ.4,10,80,000 ఖర్చు చేస్తున్నారు. అంటే ఏటా రూ.49,29, 60,000 ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నప్పటికీ వీటి నిర్వహణ ఎలా ఉందో ప్రభుత్వం పట్టించు కోవడం లేదు. వీటిని నిర్వహిస్తున్న ప్రైవేటు సంస్థ ప్రభుత్వం నుండి తీసుకుంటున్న డబ్బుకు లెక్కలు చూపించడం లేదని ఏసీబీ, కాగ్ సంస్థలు వేలెత్తి చూపాయి.
రాష్ట్ర ప్రభుత్వం 2011-2012 సంవత్సరంలో 108 వాహ నాలను ఆధునీకరించడానికి, అంటే బేసిక్ లైఫ్ సపోర్టు నుండి అడ్వాన్స్‌డ్ లైఫ్ సపోర్టు కోసం రూ.79 కోట్లు విడుదల చేశామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కాని మొత్తం డబ్బులు విడుదల కాలేదని జీవీకే యాజమాన్యం అంటుంది. మరి ఆ నిధులు ఎటు వెళ్లాయి? 2014 అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు వాహనాలలో డీజిల్ కోసం ప్రభుత్వం రూ.3,22,88,353లు విడుదల చేసింది. ఇందులో జీవీకే రూ.1,98,70,176లు ఖర్చు చేసిందని చెబు తున్నారు. మిగిలిన రూ.12,418,177 నిధుల గురించిన సమా చారం లేదు.
108 ఒక్కో వాహనానికి 2:5 నిష్పత్తి చొప్పున రెండు షిఫ్టులకు ఐదుగురు సిబ్బంది పనిచేయాలి. ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బంది వాహనాల సంఖ్య చూస్తే చాలినంత సిబ్బంది లేదన్న విషయం స్పష్టమవుతుంది. యంఓయూలో కుదుర్చుకున్న ప్రకారం ఐదుగురు ఉద్యోగులకు రూ.77,878లు చెల్లించాలి. కాని రూ.50,000ల లోపు చెల్లిస్తున్నారు. ప్రతిరోజూ 1,500-2,000 కేసులు తీసుకెళ్లాలి. కాని సగం మాత్రమే తీసుకువెళుతున్నారు. ఎంఓయూలో కుదుర్చుకున్న ప్రకారం 108 వాహనాలకు ఫోన్ చేసినప్పుడు 20 నిమిషాల లోపు పట్టణాల్లో, 25 నిమిషాల్లో గ్రామాల్లో, 30 నిమిషాల లోపు ఏజెన్సీ ప్రాంతాలలో చేరు కోవాలి. కాని ఇది అమలు జరగటం లేదు.
108 వాహనాల్లోని సిబ్బంది, కాల్ సెంటర్ సిబ్బంది అందరూ గత 10 సంవత్సరాలుగా చాలీచాలని వేతనాలతో, 8 గంటల పనివిధానం అమలుకాక, ఉద్యోగ భద్రత లేక దినదిన గండం నూరేళ్ల ఆయుష్షుగా విధులు నిర్వహిస్తున్నారు. వీరి న్యాయమైన సమస్యలపై మెరుగైన సర్వీసులను అందించుటకు గాను సిబ్బంది అందరూ ఐక్యంగా ఉమ్మడి (ఏపీ) రాష్ట్రంలో మూడుసార్లు తెలంగాణ రాష్ట్రంలో ఒకసారి నిరవధిక సమ్మె చేశారు. 2015, మే 13-24 వరకు 11 రోజులు సమ్మె చేసినప్పుడు ప్రభుత్వం తరఫున వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగారు ఇద్దరు శాసనసభ్యులతో ద్విసభ్య కమిటీని వేస్తూ, రూ.1,000లు వేతనం తక్షణం పెంచుతున్నామని, అకారణంగా తొలగించిన ఉద్యోగు లను తిరిగి విధులకు తీసుకుంటామని ప్రకటించి రెండు నెలల గడువు కావాలని కోరితే ఉద్యోగులందరూ ప్రభుత్వంపై గౌర వంతో ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని సమ్మె విర మించారు. ద్విసభ్య కమిటీ తన నిదేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది. రెండు నెలల్లో న్యాయం చేస్తామని చెప్పి 6 నెలలు గడుస్తున్నా ఒక్క హామీ కూడా అమలు కాలేదు.
భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల ప్రకారం ప్రభు త్వం ప్రజలందరికీ నాణ్యమైన ఉచిత వైద్యం అందించాలి. కాని ఆదేశిక సూత్రాలను తుంగలో తొక్కిన ప్రభుత్వాలు ఉచిత వైద్యాన్ని గాలికి వదిలేసి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం 108 అంబులెన్స్ సర్వీసుల నిర్వహణ మీద వెంటనే దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఇందులో మొదటిది 108 సేవలను ప్రైవేటు యాజమాన్యం నుండి తప్పించి ప్రభుత్వమే నేరుగా 108 వాహనాల నిర్వహణ బాధ్యతలు చేపట్ట డం, ప్రతి మండలానికి ఒక వాహనం ఏర్పాటు చేయడం, కాలం చెల్లిన వాహనాల స్థానాల్లో కొత్త వాహనాలు కొనుగోలు చేసి నడిపించడం, వాహనాలకు సరిపడా సిబ్బందిని నియమించడం సుదీర్ఘ కాలం నుండి పనిచేస్తున్న సిబ్బందిని యథావిధిగా పర్మి నెంట్ చేయడం లాంటి తక్షణ చర్యలు చేపడితే 108 వాహనాలు ప్రజలకు అన్ని విధాలుగా ఉపయోగపడతాయి.
వ్యాసకర్త తెలంగాణ యునెటైడ్ మెడికల్,హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు. మొబైల్: 94410 11195