జంగారెడ్డిగూడెం రూరల్ :పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని జిల్లాలోని రైతులు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారని, ఈ పథకం పనులు జరిగితే తీవ్రంగా నష్టపోతామని మొరపెట్టుకుంటున్నా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు చీమకుట్టినట్టు కూడా లేదని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని విమర్శించారు. రైతులు ఎత్తిపోతల పథకాన్ని వ్యతిరేకిస్తున్నారనే విషయాన్ని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లకపోవడం దారుణమన్నారు. శనివారం జంగారెడ్డిగూడెంలో పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు వందనపు సాయి బాలపద్మ ఇంటి వద్ద పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆళ్ల నాని మాట్లాడుతూ జిల్లాలో ఇసుక మాఫియా రోజు రోజుకూ పెరిగిపోతుందన్నారు.
ఈ మాఫీయూలో ఎక్కువశాతం అధికారపార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు భాగస్వాములుగా ఉండటంతో చర్యలు చేపట్టాల్సిన అధికార యంత్రాంగం కూడా పట్టించుకోవడం లేదన్నారు. తక్కువ ధరకు ఇసుకను సామాన్య ప్రజలకు అందించేలా చూడాలని నాని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ముందు రైతులకు నిరంతరాయంగా 9 గంటలు విద్యుత్ సరఫరా చేస్తామని చెప్పిన ప్రభుత్వం రానున్న వేసవిలో ఎటువంటి కోతలు లేకుండా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలన్నారు. వే సవిలో తాగు, సాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం పనిచేయాలన్నారు. ప్రజా సమస్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాడేందుకు ఐదు అంశాలపై కార్యాచరణ రూపొందించామని, ఈ అంశాలపై ఈనెల 23న జరిగే సమావేశంలో చర్చించనున్నామని నాని తెలిపారు. ఈ నెలాఖరులోగా జిల్లాలో మండల, పట్టణ కమిటీలను పూర్తిచేస్తామని చెప్పారు.
వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జిల్లా కన్వీనర్ వందనపు సాయిబాలపద్మ, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పోల్నాటి బాబ్జి, తల్లాడ సత్తిపండు, నగర పంచాయతీ కౌన్సిలర్లు తాతకుంట్ల నాగ వెంకటలక్ష్మి, ముప్పిడి అంజి, నాయకులు బీవీఆర్ చౌదరి, రావూరి కృష్ణ, రాఘవరాజు ఆదివిష్ణు, కొయ్య రాజారావురెడ్డి, కేమిశెట్టి మల్లిబాబు, మంగా రామకృష్ణ, తాతకుంట్ల రవికుమార్, బుగ్గా సత్యనారాయణ, వందనపు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
‘ఎత్తిపోతలు’ను వ్యతిరేకిస్తున్నాపట్టదా?
Published Sun, Feb 22 2015 12:38 AM | Last Updated on Fri, May 25 2018 9:20 PM
Advertisement