సాక్షి, నెల్లూరు : పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ముంబైలో దాడులకు పాల్పడి మంగళవారానికి ఐదేళ్లు గడిచింది. 2008 నవంబర్ 26న ముంబైలో దాడులకు దిగి మారణహోమం సృష్టించి 166 మందిని పొట్టన పెట్టుకున్నారు. భూమి, ఆకాశాల మీదుగా కాకుండా ఉగ్రవాదులు సముద్ర మార్గం గుండా ప్రవేశించి మారణహోమం సృష్టించడంతో దేశం ఒక్కసారిగా ఉలికిపాటుకు గురైంది. ఈ దాడులు సముద్ర తీరభద్రత డొల్లతనాన్ని తేట తెల్లం చేసింది. ఆ తర్వాత తీరం భద్రతపై దృష్టిపెట్టినా ఇప్పటికి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. గుజరాత్ తర్వాత మన రాష్ట్రంలో అత్యధికంగా సముద్ర తీర ప్రాంతం ఉంది.
ఒక్క నెల్లూరు జిల్లా పరిధిలోనే సుమారు 190 కిలో మీటర్ల సముద్ర తీర ప్రాంతం ఉంది. దీంతో రాష్ట్రంలో భద్రతను పటిష్టం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టాయి. అందులో భాగంగా తీర ప్రాంతంలో మెరైన్‌పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. జిల్లా పరిధిలో దుగ్గరాజపట్నం, శ్రీహరికోట, కృష్ణపట్నం, ఇస్కపల్లి ప్రాంతాల్లో ఇప్పటికే మెరైన్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. సమర్థులైన సిబ్బంది నియామకం, పరికరాలు, బోట్లు, బైనాక్యులర్స్ తదితరాలు అందుబాటులో ఉంచడంలో ప్రభుత్వం శ్రద్ధ చూపలేదన్న ఆరోపణలు వెల్లు వెత్తుతున్నాయి. ముఖ్యంగా మెరైన్ పోలీస్ స్టేషన్లు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. కొన్నింటికి సొంతభవనాలు కూడా లేవు. ఇస్కపల్లి మెరైన్ పోలీస్‌స్టేషన్ అద్దెభవనంలో కొనసాగుతోంది. దీనికి బోటు కూడాలేదు. ఇక సిబ్బందికి ప్రత్యేక శిక్షణ అంటూ లేదు.
కనీసం ఈతరాని వారిని మెరైన్ పోలీస్ స్టేషన్‌లో నియమించడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. సాధారణ శాంతి భద్రతల్లో పనిచేస్తూ వివిధ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని పనిష్మెంట్ కింద మాత్రమే మెరైన్ పోలీస్ స్టేషన్‌లకు బదిలీ చేస్తున్నారు. దీంతో ఆసక్తి లేకుండానే సిబ్బంది పనిచేయాల్సి వస్తోంది. అధికారులు సైతం ఎక్కువ కాలం పని చేయడం లేదు. ప్రజా ప్రతినిధుల సిఫార్సులతో కొద్దిరోజులకే లా అండ్ ఆర్డర్‌కు వెళ్లిపోతున్నారు. ఇక మెరైన్ పోలీస్ స్టేషన్ల ప్రారంభంలో సిబ్బందికి అన్ని రకాల వసతులు, ప్రయోజనాలు కల్పిస్తామన్న అధికారుల మాటలు నీటి మూటలే అయ్యాయి. అదనపు అలవెన్సులు, టీఏలు అసలే లేవు.
మెరైన్ విధులు
సముద్రంలో మెరైన్ పోలీసులు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండి విధులు నిర్వహించాల్సి ఉంది. తీరం నుంచి 12 నాటికల్ మైళ్ల వరకు మెరైన్ పోలీసులు గస్తీ నిర్వహించాల్సి ఉంది. నిత్యం తీరంలో ఉదయం, సాయంత్రం, రాత్రి గస్తీ నిర్వహించాల్సి ఉంది. అందుకు సంబంధించి వీరికి బోట్లు, బైనాక్యులర్స్, ఇంటర్నెట్ తదితర సౌకర్యాలు కల్పించాల్సి ఉంది. మత్స్యకారులతో సత్సంబంధాలు నెరుపుతూ మెరైన్ పోలీసులు పనిచేయాలి. సముద్రంలో కొత్తవారి కదలికలు, సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకుని పోలీసులు, నిఘా విభాగాలకు తక్షణం తెలపాలి. కాని మెరైన్ పోలీసుల దగ్గర అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సంగతి దేవుడెరుగు బోట్లే కాదు, బైనాక్యులర్స్, లైఫ్ జాకెట్స్ సైతం లేవు.
షార్, కృష్ణపట్నం పోర్టు భద్రత ప్రశ్నార్థకం
ప్రపంచంలో రాకెట్ లాంచింగ్ సెంటర్‌గా పేరు పొందిన షార్ జిల్లాలోనే ఉంది. తూర్పు సముద్ర తీరం 50 కిలో మీటర్ల బంగాళాఖాతం షార్ పరిధిలో ఉంది. అయితే ఇంత సుదీర్ఘ తీరప్రాంతంపై భద్రత నామమాత్రంగా ఉంది. గతంలో బాంగ్లాదేశ్‌కు చెందిన యువకుడు సముద్ర మార్గం గుండా ప్రవేశించి దుమారం రేపిన విషయం, భారీ స్థాయిలో షార్‌కు చెందిన సామగ్రి సముద్ర ప్రాంతం వద్ద దొరకడం గమనార్హం. ఈ రెండు ఉదాహరణలు షార్ పరివాహక ప్రాంతంలో భద్రత డొల్లతనాన్ని తెలియచేస్తోంది. అత్యంత సాంకేతిక పరిజ్ఞానం, విలువైన శాస్త్రజ్ఞులు నిత్యం దేశ, విదేశీ ప్రతినిధులతో ప్రయోగాలు చేసే షార్ రక్షణపై దీర్ఘ ప్రణాళికతో వ్యవహరించాల్సి ఉంది. కృష్ణపట్నం పోర్టులో కోస్టుగార్డు ప్రధాన కార్యాలయం ఉంది. మెరైన్ రక్షణ సిబ్బంది కొరత, సౌకర్యాలు అంతత మాత్రమే ఉన్నాయి. విదేశీ వర్తక నౌకలు తరచూ వచ్చే ఈ ప్రాంతంలో సిబ్బంది కొరత రక్షణను ప్రశ్నార్థకంగా చేస్తోంది.
స్టాండింగ్ కమిటీ సూచనలు
అమలు కాని వైనం..
తీరం భద్రతపై గతేడాది కేంద్ర హోంశాఖ స్టాండింగ్ కమిటీ అధ్యక్షుడు వెంకయ్యనాయుడు నేతృత్వంలో కమిటీ సభ్యులు తూర్పు తీర ప్రాంతంలో భద్రతపై విసృ్తత పరిశీలన చేశారు. అవసరమైన సూచనలు, సలహాలను ఇస్తూ కేంద్ర హోం శాఖకు నివేదికను సమర్పించారు. జిల్లాలోని షార్, కృష్ణపట్నం పోర్టుల భద్రతపై తీసుకోవాల్సిన అతి కీలక అంశాలను వారు ఈ నివేదికలో పొందు పరిచారు. అయితే సంవత్సరం గడుస్తున్నా ఆ నివేదికలు కార్యాచరణ దాల్చక పోవడం బాధాకరం. తరచూ కలెక్టర్, ఎస్‌పీ, నేవీ, కోస్టుగార్డు, మెరైన్ తదితర శాఖల అధికారులు సమావేశమై తీరం భద్రతపై సమీక్షించాల్సి ఉంది. ఈ సమావేశాలు మొక్కుబడిగా సాగుతుండటంతో తీర ప్రాంత భద్రత లోప భూయిష్టంగా మారుతోంది. గగన, భూ మార్గాలకంటే జల మార్గంలో విదేశీయులు, ఉగ్రవాదులు దేశంలోకి చొరబడే అవకాశాలు సులువుగా ఉన్నాయనే విషయాలు అధికారులకు తెలిసినప్పటికీ తీర ప్రాంత భధ్రతపై శీతకన్ను వేయడం బాధాకరం. ప్రమాదాలు, అనుకోని సంఘటనలు జరిగినప్పుడు భద్రతపై చర్చలు జరిపేకంటే ముందస్తు చర్యలు పాటించి తీర ప్రాంతాన్ని, దేశ భద్రతను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని తీర ప్రాంత వాసులు, దేశ ప్రజలు కోరుతున్నారు.
తీరం ఎంత భద్రం?
Published Tue, Nov 26 2013 2:54 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement
Advertisement