విస్తరణ సాధ్యమేనా..?
సహకార రంగంలోని గోవాడ చక్కెర మిల్లు విస్తరణపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సామర్థ్యాన్ని ఏకంగా రెట్టింపు చేస్తామంటూ సీఎం చంద్రబాబు ముఖ్యమంత్రి ప్రకటించడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. విస్తరణ పక్రియ మంచి దే అయినప్పటికీ ఒకే సారి 8వేల టన్నుల క్రషింగ్ కెపాసిటీని పెంచడం ఏమేరకు సాధ్యమన్న వాదన వ్యక్తమవుతోంది. ఫ్యాక్టరీ ఆదాయం, ఇతర వనరులు, అదనపు సామర్థ్యం పెంపు నకు సరిపోతాయా అన్నన్నది అంతుచిక్కని ప్రశ్న అవుతోంది.
చోడవరం: గోవాడ సుగర్ ఫ్యాక్టరీని 1961లో 1250టన్నుల కెపాసిటీతో నిర్మించారు. ఆ తర్వాత 1600టన్నులకు,1987-88లో 2500టన్నులకు విస్తరించారు. 2001లో నాలుగు వేల టన్నుల సామర్థంతో బాయిలర్ హౌస్‌ను ఏర్పాటు చేశారు. 12 మెగావాట్ల కో-జనరేషన్ ప్లాంట్ ఏర్పాటయింది. చోడవరం, మాడుగుల, నర్సీపట్నం, పెందుర్తి, అనకాపల్లి నియోజకవర్గాల నుంచి ఈ ఫ్యాక్టరీకి చెరకు సరఫరా అవుతుంది. 23,844 మంది సభ్యరైతులు ఉన్నారు. పదెకరాలకు
మించి చెరకు పండించేది కేవలం 200మందే . మిగతా వారంతా చిన్న, సన్నకారు రైతులే. మిల్లు పరిధిలోని రైతులు ఏటా 25వేల ఎకరాల్లో సుమారు 6లక్షల టన్నుల చెరకు ఉత్పత్తి చేసి సరఫరా చేస్తున్నారు. కెపాసిటీ మేరకు సీజన్‌లో 5 నుంచి 5.2లక్షల టన్నుల వరకు గానుగాడుతున్నారు. మిగతాది పక్కజిల్లాలోని ప్రైవేటు ఫ్యాక్టరీలకు తరలిపోతోంది. మరో 20వేల ఎకరాల్లో పండుతున్న చెరకు బెల్లంగా తయారు చేసి అనకాపల్లి మార్కెట్‌కు తరలిస్తున్నారు. ఇప్పటికీ ఈ ప్రాంత రైతులు సనాతన పద్ధతుల్లోనే గెడలు విధానంలో నాట్లు చేపడుతున్నారు. డ్రిప్ పద్ధతిని కేవలం 10శాతం మందే ఆచరిస్తున్నారు.
పరిస్థితులు అనుకూలిస్తే పల్లపు ప్రాంతాల్లో ఎకరాకు 35-40టన్నులు, మెట్ట, వర్షాధారపు భూముల్లో 25-30టన్నుల చెరకు దిగుబడి వస్తోంది. మిల్లు రోజువారీ క్రషింగ్ సామర్థ్యం 4వేల టన్నులు. ఒక్కసారిగా సామర్థ్యాన్ని 8వేలకు పెంచితే..బెల్లం తయారీకి కాకుండా మిల్లుకు చెరకు సరఫరా అవుతుందా అన్నది అనుమానం. లేదంటే అదనంగా మరో 20వేల ఎకరాల్లో చెరకు పండించాలి. లక్ష్యం మేరకు చెరకు సాగుకు రైతుల్లో చైతన్యం రావాలి. దీనికి కొంత సమయం పడుతుంది. ఆ పని ఇప్పట్లో జరిగేది కాదన్న భావన ఎక్కువ మంది రైతుల్లో వ్యక్తమవుతోంది. ఏటా డిసెంబరు నుంచి ఫిబ్రవరి వరకు గానుగాడుతారు. మొలాసిస్ ట్యాంక్‌లు, పంచదార నిల్వలు చేసే గోడౌన్లు సరిపడినన్ని లేవు. దీనివల్ల ప్రైవేటు గోడౌన్లను అద్దెకు తీసుకుంటున్నారు. వీటినీ అదనంగా ఏర్పాటుచేయాల్సి ఉంది.
అన్నీ అనుమానాలే..
ఒకే సారి 8వేల టన్నుల కెపాసిటీకి పెంచడానికి రూ.160కోట్లతో అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. క్రషింగ్ మిషనరీ సామర్థ్యం పెంచడం, కో-జనరేషన్, ఇథనాయిల్ కర్మాగారం, మొలాసిస్, పంచదార నిల్వల గోడౌన్లు అదనంగా ఏర్పాటు, బిందుసేద్యం, ఆధునిక పద్ధతిలో చెరకు సాగు వంటివి ప్రతిపాదనల్లో పేర్కొన్నట్టు తెలిసింది.
ఈ డబ్బు ప్రభుత్వం ఇస్తుందా?.. లేక అప్పుగా ఫ్యాక్టరీకి ఇస్తుందా అన్నది శేష ప్రశ్న. అప్పుగా ఇస్తే ఇన్ని కోట్లకు వడ్డీ చెల్లింపు యాజమాన్యానికి భారమవుతుంది. ఇప్పుడున్న మిషనరీ కాకుండా గ్యారేజీ వెనుక భాగంలోని పాత మిల్లుహౌస్‌లో కొత్త యూనిట్‌ను ఏర్పాటుచేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇవన్నీ రానున్న సీజన్‌కు విఘాతం కలగకుండా చేస్తారా? అన్‌సీజన్‌లో చేస్తారా అన్నదీ అంతుచిక్కని ప్రశ్న.