Govada sugar factory
-
గోవాడ సుగర్స్‌పై పచ్చనేత కన్ను!
చైర్మన్ పదవి కోసం పావులు కదుపుతున్న వైనం! పాలకవర్గం, ఫ్యాక్టరీ వర్గాల్లో తీవ్రచర్చ చోడవరం: రాష్ట్ర సహకార రంగంలో అతిపెద్దదైన గోవాడ సుగర్ ఫ్యాక్టరీపై తెలుగుదేశం పార్టీ పెద్దలు డేగకన్ను వేసినట్టు తెలిసింది. లాభాల బాటలో నడుస్తూ ఏటా 5 లక్షల టన్నుల చెరకు గానుగాడుతూ సుమారు రూ.130 కోట్ల టర్నోవర్‌తో నడుస్తున్న ఈ ఫ్యాక్టరీని గతంలోనే చంద్రబాబు హయాంలో ప్రైవేటు వ్యక్తులకు అమ్మేయాలని యోచించిన సంగతి తెలిసిందే. అప్పట్లో టెండర్ల వరకు కూడా వెళ్లారు. అయితే ఇంతలో టీడీపీ అధికారం కోల్పోయి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో ప్రైవేటీకరణకు బ్రేక్‌పడింది. వైఎస్ సహకార ఫ్యాక్టరీలకు నిధులిచ్చి బలోపేతం చేయడంతో గోవాడ ఫ్యాక్టరీ రైతుల ఫ్యాక్టరీగా ఇప్పటివరకు మనుగడ సాగిస్తూ వస్తోంది. తిరిగి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక ఆయన సామాజిక వర్గానికి చెందిన కొందరు ఈ ఫ్యాక్టరీని ఎలాగైనా స్వాధీనం చేసుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. టీడీపీ కేంద్ర మంత్రి సుజనా చౌదరికి బంధువైన సుధాకర చౌదరి ఈ ఫ్యాక్టరీపై ఎప్పటి నుంచో కన్నేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో ఆయన ఈ ఫ్యాక్టరీకి మేనేజింగ్ డైరక్టర్‌గా పనిచేశారు. ఈ ఫ్యాక్టరీలో సభ్య రైతుగా కొన్ని షేర్లు కూడా ఆయనకున్నాయి. అప్పట్లో ఈ ఫ్యాక్టరీ ద్వారా ఎలాంటి లాభాలు వస్తాయో చవిచూసిన ఆయన ఎలాగైనా దక్కించుకోవాలనే యోచనలో ఉన్నట్టు ఈ ప్రాంతంలో తీవ్ర చర్చ జరుగుతోంది. దీనిలో భాగంగానే రాష్ట్రంలో సుగర్ ఫ్యాక్టరీల మనుగడపై గత ఏడాది ప్రభుత్వం వేసిన అధ్యయన కమిటీలో ఆయనొక కీలక సభ్యునిగా నియమించారని ఇక్కడ చెప్పుకుంటున్నారు. దీనిపై అప్పట్లో ఈ ప్రాంత రైతుల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో పాటు అధ్యయన కమిటీ చర్చల్లో సైతం రైతులు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇంతజరిగినా ఆయన కన్ను మాత్రం గోవాడపైనే ఉన్నట్టు తెలిసింది. ప్రస్తుత పరిస్థితిలో ఈ ఫ్యాక్టరీని ప్రైవేటు పరం చేసే అవకాశం లేకపోవడంతో ఏదో విధంగా పాగా వేయాలని ఆ నేత ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు ఫ్యాక్టరీ చైర్మన్ పదవి కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే తనకు అనుకూలంగా ఉన్న డైరక్టర్లతో పాటు మరికొందరిని తమ వైపు తిప్పుకొని ప్రస్తుతం ఉన్న చైర్మన్ గూనూరు మల్లునాయుడిని దింపేయాలనే ఆలోచనలో కూడా ఆయన పావులు కదుపుతున్న తెలిసింది. అయితే ప్రస్తుత చైర్మన్ కూడా టీడీపీ వారే కావడంతో కొంత ఇబ్బంది ఎదురైనప్పటికీ బోర్డును రద్దుచేసేలా కూడా వ్యూహం రచిస్తున్నట్టు ఫ్యాక్టరీ వర్గాల్లో చర్చజరుగుతోంది. తనకు అనుకూలంగా ఉన్న ఒక డైరక్టర్‌ను రాజీనామా చేయించి ఆ స్థానంలో డైరక్టర్‌గా పోటీచేసి తర్వాత ఫ్యాక్టరీ చైర్మన్ కావాలన్నదే ఆయన వ్యూహంగా కనిపిస్తోంది. ఇందుకోసం ఫ్యాక్టరీ వర్గాల్లో కొందరితో ఆయన లోపాయికారి మంతనాలు చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ వ్యూహం వెనుక ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి చెందిన ఒక లాబీంగ్ కూడా నడుపుతున్నారని ఫ్యాక్టరీ పాలకవర్గంలో ఉన్న కొందరు అధికారపార్టీ నాయకులే బహిరంగంగా చెబుతున్నారు. ఈ పరిస్థితిలో మరి సుధాకరచౌదరి వ్యూహాన్ని ప్రస్తుత చైర్మన్ మల్లునాయుడు ఏవింధంగా ఎదుర్కొంటారనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. -
గోవాడ సుగర్స్‌లో అవినీతిపై విచారణ
విచారణ అధికారిగా జేసీ నియామకం? ఆరోపణలపై నిలదీసిన వైఎస్సార్సీపీ తొలుత స్పందించని సర్కారు మహాజన సభ నేపథ్యంలో నియామకానికి అంగీకారం చోడవరం: గోవాడ సుగర్ ఫ్యాక్టరీలో అవినీతి రోపణలపై రాష్ర్టప్రభుత్వం విచారణ కమిటీని వేసినట్టు తెలిసింది. హుద్‌హుద్ తుఫాన్లో వ ఫ్యాక్టరీకి చెందిన పంచదార నిల్వల గొడౌన్ల పైకప్పులు దెబ్బతిని 2.15లక్షలక్వింటాళ్ల పంచదార బస్తాలు తడిపోయిన విషయం తెలిసిందే. ఇందులో కశింకోట సిడబ్ల్యుసి గొడౌన్లో తడిసిపోయిన 1.19లక్షల క్వింటాళ్ల పంచదార అమ్మకాలు, ఓరియంటల్ ఇన్సూరెన్సు కంపెనీ వేసిన టెండర్లలో గోల్మాల్ జరిగిందనే ఆరోపణలు తలెత్తాయి. సుమారు రూ.8కోట్ల మేర చేతులు మారాయంటూ వైఎస్సార్సీపీ,సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్, రైతులు సంఘాలు, యువజన సంఘాలు ఆరోపించాయి. రిలేదీక్షలు, ఆందోళనలు కూడా చేశాయి. ఇప్పుడు వైఎస్సార్సీపీ 10వేల సభ్యరైతుల సంతకాలు కూడా సేకరించి ప్రభుత్వానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైంది. ఈ అవినీతి ఆరోపణపై విచారిచాలంటూ చోడవరం ఎమ్మెల్యే కెఎస్ఎన్ఎస్ రాజు కూడా ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ప్రతిపక్షాల ఆందోళనపై ఇప్పటి వరకు మోనంగా ఉన్న ప్రభుత్వం ఎమ్మెల్యే ఫిర్యాదును కూడా పక్కన పెట్టినట్టు తెలిసింది. ఈనెల 30న ఫ్యాక్టరీ మహాజన సభ ఉంది. ఇందులో సభ్యరైతులు ఈ విషయమై ప్రశ్నించే అవకాశముంది. దీంతో కనీసం విచారణ కమిటీ వేసినా కొంత బయటపడవచ్చునని ఎమ్మెల్యే, ముఖ్యమంత్రిపై మరింత ఒత్తిడి తెచ్చినట్టు తెలిసింది. ప్రభుత్వం విచారణకు ఒప్పుకున్నట్టు సమాచారం. జిల్లా కలెక్టర్‌కు ప్రభుత్వం నుంచి సోమవారం ఆదేశాలు రావడంతో జిల్లా రెండవ జాయింట్ కలెక్టర్‌ను విచారణ అధికారిగా నియమించినట్టు తెలిసింది. -
అట్టుడికిన గోవాడ
ఫ్యాక్టరీలో అవినీతిపై మహా ధర్నా.. మానవహారం వైఎస్సార్సీపీ పిలుపునకు అనూహ్య స్పందన.. సీపీఐ, కాంగ్రెస్ మద్దతు ధర్నాను అడ్డుకోబోయిన పాడేరు ఏఎస్సీతోరైతుల వాగ్వాదం విచారణకు అమర్, బూడి, ధర్మశ్రీ డిమాండ్ రిలే నిరశనలు ప్రారంభం చోడవరం: గోవాడ సుగర్ ఫ్యాక్టరీలో అవినీతిపై వెంటనే విచారణ చేపట్టాలని, రైతులకు బకాయిలు చెల్లించాలని కోరుతూ ఫ్యాక్టరీ గేటు ఎదుట సోమవారం మహాధర్నా చేశారు. రిలేదీక్షలు ప్రారంభించారు. వైఎస్సార్సీపీ పిలుపుమేరకు పెద్ద సంఖ్యలో రైతులు, పార్టీ నాయకులు హాజరుకాగా సీపీఐ, కాంగ్రెస్ పార్టీలు మద్దతు ఇచ్చాయి. ఫ్యాక్టరీ గేటు ఎదుట మానవహారం చేయడంతో ఇరు వైపులా సుమారు 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ఆందోళన సజావుగా సాగుతున్న సమయంలో పాడేరు ఏఎస్పీ బాబూజీ ఆవేశంగా అక్కడకు వచ్చి మానవహారంలో ఉన్న వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఏఎస్పీని చూసి అక్కడే ఉన్న చోడవరం సీఐ కిరణ్‌కుమార్, పోలీసు సిబ్బంది రంగంలోకి దిగి రైతులను, నాయకులను పక్కకు తోసేసి ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు ప్రయత్నించారు. దీనిని రైతులు ప్రతిఘటించారు. పోలీసుల దౌర్జానాన్ని నిరసిస్తూ వైఎస్సార్సీపీ, సీపీఐ, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు వాహనాలకు అడ్డంగా రోడ్డుపై బైఠాయించారు. రైతుల బాధలంటే పోలీసులకు అంత చులకనా అంటూ ఏఎస్పీని నిలదీశారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్, మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు, పార్టీ చోడవరం సమన్వయకర్త కరణం ధర్మశ్రీ పోలీసు అధికారులతో మాట్లాడి ఆందోళన యథావిధిగా కొనసాగించారు. దీంతో ఏఎస్పీ అక్కడ నుంచి వెళ్లిపోయారు. త్వరలో కలెక్టరేట్ ముట్టడి: అమర్నాథ్ ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడుతూ చంద్రబాబులాగే ఆ పార్టీ నాయకులు కూడా అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. గోవాడ, అనకాపల్లి చెరకు రైతుల సమస్యల పరిష్కారం కోరుతూ త్వరలో గోవాడ నుంచి అనకాపల్లి మీదుగా జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్ర చేసి కలెక్టరేట్ ముట్టడి చేస్తామన్నారు. మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాల నాయుడు మాట్లాడుతూ బినామీల పేరుతో పంచదారను అమ్మి రూ. 8కోట్లు అవినీతికి పాల్పడినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. కేసు మాఫీచేసుకోవడానికే ముఖ్యమంత్రి దగ్గరకి స్థానిక ఎమ్మెల్యే వెళ్లారు తప్ప విచారణ వేయమని చెప్పడానికి కాదని విమర్శించారు. కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ గోవాడ అవినీతి అంతా చోడవరం ఎమ్మెల్యే అండతోనే జరిగిందని ఆరోపించారు. టెండర్లు వేయకుండా కేంద్ర మంత్రి సుజనా చౌదరి బందువుకు లక్షకుపైగా క్వింటాళ్ల పంచదారను ఎలా విక్రయిస్తారని ఆయన ప్రశ్నించారు. దీనిపై తక్షణం సీబీఐ లేదా సిటింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సీపీఎం డివిజన్ కార్యదర్శి రెడ్డి పల్లి అప్పలరాజు, కాంగ్రెస్ నాయకుడు, సీడీసీ చైర్మన్ దొండా రాంబాబు తదితరులు అవినీతిపై విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. ఆందోళనలో వైఎస్సార్సీపీ, సీపీఐ, కాంగ్రెస్ నాయకులతో పాటు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఫ్యాక్టరీ గేటువద్ద సోమవారం చేపట్టిన రిలే నిరహారదీక్షలను అమర్నాథ్, బూడి ముత్యాలనాయుడు, కరణం ధర్మశ్రీ ప్రారంభించారు. -
మసకబారిన ప్రతిష్ట
‘గోవాడ’ గతం ఘనం.. మనుగడ ప్రశ్నార్థకం వెంటాడుతున్న ఆర్థిక నష్టాలు, అవినీతి ఆరోపణలు రైతులకు బకాయిలు, కార్మికులకు జీతాలు చెల్లించలేని దుస్థితి ఆందోళనలో వేలాది రైతు, కార్మిక కుటుంబాలు చోడవరం : అన్నదాతలు, కార్మికులకు ఆసరాగా ఉంటూ సహకార రంగంలో రాష్ర్టంలో అత్యుత్తమ ఫ్యాక్టరీగా పేరొందిన గోవాడ చక్కెరమిల్లు ప్రతిష్ట మసకబారుతోంది. ఆర్థిక ఇబ్బందులు, అవినీతి ఆరోపణలతో ఫ్యాక్టరీ తిరోగమనం దిశగా పయనించడం రైతులు, కార్మికులను ఆందోళనకు గురిచేస్తోంది. ఐదు అసెంబ్లీ నియోజకర్గాలు, 17 మండలాల్లో విస్తరించి 23,400 మంది సభ్య రైతులు, 2వేల కార్మిక కుంటుబాలు ప్రత్యక్షంగా మరో లక్ష కుటుంబాలు పరోక్షంగా ఈ ఫ్యాక్టరీపై ఆధారపడి జీవిస్తున్నాయి. చోడవరం, మాడుగుల నియోజకవర్గాల్లోని గ్రామాల ప్రజలు పూర్తిగా ఈ ఫ్యాక్టరీపైనే ఆధారపడి జీవిస్తున్నారు. సుమారు 30 వేల ఎకరాల్లో చెరకు విస్తీర్ణం, 20 కాటాలు, అతి పెద్ద గేటు ఏరియాతో విస్తరించి ఉన్న ఈ ఫ్యాక్టరీ 66 యేళ్లుగా స్థానిక రైతాంగానికి జీవనాధారంగా ఉంది. ఏటా 5 ల క్షల టన్నులకు పైబడి క్రషింగ్ చేసి గడిచిన పదేళ్లలో 8 ఉత్తమ అవార్డులు అందుకున్న ఈ ఫ్యాక్టరీ ఇప్పుడు ఎటు పయనిస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. గోవాడ ఫ్యాక్టరీ అంటే గొప్పగా చెప్పుకునే రోజుల నుంచి అమ్మో గోవాడ అనే దయనీయస్థితికి దిగజార్చిన పాలకవర్గంపై రైతులు, కార్మికులు కన్నెర్ర చేస్తున్నారు. ఆర్థిక తిరోగమనం 2004 వరకు రైతులకు టన్నుకు రూ.1050 కంటే ఎక్కువ ఇవ్వలేని స్థితిలో ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి బాధ్యతలు చేపట్టాక ఏకంగా టన్నుకు రూ.1700 చెల్లించారు. ఆ తర్వాత ఏటా పెంచుతూ గత ఏడాది ప్రోత్సాహంతో కలిపి రూ.2350లు టన్నుకు మద్దతు ధర చెల్లించారు. అటువంటి ఫ్యాక్టరీ ఇప్పుడు రూ.40కోట్లకు పైబడి ఆర్థిక నష్టాల్లో కొట్టుమిట్టాడుతుంది. ఇన్నేళ్లల్లో తొలిసారిగా క్రషింగ్ పూర్తయి నాలుగు నెలలు గడిచినా రైతులకు బకాయిలు చెల్లించలేని దుస్థితికి చేరుకుంది. మరోవైపు కార్మికులకు నెలనెలా జీతాలు కూడా చెల్లించడం లేదు. అనాలోచిత నిర్ణయాలతో అనర్థాలు రెండేళ్ల కిందట తెలుగుదేశం పార్టీ నాయకులు పాలకవర్గం బాధ్యతలు చేపట్టాక ఫ్యాక్టరీకి కష్టాలు, నష్టాలు మొదలయ్యాయనే వాదన ఉంది. ఆదాయానికి మించి ఖర్చు చేయడం, గతేడాది క్వింటా పంచదార ధర రూ.2900 ఉన్నప్పుడు నిల్వలు అమ్మకపోవడం, తదితర అనాలోచిత నిర్ణయాలు భారీగా నష్టాలను మిగిల్చాయనే ఆరోపణలున్నాయి. దీనికితోడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంతో పంచదార ధర ఘోరంగా పడిపోవడం కూడా ఫ్యాక్టరీపై పెను ప్రభావం చూపింది. మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా గతేడాది హుద్‌హుద్ సమయంలో లక్షల క్వింటాళ్ల పంచదార తడిసిపోవడంతోపాటు ఫ్యాక్టరీ మిల్లుహౌస్ దెబ్బతినడంతో ఆర్థికంగా తీవ్ర నష్టం జరిగింది. బకాయిల చెల్లింపులు, ఈ ఏడాది చెరకు క్రషింగ్, గిట్టుబాటు ధర, తదితర అంశాలపై రైతులు, కార్మికులు ఆందోళన చెందుతున్న సమయంలో పాలకవర్గంపై అవినీతి ఆరోపణలు రావడం ఫ్యాక్టరీ మనుగడను ప్రశ్నార్థకంగా మార్చేసింది. ‘గోవాడ’పై సీఎం ఆరా... చోడవరం: గోవాడ సుగర్స్‌లో అవినీతి అరోపణలపై సీఎం చంద్రబాబునాయుడు ఆరా తీసినట్టు తెలిసింది. ఈ వ్యవహారంపై నివేదికను పంపాలని రాష్ట్ర మానవ వనరుల శాఖామంత్రి గంటా శ్రీనివాసరావును సీఎం కోరినట్టు సమాచారం. దీంతో మంత్రి గంటా కబురు మేరకు సుగర్స్ చైర్మన్ గూనూరు మల్లునాయుడు, ఎమ్డీ రమణారావులు ఎకాయెకిన అతని నివాసానికి వెళ్లినట్టు చెప్పుకుంటున్నారు. తడిసిన పంచదార ఎంత, బీమా వివరాలు, తర్వాత జరిగిన అమ్మకాల పరిణామాలపై ఇద్దరినీ మంత్రి నిలదీసినట్టు సమాచారం. రాత్రి వరకు ఈ విషయమై ముగ్గురూ చర్చించినట్టు భోగట్టా. ఇదిలావుండగా ఈ వ్యవహరంపై సోమవారం నుంచి ఆందోళనకు విపక్షాలు సన్నద్ధం కావడంతో భవిష్యత్ వ్యూహం ఏమిటన్న అంశంపై కూడా అధికార పార్టీ నాయకులు చర్చించినట్టు తెలిసింది. -
చోడవరంలో కొనసాగుతున్న బంద్
చోడవరం(విశాఖ): విశాఖపట్టణం జిల్లా చోడవరం నియోజకవర్గ వ్యాప్తంగా పోలీసు నిర్బంధం నడుమ బంద్ కొనసాగుతోంది. పోలీసులు ఎక్కడికక్కడ నేతలను అరెస్టు చేసినా బంద్ కొనసాగుతోంది. బంద్ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ సహా వైఎస్సార్సీపీ, సీపీఐ, సీపీఎం నేతలు 50 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నారు. బస్సులు నడవ లేదు. వాణిజ్య, వ్యాపార సంస్థలు మూతబడ్డాయి. గోవాడ షుగర్ ఫ్యాక్టరీ కార్మికులు స్వచ్ఛందంగా బంద్ పాటించటంతో కర్మాగారం మూతపడింది. -
విస్తరణ సాధ్యమేనా..?
సహకార రంగంలోని గోవాడ చక్కెర మిల్లు విస్తరణపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సామర్థ్యాన్ని ఏకంగా రెట్టింపు చేస్తామంటూ సీఎం చంద్రబాబు ముఖ్యమంత్రి ప్రకటించడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. విస్తరణ పక్రియ మంచి దే అయినప్పటికీ ఒకే సారి 8వేల టన్నుల క్రషింగ్ కెపాసిటీని పెంచడం ఏమేరకు సాధ్యమన్న వాదన వ్యక్తమవుతోంది. ఫ్యాక్టరీ ఆదాయం, ఇతర వనరులు, అదనపు సామర్థ్యం పెంపు నకు సరిపోతాయా అన్నన్నది అంతుచిక్కని ప్రశ్న అవుతోంది. చోడవరం: గోవాడ సుగర్ ఫ్యాక్టరీని 1961లో 1250టన్నుల కెపాసిటీతో నిర్మించారు. ఆ తర్వాత 1600టన్నులకు,1987-88లో 2500టన్నులకు విస్తరించారు. 2001లో నాలుగు వేల టన్నుల సామర్థంతో బాయిలర్ హౌస్‌ను ఏర్పాటు చేశారు. 12 మెగావాట్ల కో-జనరేషన్ ప్లాంట్ ఏర్పాటయింది. చోడవరం, మాడుగుల, నర్సీపట్నం, పెందుర్తి, అనకాపల్లి నియోజకవర్గాల నుంచి ఈ ఫ్యాక్టరీకి చెరకు సరఫరా అవుతుంది. 23,844 మంది సభ్యరైతులు ఉన్నారు. పదెకరాలకు మించి చెరకు పండించేది కేవలం 200మందే . మిగతా వారంతా చిన్న, సన్నకారు రైతులే. మిల్లు పరిధిలోని రైతులు ఏటా 25వేల ఎకరాల్లో సుమారు 6లక్షల టన్నుల చెరకు ఉత్పత్తి చేసి సరఫరా చేస్తున్నారు. కెపాసిటీ మేరకు సీజన్లో 5 నుంచి 5.2లక్షల టన్నుల వరకు గానుగాడుతున్నారు. మిగతాది పక్కజిల్లాలోని ప్రైవేటు ఫ్యాక్టరీలకు తరలిపోతోంది. మరో 20వేల ఎకరాల్లో పండుతున్న చెరకు బెల్లంగా తయారు చేసి అనకాపల్లి మార్కెట్‌కు తరలిస్తున్నారు. ఇప్పటికీ ఈ ప్రాంత రైతులు సనాతన పద్ధతుల్లోనే గెడలు విధానంలో నాట్లు చేపడుతున్నారు. డ్రిప్ పద్ధతిని కేవలం 10శాతం మందే ఆచరిస్తున్నారు. పరిస్థితులు అనుకూలిస్తే పల్లపు ప్రాంతాల్లో ఎకరాకు 35-40టన్నులు, మెట్ట, వర్షాధారపు భూముల్లో 25-30టన్నుల చెరకు దిగుబడి వస్తోంది. మిల్లు రోజువారీ క్రషింగ్ సామర్థ్యం 4వేల టన్నులు. ఒక్కసారిగా సామర్థ్యాన్ని 8వేలకు పెంచితే..బెల్లం తయారీకి కాకుండా మిల్లుకు చెరకు సరఫరా అవుతుందా అన్నది అనుమానం. లేదంటే అదనంగా మరో 20వేల ఎకరాల్లో చెరకు పండించాలి. లక్ష్యం మేరకు చెరకు సాగుకు రైతుల్లో చైతన్యం రావాలి. దీనికి కొంత సమయం పడుతుంది. ఆ పని ఇప్పట్లో జరిగేది కాదన్న భావన ఎక్కువ మంది రైతుల్లో వ్యక్తమవుతోంది. ఏటా డిసెంబరు నుంచి ఫిబ్రవరి వరకు గానుగాడుతారు. మొలాసిస్ ట్యాంక్‌లు, పంచదార నిల్వలు చేసే గోడౌన్లు సరిపడినన్ని లేవు. దీనివల్ల ప్రైవేటు గోడౌన్లను అద్దెకు తీసుకుంటున్నారు. వీటినీ అదనంగా ఏర్పాటుచేయాల్సి ఉంది. అన్నీ అనుమానాలే.. ఒకే సారి 8వేల టన్నుల కెపాసిటీకి పెంచడానికి రూ.160కోట్లతో అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. క్రషింగ్ మిషనరీ సామర్థ్యం పెంచడం, కో-జనరేషన్, ఇథనాయిల్ కర్మాగారం, మొలాసిస్, పంచదార నిల్వల గోడౌన్లు అదనంగా ఏర్పాటు, బిందుసేద్యం, ఆధునిక పద్ధతిలో చెరకు సాగు వంటివి ప్రతిపాదనల్లో పేర్కొన్నట్టు తెలిసింది. ఈ డబ్బు ప్రభుత్వం ఇస్తుందా?.. లేక అప్పుగా ఫ్యాక్టరీకి ఇస్తుందా అన్నది శేష ప్రశ్న. అప్పుగా ఇస్తే ఇన్ని కోట్లకు వడ్డీ చెల్లింపు యాజమాన్యానికి భారమవుతుంది. ఇప్పుడున్న మిషనరీ కాకుండా గ్యారేజీ వెనుక భాగంలోని పాత మిల్లుహౌస్లో కొత్త యూనిట్‌ను ఏర్పాటుచేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇవన్నీ రానున్న సీజన్‌కు విఘాతం కలగకుండా చేస్తారా? అన్‌సీజన్‌లో చేస్తారా అన్నదీ అంతుచిక్కని ప్రశ్న. -
‘గోవాడ’ను బాబు అమ్మజూశారు
వైఎస్ జీవం పోశారు వడ్డాదిలో వైఎస్ విజయమ్మ చోడవరం, న్యూస్‌లైన్: గోవాడ సుగర్ ప్యాక్టరీని చంద్రబాబు అమ్మేయాలని ప్రయత్నించారని వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. బుచ్చెయ్యపేట మండలం వడ్డాది శనివారం జరిగిన ప్రచార సభలో ఆమె మాట్లాడారు. తొమ్మిదేళ్ల పాలనలో చంద్రబాబు రైతులను పూర్తిగా విస్మరించారని, ఇప్పుడు వారిపై మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆరోపించారు. సహకార సుగర్ ఫ్యాక్టరీలను చంద్రబాబు నిర్వీర్యం చేశారని ధ్వజమెత్తారు. రాజశేఖరరెడ్డి వచ్చి ఫ్యాక్టరీలకు జీవం పోశారని చెప్పారు. జగన్‌బాబు కూడా తండ్రి ఆశయ సాధనలో రైతులకు అండగా ఉంటారన్నారు. ఎంపీ అభ్యర్థి గుడివాడ అమర్ మాట్లాడుతూ ప్రజలకు అండగా ఉండే జగనన్నను ముఖ్యమంత్రిని చేయాలన్నారు. రాష్ట్రాన్ని ముక్కలు చేయడంలో కీలకపాత్ర పోషించిన టీడీపీ నాయకులు ఇప్పుడు జిల్లాను ముక్కలు చేస్తానని ప్రకటనలు చేస్తున్నారని పరోక్షంగా అవంతి శ్రీనివాస్‌పై ధ్వజమెత్తారు. చోడవరం అభ్యర్థి ధర్మశ్రీ మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకుండా సొంత ప్రయోజనాల కోసమే పాకులాడిన టీడీపీ నాయకులను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. మాజీ మంత్రి బలిరెడ్డి సత్యారావు మాట్లాడుతూ మహానేత తనయుడ్ని ముఖ్యమంత్రిని చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మాజీ ఎమ్మెల్యే గూనూరు మిలట్రీనాయుడు మాట్లాడుతూ ప్రజలను మోసం చేయడమే బాబు ధ్యేయమన్నారు. అనంతరం విజయమ్మ సమక్షంలో చోడవరం మండలం శ్రీరాంపట్నం సర్పంచ్ పండూరి సత్యవతి వైఎస్సార్సీపీలో చేరారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థులను గెలిపించండి దేవరాపల్లి సభలో విజయమ్మ మాట్లాడుతూ అనకాపల్లి ఎంపీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ను, మాడుగుల నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి బూడి ముత్యాలునాయుడును గెలిపించి రాజ న్న రాజ్యాన్ని తిరిగి తీసుకురావాలని కోరారు. -
గోవాడ సుగర్స్‌లో ఉద్రిక్తత
=స్ప్రేపాండ్లో కాంట్రాక్టు కార్మికుని మృతదేహం =బంధువులు, కార్మికులు ఆందోళన చోడవరం, న్యూస్‌లైన్ : గోవాడ సుగర్ ఫ్యాక్టరీలో కాంట్రాక్టు కార్మికుడు అనుమానాస్పద మృతి ఉద్రిక్తతకు దారి తీసింది. అంబేరుపురానికి చెందిన మద్దిల కామరాజు (29) కొంతకాలంగా పనిచేస్తున్నాడు. గొడౌన్లో పంచదార బస్తాలను లోడ్ చేస్తుంటాడు. శనివారం మధ్యాహ్నం బి-షిఫ్ట్‌కు కామరాజు విధులకు వచ్చాడు. డ్యూటీ ముగిసినా రాత్రికి ఇంటికి చేరలేదు. ఎక్కడికో వెళ్లి ఉంటారని కుటుంబ సభ్యులు భావించారు. ఇంతలో ఆదివారం సాయంత్రం స్ప్రే పాండ్‌లో ఒక మృతదేహం ఉన్నట్టు కార్మికులు గుర్తించా రు. కాసేపటికి విధుల్లో లేని కార్మికుల గురించి ఆరా తీయగా కామరాజుగా తేల్చారు. వెంటనే ఆయన సోదరుడు గోపాలకృష్ణను రప్పించడంతో తన తమ్ముడేనని నిర్ధారించి ఘొల్లుమన్నా రు. కాగా కామరాజు మృతి మిస్టరీగా మారింది. గొడౌన్లో పనిచేసే కార్మికుడు ఫ్యాక్టరీ చివరిలో ఉన్న స్ప్రే పాండ్ దగ్గరికి ఎందుకు వెళ్లాడన్నది ప్రశ్నార్థకంగా ఉంది. ప్రమాదవశాత్తు పడిపోయాడా లేక ఎవరైనా హత్య చేసి ఉంటారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతునికి నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. భార్య కొంత కాలంగా ఇతనికి దూరంగా ఉన్నట్టు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తల్లి మాత్రం కామరాజు దగ్గరే ఉంటోం ది. అందరితో కలివిడిగా ఉండే కామరాజు వేడినీటి కుండీలో శవమై తేలడంతో అందరినీ విషాదంలో ముంచెత్తింది. విషయం తెలుసుకున్న ఫ్యాక్టరీ ఎమ్డీ వి. వెంకటరమణారావు, చైర్మన్ మల్లునాయుడు, చోడవరం సీఐ శ్రీనివాసరావు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మరోవైపు వేడి నీటిలో ఉన్న మృతదేహాన్ని బయటికి తీయడానికి బాగా శ్రమించాల్సి వచ్చింది. యాజమాన్యం, కాంట్రాక్టరు నిర్లక్ష్యం వల్లే కామరాజు మృతి చెందాడని కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ నాయకులు, కుటుంబ సభ్యులు ధ్వజమెత్తారు. రాత్రి 7 30 గంటల సమయంలో తీసినప్పటికీ నష్టపరిహారం ఇచ్చే వరకు శవాన్ని తీసుకెళ్లమని బంధువులు ఆందోళనకు దిగారు. విధుల్లోకి వెళ్లిన కార్మికులు, విధులు అనంతరం బయటికి వచ్చింది లేనిది, తర్వాత డ్యూటీలో ఎవరు వచ్చారన్నది నమోదుచేయాల్సి ఉంది. కాని ఈ తరహా పరిశీలన లేకపోవడం వల్లే రాత్రి డ్యూటీ దిగాల్సిన కార్మికుడు మరుసటి రోజైనా ఏమయ్యాడో తెలియని పరిస్థితి నెలకొందని యూనియన్ అధ్యక్షుడు బండారు శ్రీనువాసరావు, బంధువులు ఆరోపించారు. -
గోవాడ సుగర్స్‌లో తప్పిన ఘోర ప్రమాదం
=గోడౌన్లో మీదపడ్డ పంచదార బస్తాలు =ఆరుగురు కార్మికులకు తీవ్ర గాయాలు =ముగ్గురి పరిస్థితి విషమం చోడవరం, న్యూస్‌లైన్ : గోవాడ చక్కెర కర్మాగారంలో భారీ ప్రమాదం తప్పింది. గోడౌన్లో విధులు నిర్వహిస్తున్న కార్మికులపై పంచదార బస్తాలు పడిపోవడంతో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. యాజమాన్యం సకాలంలో స్పందించడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. గోవాడ చక్కెర కర్మాగారంలో శుక్రవారం ఎ షిప్ట్‌లో కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. రెండో నంబర్ గోడౌన్లో వేరేచోటికి తరలించేందుకు బస్తాలను మోస్తున్న 8మంది కార్మికులపై ప్రమాదవశాత్తు నిట్టలో ఉన్న బస్తాలు వచ్చి మీదపడ్డాయి. ఒకేసారి వందలాది బస్తాలు పడిపోవడంతో ఆరుగురు వాటికింద చిక్కుకుపోయారు. ఇంతలో అక్కడే ఉన్న తోటి కార్మికులు హుటాహుటిన అక్కడికి వచ్చి వారిని బయటికి తీశారు. వీరిలో శానాపతి దాలిబాబు, గోవాడ అప్పారావు, గొర్లె రాజాబాబులు తీవ్రంగా గాయపడగా పొట్నూరి గోవింద, పూతి అర్జున, చల్లా శేషగిరిరావులకు స్పల్ప గాయాలయ్యాయి. వీరందరికీ కర్మాగారంలోని ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అందించారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురు పంచదార బస్తాల కింద బాగా నలిగిపోవడంతో శ్వాస ఆడలేదు. ఇద్దరికి చేతులు విరిగిపోయాయి. దీంతో వీరిని మెరుగైన వైద్యానికి విశాఖలోని ప్రయివేటు ఆస్పత్రికి అంబులెన్స్‌లో తరలించారు. ప్రమాదం జరిగిందని సైరన్ మోగడంతో కార్మికులంతా పరుగులు తీశారు. కర్మాగారం చైర్మన్ గూనూరు మల్లునాయుడు, మేనేజింగ్ డైరక్టర్ మజ్జి సూర్యభగవాన్ హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. యూనియన్ అధ్యక్షుడు బాస్కరరావు, అధికారులు వచ్చి పరిస్థితిని సమీక్షించారు. కార్మికులు ప్రమాదానికి గురయ్యారని తెలియడంతో గోవాడ, అంబేరుపురం పరిసర ప్రాంతాల నుంచి కార్మికుల కుటుంబ సభ్యులు, ప్రజలు, వివిధ పార్టీల నేతలు చేరుకున్నారు. ఆ ప్రాంతమంతా ఆర్తనాదాలతో నిండిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.