మసకబారిన ప్రతిష్ట
‘గోవాడ’ గతం ఘనం.. మనుగడ ప్రశ్నార్థకం
వెంటాడుతున్న ఆర్థిక నష్టాలు, అవినీతి ఆరోపణలు
రైతులకు బకాయిలు, కార్మికులకు జీతాలు చెల్లించలేని దుస్థితి
ఆందోళనలో వేలాది రైతు, కార్మిక కుటుంబాలు
చోడవరం : అన్నదాతలు, కార్మికులకు ఆసరాగా ఉంటూ సహకార రంగంలో రాష్ర్టంలో అత్యుత్తమ ఫ్యాక్టరీగా పేరొందిన గోవాడ చక్కెరమిల్లు ప్రతిష్ట మసకబారుతోంది. ఆర్థిక ఇబ్బందులు, అవినీతి ఆరోపణలతో ఫ్యాక్టరీ తిరోగమనం దిశగా పయనించడం రైతులు, కార్మికులను ఆందోళనకు గురిచేస్తోంది. ఐదు అసెంబ్లీ నియోజకర్గాలు, 17 మండలాల్లో విస్తరించి 23,400 మంది సభ్య రైతులు, 2వేల కార్మిక కుంటుబాలు ప్రత్యక్షంగా మరో లక్ష కుటుంబాలు పరోక్షంగా ఈ ఫ్యాక్టరీపై ఆధారపడి జీవిస్తున్నాయి. చోడవరం, మాడుగుల నియోజకవర్గాల్లోని గ్రామాల ప్రజలు పూర్తిగా ఈ ఫ్యాక్టరీపైనే ఆధారపడి జీవిస్తున్నారు. సుమారు 30 వేల ఎకరాల్లో చెరకు విస్తీర్ణం, 20 కాటాలు, అతి పెద్ద గేటు ఏరియాతో విస్తరించి ఉన్న ఈ ఫ్యాక్టరీ 66 యేళ్లుగా స్థానిక రైతాంగానికి జీవనాధారంగా ఉంది. ఏటా 5 ల క్షల టన్నులకు పైబడి క్రషింగ్ చేసి గడిచిన పదేళ్లలో 8 ఉత్తమ అవార్డులు అందుకున్న ఈ ఫ్యాక్టరీ ఇప్పుడు ఎటు పయనిస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. గోవాడ ఫ్యాక్టరీ అంటే గొప్పగా చెప్పుకునే రోజుల నుంచి అమ్మో గోవాడ అనే దయనీయస్థితికి దిగజార్చిన పాలకవర్గంపై రైతులు, కార్మికులు కన్నెర్ర చేస్తున్నారు.
ఆర్థిక తిరోగమనం
2004 వరకు రైతులకు టన్నుకు రూ.1050 కంటే ఎక్కువ ఇవ్వలేని స్థితిలో ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి బాధ్యతలు చేపట్టాక ఏకంగా టన్నుకు రూ.1700 చెల్లించారు. ఆ తర్వాత ఏటా పెంచుతూ గత ఏడాది ప్రోత్సాహంతో కలిపి రూ.2350లు టన్నుకు మద్దతు ధర చెల్లించారు. అటువంటి ఫ్యాక్టరీ ఇప్పుడు రూ.40కోట్లకు పైబడి ఆర్థిక నష్టాల్లో కొట్టుమిట్టాడుతుంది. ఇన్నేళ్లల్లో తొలిసారిగా క్రషింగ్ పూర్తయి నాలుగు నెలలు గడిచినా రైతులకు బకాయిలు చెల్లించలేని దుస్థితికి చేరుకుంది. మరోవైపు కార్మికులకు నెలనెలా జీతాలు కూడా చెల్లించడం లేదు.
అనాలోచిత నిర్ణయాలతో అనర్థాలు
రెండేళ్ల కిందట తెలుగుదేశం పార్టీ నాయకులు పాలకవర్గం బాధ్యతలు చేపట్టాక ఫ్యాక్టరీకి కష్టాలు, నష్టాలు మొదలయ్యాయనే వాదన ఉంది. ఆదాయానికి మించి ఖర్చు చేయడం, గతేడాది క్వింటా పంచదార ధర రూ.2900 ఉన్నప్పుడు నిల్వలు అమ్మకపోవడం, తదితర అనాలోచిత నిర్ణయాలు భారీగా నష్టాలను మిగిల్చాయనే ఆరోపణలున్నాయి. దీనికితోడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంతో పంచదార ధర ఘోరంగా పడిపోవడం కూడా ఫ్యాక్టరీపై పెను ప్రభావం చూపింది. మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా గతేడాది హుద్‌హుద్ సమయంలో లక్షల క్వింటాళ్ల పంచదార తడిసిపోవడంతోపాటు ఫ్యాక్టరీ మిల్లుహౌస్ దెబ్బతినడంతో ఆర్థికంగా తీవ్ర నష్టం జరిగింది. బకాయిల చెల్లింపులు, ఈ ఏడాది చెరకు క్రషింగ్, గిట్టుబాటు ధర, తదితర అంశాలపై రైతులు, కార్మికులు ఆందోళన చెందుతున్న సమయంలో పాలకవర్గంపై అవినీతి ఆరోపణలు రావడం ఫ్యాక్టరీ మనుగడను ప్రశ్నార్థకంగా మార్చేసింది.
‘గోవాడ’పై సీఎం ఆరా...
చోడవరం: గోవాడ సుగర్స్‌లో అవినీతి అరోపణలపై సీఎం చంద్రబాబునాయుడు ఆరా తీసినట్టు తెలిసింది. ఈ వ్యవహారంపై నివేదికను పంపాలని రాష్ట్ర మానవ వనరుల శాఖామంత్రి గంటా శ్రీనివాసరావును సీఎం కోరినట్టు సమాచారం. దీంతో మంత్రి గంటా కబురు మేరకు సుగర్స్ చైర్మన్ గూనూరు మల్లునాయుడు, ఎమ్‌డీ రమణారావులు ఎకాయెకిన అతని నివాసానికి వెళ్లినట్టు చెప్పుకుంటున్నారు. తడిసిన పంచదార ఎంత, బీమా వివరాలు, తర్వాత జరిగిన అమ్మకాల పరిణామాలపై ఇద్దరినీ మంత్రి నిలదీసినట్టు సమాచారం. రాత్రి వరకు ఈ విషయమై ముగ్గురూ చర్చించినట్టు భోగట్టా. ఇదిలావుండగా ఈ వ్యవహరంపై సోమవారం నుంచి ఆందోళనకు విపక్షాలు సన్నద్ధం కావడంతో భవిష్యత్ వ్యూహం ఏమిటన్న అంశంపై కూడా అధికార పార్టీ నాయకులు చర్చించినట్టు తెలిసింది.