విజయనగరం ఫోర్ట్, న్యూస్‌లైన్: బాలిక సంరక్షణ పథకా(గర్ల్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్)నికి సంబంధించిన బాండ్ల కోసం వేలాదిగా లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. ఈ పథకానికి ప్రభుత్వం మంగళం పాడినప్పటికీ దానికి గతంలో మంజూరైన వారికి మాత్రం ఇంతవరకు బాండ్లు అందజేయలేదు. దీంతో లబ్ధిదారుల్లో ఆందోళన మొదలైంది. బాండ్లు వస్తాయో లేదో తెలియక సతమవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఏడాదికాలంగా 3,236 మంది లబ్ధిదారులు బాండ్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఆడపిల్లలను కన్న తల్లిదండ్రులు వారిని భారంగా భావించకుండా ప్రోత్సహిం చాలనే ఉద్దేశంతో వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు బాలికా సంరక్షణ పథకా(జీసీపీఎస్)న్ని ప్రవేశ పెట్టారు ఈ పథకం కింద ఒక ఆడపిల్లతో కుటుంబ సంక్షేమ శస్త్ర చికిత్స చేయించుకున్న వారికి రూ లక్ష, ఇద్దరు ఆడపిల్లలతో కుటుంబ సంక్షేమ శస్త్రచికి త్స చేయించుకున్న వారికి రూ 60 వేలు చొప్పున ప్రోత్సాహకంగా అందజేస్తారు.
పథకం కింద ఎంపిక చేసిన లబ్ధిదారులకు 20 ఏళ్ల వయస్సు నిండిన తర్వాత సొమ్ము అందేలా బాండ్లను ఎల్‌ఐసీ అందజేస్తుంది.దీని కోసం ప్రభుత్వం ఎల్‌ఐసీకి ప్రీమియం సొమ్మును విడుదల చేయాలి. అయితే కిరణ్ సర్కార్ ప్రీమియం సొమ్మును విడుదల చేయడంలో తాత్సారం చేయడంతో బాండ్లను ఎల్‌ఐసీ సకాలంలో జారీ చేయడం లేదు. ఫలితంగా లబ్ధిదారులు ఏడాది కాలంగా బాండ్ల కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. 2011-12 సంవత్సరానికి సంబంధించి జిల్లాకు జీసీపీఎస్ పథకానికి ఒక ఆడపిల్ల ఉన్నవారు కింద 52 మంది, ఇద్దరు ఆడపిల్లలున్నవారు 3,084 మంది ఎంపికయ్యారు. వీరంతా బాండ్లకోసం ఎదు రు చూస్తున్నారు.
ఈ ఏడాది కిరణ్ సర్కార్ జీసీపీఎస్‌కు మంగళం పాడి బంగారుతల్లి పేరుతో కొత్త పథకాన్ని ప్రవేశ పెట్టింది. దీంతో లబ్ధిదారుల్లో ఆందోళన మొదలైంది. కొత్త పథకం ప్రవేశ పెట్టడం వల్ల పాత పథకం కింద ఎంపికైన వారికి బాండ్లు అందజేస్తారా లేదా బాండ్లకు కూడా మంగళం పాడతారా అని లబ్ధిదారులు ఆందోళనకు గురవుతున్నా రు. ఇదే విషయాన్ని ఐసీడీఎస్ పీడీ టీవీ.శ్రీనివాస్ వద్ద ‘న్యూస్‌లైన్’ ప్రస్తావించగా ఎల్‌ఐసీ నుంచి బాండ్లు ఇంకా రాలేదన్నారు. అవి వచ్చిన వెంటనే లబ్ధిదారులకు అందజేస్తామని తెలిపారు.