
ఇసుకాసురులకు చెక్
నూజివీడు : ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవో నంబరు 94,95 ఇసుక అక్రమార్కుల్లో వణుకు పుట్టిస్తోంది. ఇప్పటి వరకు ఇసుక అక్రమార్కులు ఆడిందే ఆట పాడిందే పాటగా సాగిన తంతుకు చెక్ పడనుంది. గతంలో ఇసుక అక్రమార్కుల ఆగడాలను దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం కఠినతరమైన నిబం ధనలు విధించింది. ఇసుక మాఫియాను అరికట్టేందుకు ప్రభుత్వం వీటిని అమలు చేయనుంది. అక్రమంగా ఇసుకను ట్రాక్టర్‌లో తరలిస్తూ పట్టుబడితే మొదటిసారి రూ.15వేలు జరిమానా విధిస్తారు.
రెండోసారి రూ.45వేలు, మూడోసారి క్రిమినల్ కేసు నమోదు చేస్తారు. అదే పది టన్నుల లోపు లారీ పట్టుబడితే మొదటిసారి రూ.45వేలు, రెండోసారి రూ.75వేలు, మూడోసారి క్రిమినల్ కేసు నమోదు చేస్తారు. అలాగే పది టన్నుల కంటే పైన ఉన్న లారీకి తొలిసారి రూ.75వేలు, రెండోసారి రూ.1.50 లక్షలు, మూడోసారి క్రిమినల్ కేసు పెడ్తారు. అంతే గాకుండా పట్టుకున్న అధికారులు, సిబ్బందిని బెదిరించినా క్రిమినల్ కేసు నమోదు చేస్తారు. ఈ విధంగా ప్రభుత్వం కఠిన నిబంధనలు విధించడంతో పేదలు వాగుల్లోకి వెళ్లి ఇసుకను తెచ్చుకోవాలన్నా ఇబ్బందులు తప్పవు.
సిఫారసులకు చెక్...
కాగా అక్రమార్కులను పట్టుకున్న తరువాత అధికారులకు మొదట రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధుల నుంచే ఫోన్లు వస్తాయి. కాబట్టి ఈ జీవో కాపీలను ప్రజా ప్రతినిధులకు సైతం అందజేయాలని అధికారులు భావిస్తున్నారు. ఇసుక తరలిస్తూ పట్టుబడిన వారికి భారీగా జరిమానా విధిస్తే పేదలు గృహాలను నిర్మించుకోవడానికి ముందుకు వచ్చే పరిస్థితి ఉండదని రెవెన్యూ సిబ్బందే పేర్కొంటున్నారు. అయితే పేదలకు తమ గ్రామాలకు దగ్గర్లో ఉన్న వాగుల్లో దొరికే ఇసుకను తెచ్చుకునే స్తోమత మాత్రమే ఉంటుందని వారు అంటున్నారు. ఎక్కడెక్కడో ఉన్న గోదావరి, కృష్ణా నదుల ఇసుక రీచ్‌ల వద్ద నుంచి తెచ్చుకునే స్తోమత ఎక్కడదని మరికొంతమంది సిబ్బంది పేర్కొంటున్నారు.