అసాధ్యం కాదు..
సివిల్స్ సాధించడం అనేది అందరికి సాధ్యమయ్యే అంశమే. దీనికి ముందుగా పరీక్ష విధానంపై తగిన అవగాహన కలిగి ఉండడం ఎంతో అవసరం. విద్యార్థులు తాము అభ్యసించిన అంశాలను షార్ట్స్ నోట్స్‌గా రాసుకోవడం అలవాటు చేసుకోవాలి. తద్వారా తమ నైపుణ్యాలు, సంగ్రహణ శక్తి పెరుగుతాయి.
గ్రామీణ యువతకు మార్గదర్శకత్వం అవసరం
గ్రామీణ యువతలో సైతం సివిల్స్‌ను సాధించే సత్తా ఉంది. వీరికి తగిన మార్గదర్శకం అందించాల్సిన అవసరం ఉంది. నిత్యం అంశాలను అభ్యసించే సమయంలో రోజులో ఎన్ని గంటలకు చదివామనే విషయం కంటే సంబంధిత అంశాన్ని ఎంత క్షుణ్ణంగా, లోతుగా తెలుసుకోగలిగామనేది ప్రధానం.
ప్రణాళికాబద్ధంగా చదవాలి
కాలం వృథా కాకుండా ప్రణాళికా బద్ధంగా విభజించుకుంటూ సాధన సాగించాల్సి ఉంటుంది. మనకు సాంకేతికత సహకారంతో అందుబాటులో ఉన్న అనంత సమాచారాన్నుంచి, అవసరమైన విషయాలను సేకరించుకోవాల్సి ఉంటుంది. ఎంత ఎక్కువ సేపు చదివామనే విషయం కంటే ప్రతి అంశంలో ఎంత పట్టు సాధించామన్నదే ముఖ్యం. గ్రామీణ విద్యార్థుల్లో ఉండే భయాన్ని పారద్రోలితే వీరు సులభంగా విజయం సాధిస్తారు.
నిజాయతీకి నిజమైన పరీక్ష
ఇంటర్వ్యూలో మనల్ని మనం ప్రజెంట్ చేసుకోవడం, ఆత్మవిశ్వాసం, సానుకూల దృక్పథంతో పనిచేయడం ఎంతో అవసరం. స్పష్టమైన సమాధానాలను ఇవ్వడంతో పాటు, ఒత్తిడిని దరి చేరనివ్వకుండా సమాధానాలు ఇవ్వడం ప్రధానం. ఒక విధంగా చెప్పాలంటే ఇది మన నిజాయితీకి నిజమైన పరీక్షగా నిలుస్తుంది.
- రెడ్డి వేదిత, సివిల్స్ 71వ ర్యాంకర్