ఆర్‌కే ఇన్‌ఫ్రా కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కార్యాలయం ఉన్న భవనం
సాక్షి, అమరావతి/సాక్షి, హైదరాబాద్/కడప అర్బన్: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేశ్‌కు అత్యంత సన్నిహితులైన వారి ఇళ్లు, కార్యాలయాల్లో ఆదాయపు పన్ను(ఐటీ) శాఖ అధికారులు గురువారం సోదాలు చేపట్టారు. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందాలు ఈ సోదాల్లో పాల్గొన్నాయి. చంద్రబాబు మాజీ వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన పెండ్యాల శ్రీనివాసరావుపై ఆదాయానికి మించిన ఆస్తులతో పాటు బినామీ ఆస్తులు కలిగి ఉన్నాడన్న ఆరోపణలు ఉన్నాయి.
ఐటీ అధికారులు ఏకకాలంలో విజయవాడ, హైదరాబాద్‌లోని శ్రీనివాసరావు నివాసాల్లో సోదాలు నిర్వహించారు. 2019 ఎన్నికల వరకు చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన శ్రీనివాసరావు ఎన్నికల తర్వాత సచివాలయంలోని జీఏడీలో పని చేస్తున్నారు. పదేళ్లుగా చంద్రబాబు వద్ద వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన శ్రీనివాసరావు ఆ సమయంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్రమ ఆస్తులు సంపాదించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. మాజీ మంత్రి నారా లోకేశ్‌కు అత్యంత సన్నిహితుడిగా ఈయనకు పేరుంది. గురువారం రాత్రి 9 గంటలు దాటిన తర్వాత తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు న్యాయవాదులు విజయవాడలోని శ్రీనివాసరావు ఇంట్లోకి వెళ్లడానికి ప్రయత్నించగా సీఆర్‌పీఎఫ్ సిబ్బంది అడ్డుకున్నారు. అలాగే లోకేశ్‌కు అత్యంత సన్నిహితుడైన రాజేశ్ ఇంటిలోనూ సోదాలు జరిగాయి.
ఐటీ శాఖ తనిఖీలుచేస్తున్న భవనంలోకి వెళ్లేందుకు సీఆర్‌పీఎఫ్ పోలీసులతో మాట్లాడుతున్న టీడీపీ నాయ్యవాదులు
శ్రీనివాసులరెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లోనూ..
తెలుగుదేశం పార్టీ కడప జిల్లా అధ్యక్షుడు రెడ్డెప్పగారి శ్రీనివాసులరెడ్డి(వాసు) ఇళ్లు, కార్యాలయాల్లోనూ ఐటీ శాఖ అధికారులు గురువారం తెల్లవారుజాము నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. కడప ద్వారకానగర్‌లో ఉన్న ఇంటితోపాటు హైదరాబాద్‌లోని ఇల్లు, ఆఫీసుల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. పూర్తిగా సీఆర్‌పీఎఫ్ పోలీసుల పహారాలో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధం లేని అధికారులే ఈ సోదాల్లో పాల్గొనడం గమనార్హం. హైదరాబాద్ పంజాగుట్ట లుంబినీ ఎన్‌క్లేవ్‌లోని ఆర్‌కే ఇన్‌ఫ్రా కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయంతోపాటు జూబ్లీహిల్స్ రోడ్ నం.13లోని ఆయన నివాసంలోనూ ఏకకాలంలో సోదాలు చేపట్టారు. ఈ సోదాల్లో పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. కడపలో శ్రీనివాసులరెడ్డి ఇంట్లో లభించిన సమాచారంతో కడపలోని మరో సబ్ కాంట్రాక్టర్ ఏవీ సుబ్బారెడ్డి ఇంటిలో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. కాంట్రాక్టులకు సంబంధించిన పలు లావాదేవీల్లో అవకతవకలు జరిగాయన్న సమాచారం ఆధారంగా ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
రూ.300 కోట్ల ఆన్‌లైన్ లావాదేవీలు
మాజీ మంత్రి రెడ్డెప్పగారి రాజగోపాల్‌రెడ్డి తనయుడైన శ్రీనివాసులరెడ్డి ఆర్‌కే ఇన్‌ఫ్రా కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో రూ.కోట్ల విలువైన కాంట్రాక్ట్ పనులు నిర్వహిస్తున్నారు. ఏపీ, తెలంగాణతోపాటు కర్ణాటక, జార్ఖండ్, అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లోనూ కాంట్రాక్ట్ పనులు చేసేవారు. ఆదాయానికి సంబంధించిన పన్నులు చెల్లించకుండా ఎగవేశారని పేర్కొంటూ ఐటీ అధికారులు రంగంలోకి దిగారు. పన్నుల ఎగవేతతోపాటు శ్రీనివాసులరెడ్డి కుమార్తె వివాహం నిశ్చయమైన సమయంలో దాదాపు రూ.300 కోట్ల ఆన్‌లైన్ లావాదేవీలు చేసినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. ఈ సోదాల వివరాలను తెలియజేసేందుకు అధికారులు నిరాకరించారు. చంద్రబాబు మాజీ వ్యక్తిగత సహాయకుడు పెండ్యాల శ్రీనివాసరావు, కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ శాఖ సోదాలు జరపడం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఉత్తర తెలంగాణలోని నేతల ఇళ్లు, కార్యాలయాల్లో..
తెలంగాణలోని కరీంనగర్‌లో గురువారం ఉదయం నుంచి ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యభూమిక పోషిస్తున్న రెండు ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన నేతల ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. సదరు నేతలకు తెలంగాణవ్యాప్తంగా మల్టీప్లెక్స్‌లు, ఆసుపత్రులు, విద్యాసంస్థలు, రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment