రౌండ్‌టేబుల్ సమావేశంలో మాట్లాడుతున్న సన్నశెట్టి రాజశేఖర్
శ్రీకాకుళం, సీతంపేట: సీతంపేట సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థలో (ఐటీడీఏ) పీవో తప్ప అధికారులెవ్వరూ సక్రమంగా పనిచేయడం లేదని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐటీడీఏ కార్యాలయంలో అధికారులతో వివిధ శాఖలపై గురువారం సమీక్ష నిర్వహించారు. పలుశాఖల ప్రగతిపై క్షుణ్ణంగా సమీక్షించారు. అయితే సంబంధిత శాఖల అధికారులు సరైన సమాధానం చెప్పలేకపోయారు. దీంతో వారి పనితీరు బాగోలేదంటూ ఆగ్రహం చెందారు. ప్రాజెక్టుఅధికారి శివశంకర్ బాగా పనిచేస్తున్నారని, అధికారులంతా ఆయనకు సహకరించాలన్నారు. నిధులు భారీగా ఖర్చుచేస్తుంటే అధికారులు పనిచేయకపోతే ఎలా అని ప్రశ్నించారు. ఐటీడీఏ పరిధిలో ఎంతమంది పీవీటీజీ, నాన్‌పీవీటీజీ గిరిజనులున్నారు, గిరిజన విద్యకు సంబంధించి అంబేడ్కర్ ఓవర్సీస్, విద్యానిధి, బ్యాక్‌లాగ్ ఖాళీలు తదితర అంశాలు ప్రశ్నించినప్పుడు డీడీ మురళీకృష్ణమూర్తి సరిగ్గా సమాధానం చెప్పలేకపోయారు.
దీంతోఆగ్రహం వ్యక్తం చేసిన చైర్మన్.. మరోసారి తాను పర్యటనకు వచ్చేసరికి తీరు మారకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. గిరిజన విద్యార్థుల్లో డ్రాపౌట్లు ఉండకూడదన్నారు. డిజిటిల్ తరగతులు జరుగుతున్నాయా అని డిప్యూటీ ఈవో రామ్మోహన్‌రావును ప్రశ్నించారు. జిల్లా స్థాయిలో వివిధ పథకాలు గిరిజనులు తెలుసుకోవడానికి ఒక ఏటీడబ్ల్యూవోను జిల్లా కేంద్రంలో నియమించాలన్నారు. ట్రైకార్ రుణాలకు సంబంధించి మండలానికి ఒకటి, రెండు యూనిట్లు మంజూరు చేస్తే గిరిజనాభివృద్ధి ఎలా జరుగుతుందన్నారు. చేపల చెరువులకు సంబంధించి 300 చెరువులుంటే 3 సొసైటీలు ఏర్పాటు చేయడమేమిటని ప్రశ్నించారు. ఎస్టీ లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారని ప్రశ్నించగా మత్స్యశాఖ ఏడీ శ్రీనివాసరావు సమాధానం చెప్పలేకపోయారు. గిరిజన సహకార సంస్థ వారికి ఆదాయం వచ్చిన ఉత్పత్తులు కొనుగోలు చేయడం తప్ప, గిరిజనులకు ఉపయోగమైన వస్తువులు కొనడం లేదన్నారు. గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ విభాగం ద్వారా రూ.45 కోట్లు ఎక్కడ ఖర్చు చేశారని ఈఈ అశోక్‌ను ప్రశ్నించారు. పశువుల పోషణకు సంబంధించి ఏవిధమైన సబ్సిడీ ఇస్తున్నారో చెప్పాలన్నారు. వంద యూనిట్ల లోపు ఉచిత విద్యుత్‌ను గిరిజనులు వాడితే బిల్లులు చెల్లించక్కర్లేదని, ఎవరైనా బిల్లులు కట్టమని అడిగితే కేసులు పెట్టాలని, పీవోకు ఫిర్యాదు చేయాలన్నారు.
గ్యాంగ్‌రేప్, మర్డర్‌కేసుల బాధితులకు పరిహారమివ్వాలి..
గ్యాంగ్‌రేప్, మర్డర్‌కేసులకు గురైన ఎస్సీ, ఎస్టీ బాధితులకు నష్ట పరిహారం ఇవ్వాలని శివాజీ ఆదేశించారు. రూ.5 వేలు పింఛన్, డీఏ, ప్రభుత్వ ఉద్యోగం, గృహనిర్మాణ స్థలం ఇవ్వాలన్నారు. గ్యాంగరేప్, మర్డర్ కేసులకు సంబంధించి పరిహారంగా రూ. 8.25 లక్షలు ఇవ్వాలన్నారు. ఇప్పటివరకు ఎన్నికేసులు పెండింగ్‌లో ఉన్నాయనేది పరిశీలించాలని డీఎస్‌పీ స్వరూపరాణికి సూచించారు. సమావేశంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు సుబ్బారావు, రవీంద్ర, సుధారాణి, నరహరి వరప్రసాద్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి లోతేటి శివశంకర్, ఆర్డీవో గున్నయ్య, తహసీల్దార్ పి.అమల, ఎంపీడీవో చంద్రకుమారి, ఐడబ్ల్యూఎంపీ ఏపీడీ డోల లక్ష్మి, ఈఈ అశోక్, ఖాధీర్, పీఏవో భవానీ శంకర్, జీసీసీ డీఎం మధు, పీహెచ్‌వో సత్యనారాయణరెడ్డి, కొత్తూరు సీఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐ కె.రాము పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment