గందరగోళంగా ఐటీఐ కౌన్సెలింగ్
మర్రిపాలెం : ఐటీఐ కౌన్సెలింగ్ గందరగోళంగా మారింది. కౌన్సెలింగ్ నిర్వహించి అడ్మిషన్‌లు కల్పించకపోవడంతో విద్యార్థులు అసహనం వ్యక్తం చేశారు. ప్రిన్సిపాల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తొలి విడతలో మిగిలి ఉన్న సీట్లకు శని, ఆదివారం కౌన్సెలింగ్ జరుపుతామని నిర్వాహకులు ప్రకటించారు. ఇందులో భాగంగా శనివారం ఉదయం 8 గంటలకు ఎస్సీ, ఎస్టీలు, బీసీలు, వికలాంగులు, అన్ని ర్యాంకుల బాలికలను మధ్యాహ్నం ఒంటి గంటకు రెండు దఫాలుగా ఆహ్వానించారు.
సాయంత్రం 4 గంటల వరకూ ఒక్క సీటు కూడా భర్తీ చేయలేదు. రోజంతా కౌన్సెలింగ్ కేంద్రంలో వేచి ఉన్న విద్యార్థులు సహనం కోల్పోయారు. కౌన్సెలింగ్ కేంద్రం నుంచి బయటకు వచ్చి నిరసన వ్యక్తం చేశారు. ప్రిన్సిపాల్‌కు వ్యతిరేకంగా నినాదాలతో ఐటీఐ ప్రాంగణమంతా హోరెత్తించారు. అడ్డదారుల్లో సీట్లను కేటాయించడానికి నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
కౌన్సెలింగ్ కేంద్రంలో తాగడానికి మంచి నీళ్లు కూడా ఏర్పాటు చేయలేదని మండిపడ్డారు. ప్రభుత్వ ఐటీఐలలో ఖాళీలు లేవని ప్రైవేట్ ఐటీఐలలో సీట్లు అందుబాటులో ఉన్నాయని సిబ్బంది విద్యార్థులకు తెలియజేయడంతో మరింత ఆగ్రహించారు. కౌన్సెలింగ్‌కు పిలిచి అవమానించారని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.