![IUIH Withdraws Proposal To Multispeciality Hospital In Amravati - Sakshi](/styles/webp/s3/article_images/2019/09/8/Amravati.jpg.webp?itok=zXmQ8K_2)
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో వెయ్యి పడకల మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నెలకొల్పేందుకు అనువైన పరిస్థితులు లేవని ఇండో యూకే ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (ఐయూఐహెచ్) టీడీపీ సర్కారు అధికారంలో ఉండగానే తేల్చి చెప్పింది. ఆస్పత్రి ఏర్పాటు ప్రతిపాదనను తాము ఎందుకు విరమించుకోవాల్సి వచ్చిందో వివరిస్తూ ఐయూఐహెచ్ ఎండీ అండ్ సీఈవో డాక్టర్ అజయ్ రంజన్‌గుప్తా 2019 మే 29వ తేదీన అప్పటి సీఆర్‌డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్‌కు సుదీర్ఘ లేఖ రాశారు. 2016 మార్చి 12 నుంచి 2019 జనవరి 19 వరకు సీఆర్‌డీఏ, ఐయూఐహెచ్ మధ్య జరిగిన 41 ఉత్తరప్రత్యుత్తరాలన్నింటినీ దీనికి జత చేశారు.
హామీలు, రాయితీలపై నిర్లక్ష్యం..
అమరావతిలో ప్రతిష్టాత్మకమైన తమ సంస్థ ఏర్పాటుకు ముందుకొస్తే టీడీపీ ప్రభుత్వం తీవ్ర వేధింపులకు గురి చేసిందని లేఖలో స్పష్టం చేశారు. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నెలకొల్పేందుకు మూడేళ్లుగా చర్చలు జరిపినా ఫలితం లేకుండా పోయిందని తెలిపారు. అమరావతిని అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేస్తామని చెప్పారని, కానీ క్షేత్రస్థాయిలో కనీస పురోగతి కూడా లేకపోవడంతో తమ వాటాదారులు, పెట్టుబడిదారులు ఈ ప్రాజెక్టు నుంచి వెనక్కి రావాలని ఒత్తిడి చేశారని అందులో పేర్కొన్నారు. అమరావతిలో సరైన రహదారులు, మురుగునీటి వ్యవస్థ లేదని, అలాంటి చోట ప్రతిష్టాత్మకమైన తమ సంస్థ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు చేయడం సరికాదని తమ భాగస్వామ్య సంస్థలు, స్టేక్ హోల్టర్లు పదేపదే సూచించినట్లు వెల్లడించారు. సీడ్ యాక్సెస్ రోడ్డుకు ప్రవేశమార్గం లేదని, దీనివల్ల తమకు కేటాయించిన ప్రాంతానికి చేరుకోవడం చాలా ఇబ్బందిగా ఉందని చాలాసార్లు చెప్పినా పట్టించుకోలేదన్నారు.
తమకు ఇచ్చిన హామీలు, రాయితీల అమలులో నిర్లక్ష్యం ప్రదర్శించారని తెలిపారు. తుది ఒప్పందం చేసుకునేందుకు తమ ప్రతినిధులు 2017 జనవరి వరకు సీఆర్‌డీఏ అధికారులతో ఏడుసార్లు సమావేశమైనా పురోగతి లేదన్నారు. ప్రతీసారి అగ్రిమెంట్‌లో మార్పులు చేశారని, రకరకాల సాకులతో ఇబ్బందులు పెట్టారని తెలిపారు. లీగల్‌గా సంక్రమించని భూమిని తమలాంటి ప్రైవేట్ కంపెనీకి కేటాయించకూడదన్నారు. నిజమైన యాజమాన్య, విక్రయ హక్కులు లేకుండా భూమి కేటాయించడం, ప్రారంభ సొమ్మును చెల్లించాలని కోరడం తీవ్రమైన లీగల్ చర్యలకు దారి తీస్తుందని అందులో పేర్కొన్నారు. వీటన్నింటి నేపథ్యంలో తాము అమరావతిలో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఏర్పాటు ప్రతిపాదనను ఉపసంహరించుకుంటున్నామని, తాము చెల్లించిన రూ.25 కోట్లను తిరిగి వెనక్కి ఇవ్వాలని అజయ్ రంజన్ గుప్తా లేఖలో పేర్కొన్నారు. దీని ద్వారా ద్వారా పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిన సంస్థలతో చంద్రబాబు ప్రభుత్వం ఎలా వ్యవహరించిందో, కమీషన్లు, వాటాల కోసం ఎంత ఇబ్బందులు పెట్టిందో స్పష్టమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment