గొప్ప తండ్రికి గొప్ప బిడ్డ జగన్ మోహన్ రెడ్డి: పంజాబ్ సీఎం బాదల్
జగన్ మోహన్ రెడ్డి గొప్ప తండ్రికి పుట్టిన గొప్ప బిడ్డ అని, ఆయనతో మాట్లాడుతుంటే అచ్చం తన బిడ్డ సుర్జీత్తో మాట్లాడుతున్నట్లే అనిపించిందని పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ అన్నారు. 'రెడ్డి సాహెబ్'ను కలుసుకున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉందని ఆయన చెప్పారు. తామిద్దరం కలవడం ఇదే తొలిసారని, అయినా అలా ఏమాత్రం అనిపించలేదని సంతోషంగా అన్నారు. రాష్ట్రాన్నిసమైక్యంగా ఉంచేందుకు జాతీయ నాయకుల మద్దతు కూడగట్టే ప్రయత్నాలలో భాగంగా పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్, ఆయన కుమారుడు, ఉపముఖ్యమంత్రి సుర్జీత్ సింగ్ బాదల్లను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం ఢిల్లీలో కలిశారు.
ఈ సందర్భంగా వారి భేటీ అనంతరం బాదల్ మీడియాతో మాట్లాడారు. ఏదైనా రాష్ట్రాన్ని విభజించే ముందు తప్పనిసరిగా రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయాలన్న జగన్ అభిప్రాయంతో తాను ఏకీభవిస్తున్నట్లు ఈ సందర్భంగా బాదల్ చెప్పారు. చివరకు పంచాయతీలలో కూడా ఇలా చేస్తున్నారని, వాళ్లయినా సరే మూడింట రెండొంతుల మెజారిటీతో తీర్మానం చేయాల్సిందేనని తెలిపారు. అందువల్ల కేంద్రప్రభుత్వమైనా మరోటైనా దీని గురించి ఆలోచించాల్సిందేనని చెప్పారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లును వ్యతిరేకించాలని పంజాబ్ ముఖ్యమంత్రిని జగన్ కోరారు. ఈ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందకుండా చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.