ఆళ్ల నానికి పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలుపుతున్న ఆర్టీసీ నాయకులు
సాక్షి, ఏలూరు టౌన్ : నష్టాల ఊబిలో కూరుకుపోతున్న ఏపీఎస్ ఆర్టీసీని తాను అధికారంలోకి రాగానే ప్రభుత్వంలో విలీనం చేస్తామని అనంతపురం మడకశిర బహిరంగ సభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇవ్వటం పట్ల ఆ వర్గాల్లో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సందర్భంగా ఏలూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఏలూరు నియోజకవర్గ అభ్యర్థి, ఎమ్మెల్సీ ఆళ్ల నానికి ఆర్టీసీ సంఘాల నేతలు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఆర్టీసీ ఎన్‌ఎంయూ రాష్ట్ర మాజీ చైర్మన్, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి ఆర్‌వీవీఎస్‌డీ ప్రసాద్, ఎన్‌ఎంయూ ఏలూరు డిపో గౌరవాధ్యక్షులు ఎంఆర్‌డీ బలరాం, రిటైర్డ్ యూనియన్ నాయకులు ఆళ్ల నానిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా రావూరి ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలోని 55 వేల ఆర్టీసీ కుటుంబాలకు ఈ నిర్ణయం ద్వారా మేలు చేసినట్లు అవుతుందన్నారు.
ప్రభుత్వ అనుబంధ రంగ సంస్థ ఆర్టీసీ అనేక సంవత్సరాలుగా నష్టాల్లో ఉందని, ఉద్యోగులు, కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపేలా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో విలీనం చేస్తామనే నిర్ణయాన్ని పూర్తిగా స్వాగతిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ కార్మిక కుటుంబాలు వైఎస్ జగన్ వెంటే ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎంవీఆర్‌ఆర్ కుమార్, బసవరాజు, కె.పాండు, జీపీఆర్ ప్రసాద్, ఎంవీఆర్‌ఎం రావు, బెనర్జీ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment