మృతదేహాల వద్ద విషణ్ణ వదనాలతో కుటుంబ సభ్యులు
సాక్షి, నెట్‌వర్క్: విజయనగరం జిల్లా కొమరాడ మండలం కూనేరు వద్ద శనివారం అర్ధరాత్రి జరిగిన ఘోర రైలు ప్రమాదం ఆంధ్రా, ఒడిశా ప్రజల్ని ఉలిక్కిపడేలా చేసింది. ఘటనాస్థలంలో మాంసపు ముద్దలుగా పడి ఉన్న తమ తల్లిదండ్రులు, పిల్లలు, బంధువులను చూసిన వారంతా గుండెలవిసేలా రోదించారు. కళ్ల ముందే ఇద్దరు పిల్లల్ని కోల్పోయిన తల్లి ఒకవైపు.. తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల ఆక్రందనలు మరోవైపు.. పెద్దదిక్కును కోల్పోయిన కుటుంబం.. బతుకుతెరువు కోసం వెళ్లి తిరిగివస్తూ అనంతలోకాలకు వెళ్లిపోయిన అమ్మ.. ఇలా ఎటూ చూసినా హృదయ విదారక ఘటనలే.
తల్లి కళ్లెదుటే విగతజీవులుగా మారిన పిల్లలు...
విజయనగరంలోని రంగాల వీధికి చెందిన కె.రేవతి(16), కె.రవి(19) సంక్రాంతి పండగకోసం తల్లి శారదతో కలసి భవానీ పట్నం వెళ్లి తిరుగు ప్రయాణంలో హీరాఖండ్ ఎక్స్‌ప్రెస్ ఎక్కారు. కూనేరు వద్దకు వచ్చేసరికి రైలు ప్రమాదానికి గురవ్వడంతో రేవతి అక్కడికక్కడే మృతి చెందింది. రవి తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. శారద చిన్నపాటి గాయాలతో బయటపడింది. కాగా, శారద భర్త శ్రీనివాస్ ఏడాది క్రితమే మరణించాడు. ఇప్పుడు ప్రమాదంలో పిల్లలిద్దరూ తన కళ్లెదుటే విగతజీవులుగా మారడంతో ఆ తల్లి శోకసంద్రంలో మునిగింది.
10 నిమిషాల్లో వచ్చేస్తానని..
పది నిమిషాల్లో వచ్చేస్తానని చెప్పిన కుటుంబ పెద్ద.. తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడంతో పార్వతీపురానికి చెందిన ఓ కుటుంబం తల్లడిల్లిపోతోంది. పట్టణంలోని విజయరామరాజు కాలనీకి చెందిన మండల బలరాంనాయుడు(55) ముప్ఫై ఏళ్లుగా చిన్నపాటి వ్యాపారం చేస్తున్నాడు. పార్వతీపురంలో కూరగాయాలు, కిరాణా సామన్లు కొనుగోలు చేసి రాయఘడ, కొరాపుట్‌లలో విక్రయిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ప్రతిరోజూలానే శనివారం ఉదయం కూడా విశాఖ–కొరాపుట్ ప్యాసింజర్‌లో వెళ్లి తిరుగు ప్రయాణంలో హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ ఎక్కాడు. ఇంతలో భార్య శకుంతలమ్మ ఫోన్ చేయడంతో పది నిమిషాల్లో ఇంటికి వచ్చేస్తానని చెప్పాడు. కానీ ఇంతలోనే జరిగిన ప్రమాదం ఆయన ప్రాణాలను హరించింది. ఈ విషయాన్ని రైల్వే పోలీసులు తెలియజేయడంతో భార్య శకుంతలమ్మ ఉన్నచోటే కుప్పకూలింది. నాన్న లేడన్న విషయం అబద్దం చేయమంటూ ఆయన కుమారులు దేవుడ్ని వేడుకుంటూ విలపిస్తున్న తీరు బంధువుల కంటతడిపెట్టించింది.
పెద్దదిక్కును కోల్పోయి...
భర్తకు క్షయ.. కుమారుడి సహకారం అంతంతమాత్రమే. తప్పనిసరి పరిస్థితుల్లో సాలూరులోని రెల్లి వీధికి చెందిన అమ్మానమ్మ(52) కోడలితో కలసి రైలులో పూలు అమ్ముకుంటూ జీవనం సాగించేది. అలా వచ్చిన డబ్బులతోనే కుటుంబ అవసరాలు తీర్చుకుంటుండేవారు. కానీ విధి వారిపై చిన్నచూపు చూసింది. హిరాఖండ్ దుర్ఘటనలో అమ్మానమ్మ అక్కడికక్కడే చనిపోగా, కోడలు అరుణ గాయాలతో బయటపడింది. ఘట నాస్థలి వద్ద కుటుంబసభ్యుల రోదన వర్ణనాతీతంగా ఉంది.
కళ్లముందే తల్లిదండ్రులను కోల్పోయి...
ఒడిశాలోని రాయగడకు చెందిన తేజస్విని పండిట్‌కు మార్చి 5న పెళ్లి జరగాల్సి ఉంది. పెళ్లి సంబంధం కుదరడంతో తల్లి యశోదా పండిట్, తండ్రి భాస్కర పండిట్‌తో కలసి పూరీ జగన్నాథుడిని దర్శించుకునేందుకు రాయగడలో హీరాఖండ్ రైలు ఎక్కారు. కానీ రైలు బయల్దేరిన పది నిముషాలకే ఘోర ప్రమాదం జరగడంతో తల్లి, తండ్రి ఇద్దరూ ఆమె కళ్లముందే కన్నుమూశారు. తీవ్రగాయాలపాలైన ఆమెను అంబులెన్సులో పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. తన కళ్లముందే తల్లిదండ్రులు తనువు చాలించారన్న విషయం తెలిసి కన్నీరుమున్నీరైంది.
దేవుడే రక్షించాడు..
ఈ దుర్ఘటనలో తల్లిని, తండ్రిని, ఆప్తులను కోల్పోయి ఎంతో మంది గుండెలవిసేలా రోదిస్తుండగా.. ప్రమాదం నుంచి బయటపడినవారు బతుకు జీవుడా అంటూ గమ్యస్థానాలకు చేరుకున్నారు. తృటిలో ప్రాణాలతో బయటపడిన వారిలో రాయగడకు చెందిన సేనాపతి శేఖర్ కుటుంబం ఒకటి. శేఖర్ రాత్రి 10.30 గంటలకు తన భార్య సంతోషి, ఆమె చెల్లెలు, అత్త, మామ, చిన్నత్త, చినమామలను రాయగడలో హీరాఖండ్ ఎక్స్‌ప్రెస్ ఎక్కించాడు. అయితే 11.25 గంటలకు వారి నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ లిఫ్టు చేయగానే తాము ఎక్కిన రైలు ప్రమాదానికి గురైందంటూ అవతల నుంచి విలపిస్తూ భార్య సంతోషి గొంతు వినిపించింది. దీంతో హుటాహుటిన ఘటనాస్థలికి పరుగుతీశాడు. అదృష్టవశాత్తూ వారికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో శేఖర్ ఊపిరిపీల్చుకున్నాడు. వారిని వాహనంలో తిరిగి ఇంటికి పంపించేసి.. రాత్రి నుంచి ఉదయం వరకు సహాయక చర్యల్లో పాలుపంచుకున్నాడు. ఈ నేపథ్యంలో తనను కలిసిన ‘సాక్షి’తో శేఖర్ మాట్లాడుతూ.. ఎస్–2, ఎస్–8 బోగీలలో తమ వారికి విడివిడిగా రిజర్వేషన్ దొరికిందని, అయితే భోజనం చేసిన తర్వాత ఎస్–8 బోగీలోకి వెళదామనుకొని.. అందరూ ఎస్–2లో ఎక్కారని చెప్పారు. ప్రమాదంలో ఎస్–7 పూర్తిగా ధ్వంసం కాగా, ఎస్–8 పాక్షికంగా దెబ్బతింది. తనవారు ఆ బోగీలో ఉండివుంటే ఏం జరిగేదో తలచుకుంటేనే భయమేస్తుందని, దేవుడే వారిని రక్షించాడంటూ కన్నీరుపెట్టాడు.
ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు
హీరాఖండ్ రైలు ఒకే గ్రామానికి చెందిన ముగ్గుర్ని బలితీసుకుంది. జియ్యమ్మవలస మండలం చినకుదమ గ్రామానికి చెందిన మిరియాల కృష్ణ(35), పాతర్లపల్లి పోలి(33), పాతర్లపల్లి శ్రీను(30) అరటిపండ్ల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇక్కడి రైతుల వద్ద కొనుగోలు చేసిన అరటి గెలలను ఒడిశాలోని భవానిపట్నం, కొరాపుట్, రాయఘడ, రాయపూర్, టుక్రి తదితర ప్రాంతాలకు వెళ్లి అమ్ముతుంటారు. ప్రతిరోజూలాగానే అరటిపండ్లు విక్రయించి వస్తూ.. తిరుగు ప్రయాణంలో మృత్యువాత పడ్డారు. కాగా, గ్రామంలో ఫంక్షన్ ఉండటంతో వీరు ముగ్గురే వెళ్లారని, లేకుంటే ప్రతిరోజూ 16 మంది వెళ్లేవారని గ్రామస్తులు తెలిపారు. వారు కూడా వెళ్లి ఉంటే జరిగే ఘోరాన్ని తలుచుకుంటేనే భయమేస్తోందన్నారు.
ఆ దృశ్యాలే కళ్లముందు కదులుతున్నాయ్
‘నేను రాయగడ నుంచి బరంపురం వెళ్తున్నా... రైలు బయల్దేరిన 35 నిమిషాల తర్వాత పెద్ద కుదుపు, శబ్దం వచ్చింది. రైలు ఆగిపోయింది. ప్రమాదానికి గురైన బోగీల తర్వాతే నేనున్న ఏసీ బోగీ ఉంది. ప్రమాదం కారణంగా బోగీలో లైట్లు ఆరిపోయాయి. అంతా చీకటి. కానీ బయట క్రాస్‌లెవల్ దగ్గర ఉన్న లైట్ ఉండటంతో బోగీ నుంచి బయటకు రాగలిగాను. అప్పటికే ప్రమాదానికి గురైన బోగీల్లోనుంచి ప్రయాణికుల హాహాకారాలు వినిపిస్తున్నాయి. ఆ ప్రాంతం తెలిసినదే కావడంతో ఎలాగోలా నడుచుకుంటూ పార్వతీపురం–రాయగడ రోడ్డుకు చేరుకున్నా. ఇంటికి వచ్చినా ప్రమాద దృశ్యాలే కళ్ల ముందే కదలాడటంతో ఉండలేకపోయా. ఆసుపత్రికి చేరుకొని క్షతగాత్రులకు నా వంతు సాయం అందించా..’
– మావుడూరు కన్నబాబు, ఎస్‌బీఐ రీజనల్ మేనేజర్, రాయగడ
పచ్చ జెండా ఊపేలోపే..
హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ వస్తుండడంతో శనివారం రాత్రి 11.05 గంటలకు పచ్చజెండా ఊపాను. ఇంతలోనే పెద్దశబ్దం వచ్చింది. అంతలోనే ఒకవైపు ప్రయాణికుల రోదనలు.. మరోవైపు రైలు బోగీలు విరిగిపోతున్న శబ్దాలు వినిపించాయి. ఈ హఠాత్పరిణామానికి ఒక్కసారిగా భయపడిపోయా. వెంటనే స్టేషన్‌మాస్టర్‌కు సమాచారం అందించాను.
– వి.అప్పారావు, గేట్‌మెన్, కూనేరు
బాధిత కుటుంబాలను ఆదుకోవాలి
రైలు ప్రమాద బాధితులకు తగిన పరిహారం అందించి ఆదుకోవాలని శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి కోరారు. ఆదివారం ఉదయం ఆమె రైలు ప్రమాదస్థలిని సందర్శించారు. రైల్వే పోలీసులను అడిగి ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యచికిత్సలు అందించాలని కోరారు. మృతుల కుటుంబాలకు నష్ట పరిహారం కింద రూ.25 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
– పాలకొండ వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే కళావతి