సీతానగరం (రాజానగరం): ఎన్‌టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు సహకరించిన ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు.. తమ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించడమేమిటని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి మండిపడ్డారు. మండలంలో శనివారం జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆమె విలేకర్లతో మాట్లాడారు. అసెంబ్లీలో ఎన్‌టీఆర్‌ను మాట్లాడకుండా చేసి, ఆయన చావుకు కారణం వారిద్దరే అయ్యారని అన్నారు. కాంగ్రెస్‌లో ఓడిపోయినా పిలిచి పదవి ఇస్తే, ఎన్‌టీఆర్ పార్టీని, జెండా గుర్తును లాక్కున్న వ్యక్తి చంద్రబాబు అని.. అలాగే స్పీకర్ పదవి ఇస్తే అసెంబ్లీలో ఎన్‌టీఆర్‌ను మాట్లాడనీయకుండా అవమానించిన వ్యక్తి యనమల అని అన్నారు.
వారిని అసెంబ్లీలో చూడలేకే ఎన్‌టీఆర్ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించారని గుర్తు చేశారు. తమ పార్టీ టిక్కెట్టుపై గెలిచిన 20 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనడమే కాకుండా.. వారిలో నలుగురిని మంత్రులుగా చేసి అసెంబ్లీలో కూర్చోబెట్టి, వారిచేతే సమాధానాలు ఇప్పించే పరిస్థితి సృష్టించి, ప్రజాస్వామ్యంతో పరిహాసమాడుతున్న చంద్రబాబు వైఖరిని నిరసిస్తూనే జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీకి రాకూడదని నిర్ణయించారన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి విలువలతో కూడిన రాజకీయనేత అని, చంద్రబాబు విలువలను భ్రష్టు పట్టించే వ్యక్తి అని అన్నారు. పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చని అబద్ధాలకోరు చంద్రబాబు అని విమర్శించారు. జగన్ పాదయాత్రతో టీడీపీలో గుబులు ఏర్పడిందన్నారు. జగన్‌ను ఎంతమంది విమర్శించినా పాదయాత్ర కొనసాగుతుందని విజయలక్ష్మి స్పష్టం చేశారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ పెదపాటి డాక్టర్‌బాబు, సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి చల్లమళ్ళ సుజీరాజు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment