జలదోపిడీ
సాక్షి, కడప:
ఏడాదికొకసారి.. అందులోనూ.. పులివెందుల బ్రాంచ్ కెనాల్‌కు అంతంత మాత్రంగానే నీరు.. సాగునీటికి గగనమే.. కానీ మొదటి ప్రాధాన్యతగా తాగునీటికి ఇస్తున్న నీటిని సైతం అనంత రైతులు వదలడంలేదు. పులివెందుల బ్రాంచ్ కెనాల్(పీబీసీ)కు వస్తున్న నీటిని అక్రమ మోటార్లతో దోచేస్తున్నారు. జలదోపిడీ నేపథ్యంలో పీబీసీ యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని అక్రమ మోటార్లను ఎప్పటికప్పుడు తొలగించే ప్రయత్నం చేస్తున్నా.. మళ్లీ వారిని ఏమార్చి రాత్రికి రాత్రే తోడేస్తున్నారు.
పులివెందుల బ్రాంచ్ కెనాల్‌కు 2014-15 అడ్వయిజరీ బోర్డు సమావేశంలో 3.200 టీఎంసీల నీటిని కేటాయించారు. కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంలో ఆశాజనకంగా నీరు ఉండటంతో ఆగస్ట్ 26న అనంతపురం జిల్లాలోని మిడ్‌పెన్నార్ రిజర్వాయర్ వద్ద అధికారులు పీబీసీకి నీటిని విడుదల చేశారు.
మోటార్లతో జలదోపిడీ.. :
అనంతపురం జిల్లాలోని మిడ్ పెన్నార్ రిజర్వాయర్ నుంచి నార్పల మండలంలోని తుంపెర డీప్‌కట్ వరకు సుమారు 70 కి.మీ మేర హైలెవల్ కెనాల్ ద్వారా(హెచ్‌ఎల్‌సీ) నీరు పీబీసీకి రావాల్సి ఉంది. మిడ్ పెన్నార్, తుంపెర డీప్‌కట్ల మధ్య లెక్కలేనన్ని అక్రమ మోటార్లతో నీటిని తోడేస్తున్నారు. ప్రస్తుతం వరి పంట సాగవుతుండటంతో రైతన్నలు హైలెవెల్ కెనాల్‌లో మోటార్లను పెట్టి యథేచ్ఛగా తోడేస్తున్నా.. అక్కడి యంత్రాంగం చూస్తూ ఊరుకుందే తప్ప పెద్దగా పట్టించుకోవడంలేదు. నీటి విడుదలకు ముందే ఎగువ ప్రాంతంలో ఉన్న 27 చిన్న చిన్న గేట్లను అధికారులు మూసివేశారు. అయినా వీలు దొరికినప్పుడల్లా స్వల్పంగా గేట్లు ఎత్తుతున్నట్లు తెలుస్తోంది. మిడ్ పెన్నార్ వద్ద 600 క్యూసెక్కులకు పైగా నీటిని విడుదల చేస్తుండగా.. తుంపెర వద్దకు వచ్చేసరికి 450 క్యూసెక్కుల చొప్పున రీడింగ్ నమోదవుతోంది. ఈ నేపథ్యంలో ఎన్ని నీళ్లు వృథా అవుతున్నాయో ఇట్టే అర్థమవుతోంది. పైగా తుంపెర నుంచి పెంచికల బసిరెడ్డి రిజర్వాయర్(పీబీఆర్) మధ్య కూడా అక్రమ మోటార్లు వెలిశాయి. గత ఏడాదితో పోలిస్తే కొంత పీబీసీ అధికారులు పహారా కాస్తూ మోటార్లను తగ్గిస్తూ వస్తున్నారు. అయినప్పటికి తుంపెర, పీబీఆర్ మధ్య తాడిమర్రి, నార్పల మండలాల పరిధిలోని గంగనపల్లె, రామాపురం, ముంచుకుంటపల్లె, కునుకుంట్ల, పాలెం, చిల్లకొండాయపల్లె, బుడ్డంపల్లె, పెద్దకొట్లకు గ్రామాలకు చెందిన పలువురు రైతులు మోటార్లతో నీటిని వరి పంటకు అందిస్తున్నారు. సుమారు తుంపెర, పీబీఆర్ మధ్య 20 కి.మీ కాలువలో నీరు ప్రవహిస్తుంటే దాదాపు 150నుంచి 200 అక్రమ మోటార్లతో నీటిని పక్కదారి పట్టిస్తున్నారు.
అక్కడ కళకళ.. ఇక్కడ వెలవెల..
అనంతపురం జిల్లాలోని 5వేల ఎకరాలతోపాటు వైఎస్‌ఆర్ జిల్లాలోని 55వేల ఎకరాలను కలుపుకొని సుమారు 60వేల ఎకరాల ఆయకట్టు కలిగిన పీబీసీకి ప్రస్తుతం సాగునీరు ఇవ్వలేదు. మొదటి ప్రాధాన్యతగా తాగునీటికి ఇస్తున్న నీటిని అనంతపురం జిల్లాలోని పలువురు రైతులు తస్కరిస్తుండటంతో అక్కడ వరి పంట పచ్చగా కళకళలాడుతుండగా.. ఆయకట్టు ప్రాంతమైన పులివెందుల నియోజకవర్గంలోని లింగాల, సింహాద్రిపురం, తొండూరు, వేముల, వేంపల్లె, పులివెందుల మండలాల్లోని భూములు వెలవెలబోతున్నాయి.
తుంపెర వద్ద లస్కర్ల పహారా..
తుంపెర డీప్‌కట్ వద్ద పీబీసీ... అటు తాడిపత్రి బ్రాంచ్ కెనాల్(టీబీసీ)కి నీటిని విడుదల చేసే ప్రాంతం. హైలెవెల్ కెనాల్ ద్వారా తుంపెరకు చేరుకొని.. అక్కడ నుంచి పీబీసీకి నీటిని విడుదల చేస్తున్న నేపథ్యంలో టీబీసీ పరిధిలోని రైతులు వచ్చి గేట్లు ఎత్తకుండా లస్కర్లు పహారా కాస్తున్నారు. ఈ మధ్యనే వారం రోజులక్రితం నార్పల మండలంలోని రైతులు వచ్చి పశువులకు, గొర్రెలకు తాగునీటి సమస్య ఏర్పడుతోందని.. టీబీసీ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసుకున్నారు. తర్వాత పోలీసులు వచ్చి రైతులను పంపించి గేట్లను మూసి వేశారు. ఇలా ప్రతిసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో ఏఈతోపాటు లస్కర్లతో పహారా కాస్తున్నారు. అక్రమ మోటార్లపై ఈ మధ్యనే తాడిమర్రి పోలీసులకు కూడా పీబీసీ అధికారులు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
పీబీఆర్‌లో టీఎంసీ నీరు :
పెంచికల బసిరెడ్డి రిజర్వాయర్‌లో ప్రస్తుతం ఒక టీఎంసీ నీరు నిల్వ ఉంది. మొన్నటి వరకు .85 టీఎంసీల నీరు ఉండగా.. పీబీసీ నీరు చేరుతుండటంతో ప్రస్తుతం ఒక టీఎంసీ నీటికి చేరుకుంది. ఆగస్ట్ 26న మిడ్ పెన్నార్‌లో విడుదల చేయగా.. 29న పీబీఆర్‌కు పీబీసీ నీరు రావడం ప్రారంభమైంది. అప్పటినుంచి 400కూసెక్కుల చొప్పున వచ్చి చేరుతున్నాయి. మరో 25రోజులకుపైగా నీరు వచ్చే అవకాశం ఉంది.
పీబీసీ ఈఈ రాజశేఖర్ ఏమంటున్నారంటే..
మిడ్ పెన్నార్ నుంచి పీబీఆర్‌కు వస్తున్న పీబీసీ నీటిని అక్రమంగా వాడుకుంటున్న వ్యవహారంపై సాక్షి ప్రతినిధి పీబీసీ ఈఈ రాజశేఖర్‌ను అడగగా.. అక్రమంగా నీరు వాడుకోకుండా ఎప్పటికప్పుడు పంపులను, మోటార్లను తీసివేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ప్రత్యేకంగా 15మంది నుంచి 20మంది లస్కర్లు, వర్క్ ఇన్‌స్పెక్టర్లతో పర్యవేక్షిస్తున్నామని తెలియజేశారు. అవసరాలను బట్టి పోలీసుల సహకారం తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు. గతంలో కంటే ప్రస్తుతం చాలా వరకు అక్రమ మోటార్లను తొలగించామని ఆయన తెలిపారు.