రైతుల్ని మానవతా దృక్పథంతో ఆదుకోండి: వైఎస్ జగన్
పులివెందుల: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ కింద రైతులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అన్నారు. పులివెందుల నియోజకవర్గంలోని ఇటీవల వర్షాలు, గాలివానకు తీవ్రంగా నష్టపోయిన పంటలను ఆయన సోమవారం ఉదయం పరిశీలించారు. నల్లపురెడ్డిపల్లె రైతుల సమస్యలను వైఎస్ జగన్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ...2013-14 ఇన్పుట్ సబ్సిడీ రూ.1692 కోట్లకు గాను రూ.692 కోట్లు మాత్రమే ప్రభుత్వం విడుదల చేసిందని, ఇంకా వెయ్యి కోట్లు విడుదల చేయాల్సి ఉందన్నారు. పంట నష్టపోయిన రైతులకు చంద్రబాబు ప్రభుత్వం నష్ట పరిహారం ఇవ్వటం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం రైతుల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేయాలని చెప్పారు. ఎన్నికలకు ముందు రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు, మానవతా దృక్పథంతో వారిని ఆదుకోవాలన్నారు.
అధికారులు లెక్కలు రాసుకుని వెళుతున్నా రైతులకు పరిహారం మాత్రం అందటం లేదన్నారు. ప్రభుత్వం మానవతా దృక్పథంతో రైతులను ఆదుకోవాలని కోరారు. పంటనష్టంపై కలెక్టర్, ముఖ్యమంత్రికి లేఖ రాయనున్నట్లు వైఎస్ జగన్ తెలిపారు. అవసరం అయితే కలెక్టరేట్ వద్ద ధర్నాలు పాల్గొంటానని ఆయన ప్రకటించారు. ఒక్క నల్లపరెడ్డిపల్లెలోనే సుమారు 600 ఎకరాల అరటి పంట దెబ్బతిన్నదన్నారు.
ఎకరా సాగుకు రూ.80వేల నుంచి లక్షా 50వేల వరకూ ఖర్చు అవుతుందని, కానీ ప్రభుత్వం సాయం చేయడం లేదన్నారు. ఒకవేళ సాయం చేసినా రూ.10వేలే ఇస్తుందన్నారు. అరటికి ఎకరాకు పరిహారం రూ.50వేలు పెంచాలని డిమాండ్ చేశారు. పంటల బీమా జిల్లా యూనిట్గా కాకుండా గ్రామాలను యూనిట్గా తీసుకోవాలన్నారు. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట వెఎస్సార్ జిల్లా ఎంపీ, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.