కృష్ణా జలాలు ఎక్కడ..! | krishna water not supplied to pulivendula. | Sakshi
Sakshi News home page

కృష్ణా జలాలు ఎక్కడ..!

Published Mon, Mar 27 2017 5:02 PM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM

కృష్ణా జలాలు ఎక్కడ..! - Sakshi

కృష్ణా జలాలు ఎక్కడ..!

► ఎండిన చీనీ చెట్లు ఇవిగో..
► బతికించుకునేందుకు రూ.లక్షలు వెచ్చిస్తున్న రైతులు
► అరటి పంటను కాపాడుకోలేక చేతులెత్తేసిన వైనం
► అధికారపార్టీ నాయకులవి ఆర్భాటపు మాటలే..  


కృష్ణాజలాలను పులివెందుల ప్రాంతానికి తరలించి..పంటలను కాపాడామని టీడీపీ నాయకులు రాష్ట్రమంతా గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ వాస్తవంలో.. లింగాల మండలంలో ఎండుతున్నపంటలు వారికి కనిపించడం లేదు. ఈ మండలమే కాకుండా పులివెందుల, వేముల, వేంపల్లె మండలాలతో పాటు తొండూరు మండలంలోని చాలా గ్రామాలకు ఒక్క చుక్క నీరు కూడా రాలేదు. అరకొర నీటిని అందించి పంటలను కాపాడామంటూ అధికార పార్టీ నాయకుల ఆర్భాటపు ప్రకటనలపై రైతులు మండిపడుతున్నారు.
 

పులివెందుల/లింగాల : పులివెందులకు నీరు ఇచ్చిన ఘనత తమదేనంటూ ప్రతి వేదికపై ఊదరగొట్టేస్తున్నారు అధికార పార్టీ నాయకులు. అయితే అవన్నీ ఉత్తుత్తి మాటలే అనడానికి  ఇక్కడ ఎండిపోతున్న చీనీ చెట్లే  నిదర్శనం. వీటిని కాపాడుకోవడానికి రైతులు నానాతంటాలు పడుతున్నారు రోజుకు రూ.4వేలు వెచ్చించి ట్రాక్టర్‌ ట్యాంకర్‌ ద్వారా నీటి తడులు అందిస్తున్నారు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి పైడిపాలెం ప్రాజెక్టు వద్ద  బహిరంగసభ ఏర్పాటు చేసి పులివెందుల ప్రాంతంలో ఒక్క చీనీచెట్టును ఎండనీయమని శపథం చేశారు. ప్రస్తుతం ఆ శపథాలు గాలికి వదిలేశారు. జనవరిలో లింగాల కుడికాలువకు నీరు విడుదల చేస్తామని గేట్లు ఎత్తిన శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ సతీష్‌రెడ్డి లింగాల వరకు కూడా నీటిని తీసుకురాలేదు. వేముల చెరువు వరకు నీటిని తీసుకెళతామని ప్రకటనలు చేశారు. కానీ గండికోట రిజర్వాయర్‌ నుంచి పైడిపాలెం రిజర్వాయర్‌కు కృష్ణజలాలు  లిఫ్ట్‌చేసి అక్కడ నుంచి పులివెందుల బ్రాంచ్‌ కెనాల్‌కు ఇవ్వాలి. గండికోటలో కనీసం 4.5 టీఎంసీల నీరు ఉంటే తప్ప అది సాధ్యం కాదు. ఇటీవల గండికోట నుంచి పైడిపాలెంకు 0.8 టీఎంసీల నీటిని తరలించి పక్కనే ఉన్న సింహాద్రిపురం మండలంలోని రెండు, మూడు చెరువులకు నీటిని నింపారు.  కేవలం 0.8 టీఎంసీల నీరు మాత్రమే పైడిపాలెంకు చేరుకోవడంతో కొత్త ప్రాజెక్టు కాబట్టి లాస్‌ కిందనే సగం నీరు పోతోంది. చెరువులకు కూడా పూర్తిస్థాయిలో నీరు నింపలేదు.

తాగునీటి అవసరాలు కూడా తీర్చలేక..: పులివెందులకు తాగునీటి అవసరాలను తీర్చే ఎస్‌ఎస్‌ ట్యాంకుకు అరకొర నీటిని మాత్రమే విడుదల చేస్తున్నారు. కృష్ణజలాలను పులివెందులలో పారించామన్న టీడీపీ నాయకులకు వాస్తవాలు కనిపించడం లేదా అని రైతులు ప్రశ్నిస్తున్నారు. తుంగభద్ర జలాశయం నుంచి పీబీసీకి కేటాయించిన నీటిని కూడా సక్రమంగా విడుదల చేయించుకోలేని అసమర్థ స్థితిలో టీడీపీ ప్రభుత్వం ఉందని నియోజకవర్గ ప్రజాలు మండిపడుతున్నారు.

మోటార్లను బిగించలేకపోయారు: దివంగత మహానేత వైఎస్‌ఆర్‌ ఏర్పాటుచేసిన జలయజ్ఞం ఎత్తిపోతల పథకం మోటార్లను అమర్చడానికి కూడా అధికారులకు సాధ్యం కాలేదు. అప్పటి మోటార్లనే ఇప్పుడు రన్నింగ్‌లోకి తెచ్చేందుకు నెలల సమయం తీసుకుంటున్నారు. వారి నిర్లక్ష్యం కారణంగా కొందరు రైతులు ఎండిన చీనీచెట్లను నరికివేస్తే... మరికొందరు లింగాల కాలువకు నీరు వస్తాయని ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. కేవలం టీడీపీ నేత సతీష్‌రెడ్డి గడ్డం తీసేందుకు మాత్రమే కొద్దిపాటి నీరు ఇచ్చి ఆ తర్వాత ఆపేశారని రైతులు పేర్కొంటున్నారు.

నెలకు రూ.80వేలు ఖర్చుచేస్తున్నాం: చీనీ చెట్లు కా పాడుకొనేందుకు రోజుకు ట్రాక్టర్‌ ఒక ట్రిప్‌ నకు రూ.500 ఖర్చవుతోంది. అలా రోజుకు 8 ట్రిప్పులు తోలాలి. ఒకసారి నీటి తడి అందించాలంటే 20 రోజులు పడుతుంది. ఈవిధంగా రోజుకు రూ.4వేల చొప్పున.. 20రోజులకు రూ.80వేలు ఖర్చవుతోంది. చంద్రబాబు నీరు ఇచ్చామని చెప్పి గొప్పలు చెబుతున్నారు. ఇక్కడికి వచ్చి మా పరిస్థితి చూస్తే వారికే అర్థమవుతుంది.  --తిరుపాల్‌రెడ్డి, చీనీ రైతు, లింగాల

రైతులు ఆత్మహత్యలు చేసుకొనే పరిస్థితి: ఎండిన చీనీ చెట్లను కాపాడుకోలేక పెట్టిన పెట్టుబడులు రాకపోవడంతో చీనీ రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడుతోంది. ఈ ప్రాంత రైతులకు నీరు ఇచ్చామని చెబుతున్న ప్రభుత్వం నీరు కాదు.. కన్నీరు మిగిల్చింది. కేవలం సింహాద్రిపురం మండలంలో కొద్దిపాటి నీరు మాత్రమే ఇచ్చి.. పులివెందుల ప్రాంతమంతా ఇచ్చామని చెప్పుకోవడం సిగ్గు చేటు. --- నాగభూషణరెడ్డి, మాజీ సర్పంచ్, లోపట్నూతల

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement