జలం కోసం దీక్ష
తొండూరు : పైడిపాలెం ప్రాజెక్టు నుంచి కృష్ణా జలాలను సంతకొవ్వూరు కెనాల్ ద్వారా విడుదల చేయాలని కోరుతూ రెండు రోజులుగా కెనాల్ వద్ద దీక్ష కొనసాగుతోంది. మంగళవారం సాయంత్రం 4గంటలకు ప్రారంభమైన దీక్ష బుధవారం రాత్రి వరకు కొనసాగినా అధికారుల్లో ఏమాత్రం చలనం లేదు. అధికారులు అధికార పార్టీకి వత్తాసు పలుకుతూ తొండూరు మండలానికి నీరు రాకుండా అడ్డుకట్ట వేస్తున్నారని రైతులు ఆందోళన చెందుతున్నారు. సంతకొవ్వూరు కెనాల్ కింద దాదాపు సుంకేసుల, రావులకొలను, బోడివారిపల్లె, బూచుపల్లె, మల్లేల, కోరవానిపల్లె తదితర గ్రామాలకు చెందిన రైతులు బోరుబావుల కింద సాగు చేసిన పంటలు, పండ్ల తోటలు వాడు దశకు చేరుకున్నాయి. గత 5 రోజులుగా హిమకుంట్ల చెరువుకు కృష్ణా జలాలను వదులుతున్న అధికారులు తొండూరు మండలం సంతకొవ్వూరు కెనాల్‌కు వదలకుండా పక్షపతం చూపడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత అన్యాయం జరుగుతున్నా జిల్లా స్థాయి అధికారులు పట్టించుకోలేదని.. వందలాది మంది రైతులు రేయింబవళ్లు కెనాల్ వద్ద పడిగాపులు కాస్తున్నా అధికారులు స్పందించకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
వైఎస్సార్‌సీపీ నాయకులు, రైతులతో చర్చించిన డీఎస్పీ, ఇరిగేషన్ ఎస్‌ఈ
సంతకొవ్వూరు కెనాల్‌కు కృష్ణా జలాలు విడుదల చేయాలని గత రెండు రోజులుగా దీక్ష చేస్తున్న రైతులు, వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి అంకిరెడ్డి సురేష్‌రెడ్డి, మండల పరిశీలకుడు బండి రామమునిరెడ్డి, మండల నాయకుడు భూమిరెడ్డి రవీంద్రారెడ్డి తదితర వైస్సార్‌సీపీ నాయకులతో బుధవారం మధ్యాహ్నం జమ్మలమడుగు డీఎస్పీ సర్కార్, మైనర్ ఇరిగేషన్ ఎస్‌ఈ చెంగయ్యలు చర్చించారు. 300 క్యూసెక్కుల నీటిని హిమకుంట్ల చెరువుకు తరలిస్తున్నారని.. అంతే కెపాసిటీతో సంతకొవ్వూరు కెనాల్‌కు నీటిని విడుదల చేయాల్సి ఉందన్నారు. కానీ కేవలం 50 క్యూసెక్కుల నీరు మాత్రమే సంతకొవ్వూరు కెనాల్‌కు విడుదల చేయాలని.. మిగతా 250 క్యూసెక్కుల నీటిని హిమకుంట్ల చెరువుకు విడుదల చేయాలని అధికారులను కోరినా వాటిలో ఎలాంటి మార్పు కానరాకపోవడంపై రైతుల్లో ఆందోళన నెలకొంది. దీంతో మండల కో ఆప్షన్ సభ్యుడు వెంకట్రామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ అధికారులు తమ గ్రామంపై చిన్నచూపు చూస్తున్నారని.. నీటిని ఇచ్చేంతవరకు ఇక్కడినుంచి కదిలే ప్రసక్తే లేదని తెగేసి చెప్పారు.
నీటిలో దూకి ఆత్మహత్యకు యత్నించిన రైతు
సంతకొవ్వూరు కెనాల్‌కు నీటిని విడుదల చేయాలంటూ కాలువ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్నా అధికారులు స్పందించకపోవడాన్ని నిరసిస్తూ బూచుపల్లె గ్రామానికి చెందిన నాగ ఈశ్వరయ్య అనే చీనీ రైతు కాలువలోకి దూకి ఆత్మహత్యకు యత్నించాడు. జమ్మలమడుగు డీఎస్పీ సర్కార్, ఎర్రగుంట్ల సీఐ శ్రీనివాసులు ఉన్నతాధికారులతో చర్చించి నీటిని విడుదల చేస్తామని హామీ ఇచ్చి కాలువలో నుంచి నాగఈశ్వరయ్యను బయటకు తీశారు.
పోలీసుల ప్రతాపం
కృష్ణా జలాల కోసం సంతకొవ్వూరు కెనాల్ వద్ద శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతులకు న్యాయం చేసేందుకు యత్నించాల్సిన పోలీసులు రైతులపై ప్రతాపం చూపుతున్నారు. దాదాపు 5మంది సీఐలు, 12మంది ఎస్‌ఐలు, 100మంది పోలీసులతోపాటు ప్రత్యేక బలగాలను తెప్పించి అధికారులు రైతులతో మాట్లాడకుండా చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీరు విడుదల చేసేంతవరకు పంపించేది లేదంటూ ఎస్‌ఈ చెంగయ్య వాహనాన్ని అడ్డుకున్న రైతులను పోలీసులు బలవంతంగా పక్కకు నెట్టడంతో పోలీసులు, రైతుల మధ్య ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రైతు సంఘం మండల నాయకుడు పల్లేటి ఈశ్వరరెడ్డి, జిల్లా కార్యదర్శులు రమణారెడ్డి, షఫి, తాలుకా ప్రధాన కార్యదర్శి దశరథరామిరెడ్డి, ఎంపీటీసీ శివశంకర్‌రెడ్డి, సర్పంచ్‌లు గురుమోహన్‌రెడ్డి, వెంకటచలమారెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు బాలనరసింహారెడ్డి, భాస్కర్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి, ద్వారకనాథరెడ్డి, కుమార్, రాఘవరెడ్డి, శేఖరరెడ్డి, రామమునిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.