'నా జీవితంలో సంతృప్తికి, అసంతృప్తికి తేడా లేదు'
న్యూఢిల్లీ : తెలంగాణ పీసీసీ పదవిని ఆశించి భంగపడిన మాజీమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డిని అధిష్టానం బుజ్జిగించింది. అసంతృప్తిగా ఉన్న ఆయన గురువారం కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్గాంధీతో భేటీ అయ్యారు. అనంతరం జానారెడ్డి మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు రావడమే తన ప్రధాన కర్తవ్యమన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో తాము ముందుండి పోరాడమన్నారు. అధిష్టానం నిర్ణయాన్ని తప్పుపట్టనని, ఇబ్బంది పెట్టనని చెప్పారు. తన జీవితంలో సంతృప్తికి, అసంతృప్తికి తేడా లేదని అన్నారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నడూ పదవి కోసం పాకులాడలేదని జానారెడ్డి వివరించారు. సీమాంధ్ర, తెలంగాణ పీసీసీ అధ్యక్షులు రఘువీరా, పొన్నాల లక్ష్మయ్యలకు జానారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలోని పరిస్థితుల్ని అధిష్టానం పెద్దలకు వివరించినట్లు ఆయన చెప్పారు. తాను చివరి వరకూ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని జానారెడ్డి పేర్కొన్నారు.