హైదరాబాద్: చావోరేవో తేల్చుకోవాల్సిన నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ దూకుడు మంత్రం జపించనుంది. ఇప్పటికే పార్టీ అభ్యర్థి కె.జానారెడ్డి విజయం కోసం నియోజకవర్గంలో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్న ఆ పార్టీ నేతలు శనివారం నుంచి దాన్ని మరింత ముమ్మరం చేయనున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డితోపాటు మిగిలిన నాయకులు శనివారం నుంచి నియోజకవర్గంలోనే మకాం వేయనున్నారని, పోలింగ్ ముగిసే వరకు ప్రచారంలో అధికార టీఆర్‌ఎస్‌కు తీసిపోకుండా ముందుకెళ్లేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. గత నెల 27న హాలియాలో జనగర్జన పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించి ప్రచారంలో ఊపు తెచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రచార గడువు ముగిసేలోపు మరోమారు నియోజకవర్గంలో బహిరంగ సభ నిర్వహించాలని యోచిస్తోంది. చివరి వారం రోజుల్లో నియోజకవర్గాన్ని చుట్టుముట్టి పోలింగ్‌కు ఉత్సాహంగా సిద్ధం కావాలని నేతలు భావిస్తున్నారు.
మండలాలవారీగా ఇన్‌చార్జీలు
ఇతర పార్టీల కంటే ముందుగానే కాంగ్రెస్ పార్టీ జానారెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. అంతకు రెండు నెలల ముందు నుంచే జానారెడ్డితోపాటు ఆయన తనయులు రఘువీర్, జైవీర్‌లు నియోజకవర్గంలో రెండు దఫాలుగా పర్యటించారు. స్థానిక నాయకులతో సమావేశాలు నిర్వహించడం, వారిని ఎన్నికలకు సిద్ధం చేయడంతోపాటు దూరమైన కొందరు నేతలను కలుపుకుని పోయే ప్రయత్నం చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత జానా అండ్ కో గత నెల 27న హాలియాలో నిర్వహించిన జనగర్జన బహిరంగ సభకు ఆశించిన మేర జనం హాజరు కావడం, రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నాయకులందరూ సభకు రావడంతో పార్టీ శ్రేణులు, అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. జానా, ఆయన తనయులకు ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం కూడా తోడు కానుంది. ఇప్పటికే టీపీసీసీ పక్షాన మండలాలవారీ ఇన్‌చార్జీలను నియమించిన ఉత్తమ్ శనివారం నుంచి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.
ఆయనతోపాటు రాష్ట్ర పార్టీ ముఖ్య నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భట్టి విక్రమార్క, రేవంత్‌రెడ్డి, అనుబంధ సంఘాల నేతలు, కార్యకర్తలు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు కూడా ప్రచారానికి హాజరయ్యేలా ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఆదివారం నుంచి ముఖ్యులంతా నియోజకవర్గంలోనే ఉండి టీఆర్‌ఎస్‌ను తలదన్నేలా ప్రచారం చేయాలని టీపీసీసీ నాయకత్వం నిర్ణయించింది. సాగర్ ఎన్నికల ప్రచారంపై టీపీసీసీ అ«ధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ‘సాక్షి’తో మాట్లాడుతూ ‘టీఆర్‌ఎస్ డబ్బులు వెదజల్లి, మద్యం పారించి గ్రామాల్లో హల్‌చల్ చేయాలని ప్రయత్నిస్తోంది. ఆ పార్టీ ఎన్ని డబ్బులిచ్చినా, ఎంత మద్యం పోసినా జానారెడ్డి గెలుపు ఖాయం. కాంగ్రెస్ కేడర్ విజయంపట్ల పూర్తిస్థాయి విశ్వాసంతో ప్రచారంలో ముందుకెళుతోంది. ఈ ఎన్నికల్లో జానా గెలుపే లక్ష్యంగా రాష్ట్ర కాంగ్రెస్‌లోని ముఖ్య నాయకులంతా ఐక్యంగా, ప్రణాళిక ప్రకారం ప్రచారంలో పాల్గొంటారు’అని వ్యాఖ్యానించారు.
చివరి వారమే కీలకం
ఎన్నికల ప్రచారంలో చివరి వారంరోజులు చాలా కీలకమని, ఆ సమయంలో విస్తృత ప్రచారానికి ఏర్పాట్లు చేసుకోవాలని కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. ముఖ్యంగా సీఎం కేసీఆర్ మరోమారు ఇక్కడ బహిరంగ సభ నిర్వహించే అవకాశం ఉండటం, ఇప్పటికే టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న నేపథ్యంలో తాము ఎక్కడా తగ్గలేదనే విధంగా నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు వెళ్లేలా రూట్‌మ్యాప్ తయారు చేసుకున్నారు. కోవిడ్‌తో ఇంటికే పరిమితమైన మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి ఈ నెల 5 తర్వాత ప్రచారంలో పాల్గొనే అవకాశముందని తెలుస్తోంది. సీఎం బహిరంగసభ నిర్వహించే తేదీని బట్టి మరోమారు తాము కూడా బహిరంగ సభ నిర్వహించాలని, ఈ సభకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌తోపాటు జానాతో సన్నిహిత సంబంధాలున్న జాతీయ నేతలను కూడా ఆహ్వానించాలని యోచిస్తున్నారు. చివరి వారంపాటు నియోజకవర్గంలోని గడప గడపనూ తొక్కి జానా గెలుపు కోసం ఓటర్లను అభ్యర్థించే వ్యూహంతో టీపీసీసీ సిద్ధమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment