నిడమనూరులో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేస్తున్న అభ్యర్థి రవికుమార్ నాయక్ (బీజేపీ), నోముల భగత్ (టీఆర్‌ఎస్), కుందూరు జానారెడ్డి (కాంగ్రెస్). చిత్రంలో ఎమ్మెల్యే రాజాసింగ్, మంత్రి జగదీశ్‌రెడ్డి, కోటిరెడ్డి, కొండేటి మల్లయ్య.
హైదరాబాద్: నాగార్జునసాగర్ ఉప ఎన్నికలవేళ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో కొత్త చర్చ మొదలయ్యింది. ఈ ఉప ఎన్నికల్లో పార్టీ ఆశించిన ఫలితంవస్తే ఎన్నికల అనంతరం రాష్ట్ర పార్టీలో భారీ మార్పులుంటాయని, ఈ విషయమై పార్టీ అధిష్టానం వద్ద ఇటీవల కీలక చర్చ జరిగిందని తెలుస్తోంది. గాంధీభవన్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి కె.జానారెడ్డి గెలిస్తే, ఆయన్నే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడిగా నియమించాలనే ఆలోచనలో అధిష్టానం ఉంది. టీపీసీసీ అధ్యక్షుడి నియామకం లో ఏం చేయాలనే ఆలోచనలో ఉన్న పార్టీ పెద్దలు.. ‘పెద్దాయన’అనే మంత్రంతో జానాను తెరపైకి తెచ్చి ఎలాంటి విభేదాలు, గొడవలు లేకుండా కార్యక్రమాన్ని ముగిస్తారని తెలుస్తోంది. అదే విధంగా 2023 ఎన్నికలను ఎదుర్కొనే బాధ్యతలను కూడా జానారెడ్డికి అప్పగించి, ప్రత్యామ్నాయ నేతగా ప్రతిపాదించి, ఆయన సారథ్యంలోనే ఎన్నికలకు వెళతారనే చర్చ ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.
ఆయనైతే అందరికీ ఓకే
టీపీసీసీ అధ్యక్ష వ్యవహారాన్ని సాగర్ ఉప ఎన్నికల వరకు వాయిదా వేస్తున్నట్టు కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించినా, ఇటీవల 10 జన్‌పథ్‌లో తెలంగాణ కాంగ్రెస్ గురించి కీలక చర్చ జరిగినట్టు తెలుస్తోంది. రాష్ట్రానికి చెందిన కీలక నేత ఒకరు ఇటీవల పార్లమెంటు సమావేశాల సందర్భంగా అధిష్టానంలోని ముఖ్య నాయకులతో ఇదే విషయమై చర్చించారని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీలో కీలక భూమిక పోషించిన మరో పెద్దాయన సూచన మేరకు ఈ ప్రతిపాదన పార్టీ ముందుంచి అధిష్టానాన్ని ఒప్పించేందుకు ప్రయత్నించారనే గుసగుసలు కాంగ్రెస్ పార్టీలో వినిపిస్తున్నాయి. ‘రాష్ట్రంలో పార్టీ అధ్యక్ష వ్యవహారం తలనొప్పిగా మారింది.
ఏకాభిప్రాయం వచ్చే అవకాశాలు అసలే కనిపించడం లేదు. జానారెడ్డి అయితే పార్టీలో చాలా సీనియర్. పలుమార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. గతంలో సీఎల్పీ నేతగా పనిచేశారు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా గెలిస్తే సీఎల్పీ నాయకుడిని చేయాలి. కానీ, ఆ పదవిలో దళిత నాయకుడు భట్టి విక్రమార్క ఉన్నారు. దళితుడిని ఆ పదవి నుంచి తొలగించి రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వడం పార్టీకి నష్టం కలిగిస్తుంది. అలాగని ఎమ్మెల్యేగా జానారెడ్డి గెలిచిన తర్వాత కూడా ఆయనకు ఏ పదవి ఇవ్వకుండా పీసీసీ హోదాలో మరో నేతను కూర్చోబెట్టడం ఆయన స్థాయికి తగింది కాదు. పార్టీలో ఏ స్థాయి నేతలనైనా సమన్వయం చేసుకునే సామర్థ్యం జానాకు ఉంది.
పీసీసీ అధ్యక్ష పదవి ఆశించిన కోమటిరెడ్డి, రేవంత్, జీవన్‌రెడ్డి, శ్రీధర్‌బాబు తదితరులు కూడా ఆయన అభ్యర్థిత్వాన్ని కాదనలేరు. వారికి ఇంకో రూపంలో కీలక బాధ్యతలు అప్పగించవచ్చు. అప్పుడు అధిష్టానం పని కూడా సులువవుతుంది.’అని ఆయన రాహుల్ అండ్ టీమ్‌కు వివరించినట్టు చర్చ జరుగుతోంది. అంతా విన్న 10 జన్‌పథ్ ముఖ్య నేతలు ఈ విషయంలో స్పష్టత ఇవ్వనప్పటికీ, ముందు నాగార్జునసాగర్‌లో గెలిచి రావాలని చెప్పినట్టు సమాచారం.
ముందస్తు వ్యూహంతోనే..!
వాస్తవానికి, గత రెండేళ్లుగా టీపీసీసీ అధ్యక్షుడి మార్పు వ్యవహారం అదుగో, ఇదుగో అంటూ నానుతూ వస్తోంది. ఈ పదవి కోసం పోటీ పడే నేతల జాబితా చాంతాడంత ఉండడం, షార్ట్‌లిస్ట్ చేసిన తర్వాత కూడా ఏకాభిప్రాయం రాకపోవడంతో అధిష్టానానికి ఈ వ్యవహారం తలనొప్పిగా మారింది. ఫలానా నాయకుడికి ఇవ్వాలని కొందరు, ఇవ్వొద్దని కొందరు, ఆయనకు తప్ప ఎవరికి ఇచ్చినా తమకు ఓకేనని కొందరు, ఫలానా నేతకు పగ్గాలిస్తే పార్టీ వీడతామని మరికొందరు చెప్పడంతో అధిష్టానం కూడా వేచి చూడక తప్పని పరిస్థితి ఏర్పడింది. అయితే, గత రెండు నెలల క్రితం టీపీసీసీ అధ్యక్ష వ్యవహారం ఓ కొలిక్కి వచ్చిందని, ఆ పదవికి సీనియర్ కాంగ్రెస్ నేత టి.జీవన్‌రెడ్డిని అధిష్టానం ఎంపిక చేసిందనే లీకులు కూడా వచ్చాయి.
ఈ నేపథ్యంలో అలర్ట్ అయిన జానా, మరికొందరు నేతలు అధిష్టానంతో సంప్రదింపులు జరిపి టీపీసీసీ అధ్యక్ష ప్రకటన నిలిపి వేయించారు. ఈ పరిస్థితుల్లో పార్టీ అధ్యక్షుడిని ప్రకటిస్తే తలనొప్పులు వస్తాయని, త్వరలోనే తాను పోటీ చేయబోయే సాగర్ ఉప ఎన్నిక వస్తున్నందున అప్పటివరకు ప్రకటించవద్దని నేరుగా అధిష్టానంతో మాట్లాడిన జానా.. ఈ మేరకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్‌తో అధికారిక ప్రకటన కూడా చేయించారు. సాగర్‌లో గెలిస్తే రాష్ట్ర పార్టీని హస్తగతం చేసుకోవాలనే వ్యూహంతోనే ఆయనతో పాటు ఆయనకు మద్దతిచ్చే కీలక నాయకులు ఈ వ్యూహాన్ని అమలు చేశారనే చర్చ ఇప్పుడు గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment