
జంగా కృష్ణమూర్తి (ఫైల్ ఫోటో)
పాలకవర్గాలు బీసీల సామాజిక ఆర్థిక గణన చేసి బహిర్గతం చేయలేదు..
సాక్షి, న్యూఢిల్లీ : జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్‌కు (బీసీ) రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించే బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలపడంపై వైఎస్సార్‌సీపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి హర్షం వ్యక్తం చేశారు. బీసీ కమిషన్‌కు రాజ్యాంగ బద్దత కల్పించడం ఆహ్వానించదగ్గ పరిణామం అని అన్నారు. దీనిపై శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘బిల్లుకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన వివిధ పార్టీల గౌరవ పార్లమెంట్ సభ్యులకు, గౌరవనీయులు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఏపీ బీసీ ప్రజల తరుఫున, వైఎస్సార్‌సీపీ తరుఫున ధన్యావాదాలు. బీసీ మేధావులు, ప్రజాసంఘాల ఉద్యమ ఫలితమే ఈ బిల్లు. రాజ్యాంగంలోని 123వ సవరణ బిల్లును రాజ్యసభ ప్రతిపాదనలను త్రోసిపుచ్చుతూ సభకు హాజరైన 406 మంది లోక్‌సభ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించడం హార్షనీయం.
రాజ్యసభ సవరణలతో ఆమోదించిన బిల్లును లోక్‌సభ సవరించడం చరిత్రలోనే ప్రప్రధమం. ఇప్పటి వరకు పాలకవర్గాలు బీసీల సామాజిక ఆర్థిక గణనచేసి బహిర్గతం చేయలేదు. రాజ్యసభ సభ్యులు కూడా బిల్లుకు ఏకగ్రీవంగా ఆమోదం తెలుపుతారని ఆశిస్తున్నాము. బీసీ కమిషన్‌కు ఈ కమిషన్‌కు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పిస్తే సివిల్ కోర్టుకు ఉండే అధికారాలు ఉంటాయి. ఈ బిల్లుతో బీసీ వర్గాలకు సామాజిక న్యాయం, సాధికారత కలుగుతాయి’ అని పేర్కొన్నారు. బీసీలకు చట్టసభలలో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్స్ కల్పించాలని, ఎస్సీ,ఎస్టీలకు రిజర్వేషన్స్ కొనసాగించాలని కోరుతూ.. వైఎస్సార్‌సీపీ సభ్యుడు విజయసాయి రెడ్డి ప్రవేశపెట్టిన బిల్లు త్వరలో చర్చకు రానుంది. దీనిపై కూడా జంగా హర్షం వ్యక్తం చేశారు.