
సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు ఊసరవెల్లిలా రంగులు మారుస్తూ ఎన్ని పాచికలు వేసినా ఆయనను బీసీలు నమ్మరని వైఎస్సార్‌సీపీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు బీసీల ఆత్మాభిమానంతో ఆడుకుని.. ఇప్పుడు వారి పట్ల బాబు మొసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం కృష్ణమూర్తి మీడియాతో మాట్లాడారు. పూలే, అంబేడ్కర్ ఆశయాల సాధన దిశగా జగన్ పాలన సాగుతోందన్నారు. పథకాలకు అర్హులై ఉండి సకాలంలో దరఖాస్తులు చేసుకోకుండా మిగిలిపోయిన వారికి సైతం సీఎం లబ్ధి చేకూరుస్తున్నారన్నారు.
ఇందుకోసం అర్హులకు మళ్లీ నెల రోజులు గడువిచ్చి లబ్ధిదారులను ఎంపిక చేస్తున్న తీరును ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు స్వాగతిస్తున్నాయని తెలిపారు. బాబు హయాంలో లబ్ధిదారులకు పథకాలను ఎగ్గొట్టడంతోపాటు కోతలు పెట్టారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 9, 10, 11, 12 తేదీల్లో వివిధ పథకాలకు సంబంధించి నేరుగా లబ్ధిదారులకు సొమ్మును జమ చేయబోతుందని చెప్పారు. బడుగు, బలహీనవర్గాలకు 61 శాతం పార్టీ పదవులు కేటాయించామని టీడీపీ ప్రచారం చేసుకోవడం ఆ వర్గాలను తప్పుదోవ పట్టించడమేనని మండిపడ్డారు. బాబు సీఎంగా ఉన్నప్పుడు బీసీలకు ఎందుకు అధికారిక పదవులు ఇవ్వలేదని నిలదీశారు.